రాష్ట్రంలో ఎన్నికల కోడ్ – విధి విధానాలు: ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి
1 min readభీమ్ న్యూస్ ప్రతినిధి అమరావతి (మార్చి 17) ఏపీ లో 2024 ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటనతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు.
శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో పోలింగ్ మే 13 తేదీన జరుగుతుందన్నారు. నోటిఫికేషన్ ఏప్రిల్ 18 తేదీన విడుదల అవుతుందన్నారు. నేటికి రాష్ట్రంలో 4.09 కోట్ల మంది ఓటర్లు నమోదయ్యారన్నారు. తుది ఓటర్ల జాబితా ప్రకారం 4.07 కోట్ల మంది ఉన్నారన్నారు. కొత్తగా ఈ నెలన్నర రోజుల్లో 1.75 లక్షల మంది ఓటు హక్కు నమోదు చేసుకున్నారన్నారు. ఇవాళ్టి నుంచి కొత్త దరఖాస్తులు, తొలగింపు దరఖాస్తులు ఫ్రీజ్ చేస్తున్నామన్నారు. అయితే నోటిఫికేషన్ విడుదలకు 10 రోజుల వరకూ ఉన్న దరఖాస్తుల పరిష్కరిస్తామన్నారు.
46 వేల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు :
“ఏపీలో మొత్తం 46,165 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు చేస్తున్నాం. అత్యవసరంగా మరికొన్ని పోలింగ్ కేంద్రాలు ప్రత్యామ్నాయంగా పెడుతున్నాం. ఈసారి మహిళా సిబ్బంది మాత్రమే ఉన్న 179 పోలింగ్ కేంద్రాలు, యువ సిబ్బంది ఉన్న 50 మోడల్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. ఓటర్ ఎపిక్ కార్డుతో పాటు 12 రకాల గుర్తింపు కార్డులు వినియోగించుకోవచ్చు. ప్రతి పోలింగ్ కేంద్రాల్లో కనీస సౌకర్యాలు ఉండేలా ఏర్పాట్లు చేశాం. 85 ఏళ్లు నిండిన ఓటర్లలకు ఇంటి నుంచే ఓటు చేసేలా ఏర్పాట్లు చేశాం. నోటిఫికేషన్ వచ్చాక రిటర్నింగ్ అధికారికి దరఖాస్తు చేసుకోవచ్చు. దాన్ని పోస్టల్ బ్యాలెట్ గా గుర్తిస్తాం. 10 రోజుల ముందే ఓటు వేసేలా చర్యలు తీసుకుంటాం. ఈసారి అన్ లైన్ నామినేషన్ అవకాశం కల్పిస్తున్నాం. అఫిడవిట్ లో ఎలాంటి ఖాళీ లేకుండా పూర్తి చేసి ఇవ్వాల్సిందే. క్రిమినల్ కేసులు ఉన్న అభ్యర్థులు మూడు మార్లు పత్రికల్లో ప్రకటన ఇవ్వాల్సిందేనని ముఖేష్ కుమార్ మీనా తెలిపారు.
ఉపాధ్యాయులతోనే ఎన్నికలు నిర్వహణ :
ఉపాధ్యాయులు లేకుండా ఏపీలో ఎన్నికలే జరగవని ముఖేష్ కుమార్ మీనా అన్నారు. వారినే ఎన్నికల ప్రక్రియలో వాడుకుంటున్నామన్నారు. ఈసారి పోలింగ్ కేంద్రాల్లో భద్రతను బాగా పెంచామన్నారు. ప్రతీ పోలింగ్ కేంద్రంలో కనీసం ఇద్దరూ ముగ్గురూ ఉండేలా చర్యలు చేపట్టామన్నారు.
వాలంటీర్లకు ఎన్నికల విధుల్లేవు :
“రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేసింది. 24 గంటల్లో రాజకీయ నేతల ఫొటోలు ప్రభుత్వ కార్యాలయాలు, భవనాలు, ఆస్తుల నుంచి తొలగించాలి. ప్రభుత్వ ఖర్చుతో అధికార పార్టీ టీవీ, పత్రికల్లో ఇచ్చే ప్రకటనలు తొలగించాలి. సీఎం ఫొటోలను కార్యాలయాలు, లబ్దిదారులకు ఇచ్చే వివిధ కార్డులపై ఉండేందుకు వీల్లేదు. కొత్త పనులు చేపట్టేందుకు అవకాశం లేదు. రాష్ట్ర అధికార యంత్రాంగం అంతా ఇప్పుడు ఈసీ అధీనంలోకి వచ్చింది. మంత్రులు, ప్రజాప్రతినిధులకు ప్రోటోకాల్ లేదు. ప్రధాని