BHIM NEWS

Telugu News Channel

శాస్త్ర, సాంకేతికం పట్ల విద్యార్థుల సృజనాత్మకతే ఇన్స్పైర్ : డీఈవో వి. శేఖర్

1 min read
Spread the love

భీమ్ న్యూస్ ప్రతినిధి శ్రీకాళహస్తి  (ఫిబ్రవరి 12) తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి జడ్పీ బాలుర హైస్కూల్లో శనివారం ప్రారంభమైన రెండు రోజుల జిల్లాస్థాయి ఇన్స్పైర్‌ మనక్‌ వైజ్ఞానిక ప్రదర్శనలో పలువురు విద్యార్థులు తమ ఆవిష్కరణలతో ప్రముఖుల మెప్పు పొందారు.దైనందిన జీవనంలో ఎదురయ్యే సమస్యలను అధిగమించే సరికొత్త ఆలోచనలకు విద్యార్థులు శ్రీకారం చుట్టారు. ఆదివారం పట్టణంలోని ఆర్ పి బి ఎస్ ఉన్నత పాఠశాలలో ఇన్స్పైర్ మనకు వైజ్ఞానిక ప్రదర్శన రెండవ రోజు జరిగింది ముగింపు సందర్భంగా ఎమ్మెల్సీ సిపాయి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిపాయి సుబ్రహ్మణ్యం హాజరై ప్రసంగించారు. విద్యార్థులందరూ సమాజ హితం కోసం ప్రధాన లక్ష్యంగా చదువుకొని ప్రగతిని సాధించాలని కోరారు. గురువుల తల్లిదండ్రుల యొక్క ఆశయాలకు అనుగుణంగా విద్యార్థులు అభివృద్ధి చెందాలని అన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి వి శేఖర్ మాట్లాడుతూ శాస్త్రీయ పరిశోధనల పట్ల విద్యార్థులందరూ ఏకాగ్రతతో చైతన్యవంతులు కావాలని కోరారు. జిల్లా స్థాయిలో వైజ్ఞానిక ప్రదర్శనలో 330 నమూనాలను విద్యార్థులు, ఉపాధ్యాయులు అందుబాటులో ఉంచారని, వీటిలో 33 పరిశోధనలు రాష్ట్రస్థాయిలో ఎంపిక కాబడ్డాయని తెలిపారు.

రైలు పట్టాలపై విద్యుదుత్పత్తి:

రేణిగుంట జడ్పీ హైస్కూల్లో టెన్త్‌ చదువుతున్న ఈ రవీంద్ర ఉపాధ్యాయుడు నాగరాజు సూచనలతో రైలు పట్టాలపై విద్యుదుత్పత్తి ప్రయోగాన్ని ఆవిష్కరించారు. పట్టాలపై రైలు చక్రాలు దొర్లే సమయంలో మెకానికల్‌ ఎనర్జీ ఉద్భవిస్తుంది. దీనినే కైనెటిక్‌ ఎనర్జీ అంటారు. రైలు పట్టాలపై డైనమో సిద్ధాంతం ద్వారా మెకానికల్‌ ఎనర్జీతో విద్యుదయస్కాంత శక్తిని ఉత్పత్తి చేయవచ్చు. దానిని ఏసీ కరెంటుగా నిల్వ చేసుకోవడం ద్వారా తిరిగి అవసరాలకు బీసీ కరెంటుగా కన్వర్ట్‌ చేసుకోవచ్చు. రైలు పట్టాలపై వృధాగా పోతున్న మెకానికల్‌ శక్తిని విద్యుత్‌ శక్తిగా మార్చే ఆలోచన ఇది.

కునుకుతో ప్రమాదాలకు చెక్‌:

చంద్రగిరి మండలం ఐతేపల్లి జడ్పీ హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్న నిహిత టీచరు సురేష్‌ పర్యవేక్షణలో కునికిపాట్లతో జరిగే రోడ్డు ప్రమాదాలకు చెక్‌ పెట్టే ప్రయోగాన్ని ప్రదర్శించింది.కనురెప్పల కదలిక ఆధారంగా పనిచేసే కళ్ళజోడును రూపొందించింది.డ్రైవింగులో ఈ కళ్లద్దాలు ధరించి వాహనం నడుపుతున్నప్పుడు కునుకు తీస్తే వెంటనే అద్దాల నుంచి శబ్దంతో హెచ్చరిక వస్తుంది. అలాగే వైబ్రేషన్‌ రావడంతో డ్రైవరు అప్రమత్తం కావచ్చు.

గుండెపోటును ముందుగానే గుర్తిస్తే:

బుచ్చినాయుడు కండ్రిగ మండలం సహజ హైస్కూల్లో పదవ తరగతి చదువుతున్న కార్తీక్‌ ఉపాధ్యాయుడు సురేష్‌ నాయుడు పర్యవేక్షణలో మంచి ప్రయోగాన్ని ప్రదర్శించాడు. ఇటీవల గుండెపోటుతో చాలామంది హఠాన్మరణం చెందుతున్న నేపథ్యంలో హృదయ స్పందనను ముందుగానే పసిగట్టి ఆ వ్యక్తికి అలారం రూపంలో హెచ్చరిక వస్తే వెంటనే వైద్యం పొందవచ్చు కదా అని ఆలోచించాడు. ఎలకా్ట్రనిక్‌ సెన్సార్‌ ద్వారా గుండెపోటు సంభవించడానికి ముందు శబ్దంతో పాటు హృదయ స్పందనలో తేడాలను డిస్ల్పేలో ఈ పరికరం చూపుతుంది.

మద్యం సేవిస్తే బండి నడవదంతే:

శ్రీకాళహస్తి పట్టణం బాబు అగ్రహారంలోని హైస్కూల్లో పదవ తరగతి చదువుతున్న పవన్‌ కుమార్‌. ఉపాధ్యాయురాలు వరలక్ష్మి పర్యవేక్షణలో ఈ ప్రయోగాన్ని ప్రదర్శించాడు.మద్యం సేవించి డ్రైవింగ్‌ చేయడం ద్వారా రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్న విషయం తెలిసిందే. వీటిని అరికట్టేందుకు ఆల్కహాల్‌ సెన్సార్‌, వాయిస్‌ సెన్సార్‌, మైక్రో కంట్రోలర్‌ పరికరాలతో సర్క్యూట్‌ను రూపొందించారు. వాహనంలోని ఇంజన్‌కు దీన్ని అనుసంధానం చేస్తారు. డ్రైవర్‌ మద్యం సేవించి సీట్లో కూర్చొగానే నోటి నుంచి వెలువడే వాసన, మాటల శబ్దాల నుంచి ఈ పరికరం మద్యం పరిమాణాన్ని గుర్తిస్తుంది. పరిమితి దాటినట్లు మైక్రో కంట్రోలర్‌ నిర్ధారణకు వస్తే వెంటనే ఇంజన్‌ దానంతట అదే ఆగిపోతుంది.డ్రైవర్‌ మారేవరకు వాహనం కదలదు.

ఈ కార్యక్రమంలో మొదటిరోజు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, జాయింట్ కలెక్టరు శుభం బన్సాల్ పాల్గొనగా, రెండో రోజున ఆదివారం ఎమ్మెల్సీ సిఫాయిసుబ్రహ్మణ్యం, జిల్లా విద్యాశాఖ అధికారి వి. శేఖర్, జిల్లా సైన్స్ అధికారి భాను ప్రసాద్, సిఎంఓ సురేష్ , ఏఎంఓ శివశంకర్, మండల విద్యాశాఖ అధికారులు భువనేశ్వరి, బాలయ్య వివిధ పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు, సీఆర్పీలు ప్రసాద్, ముని మహన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *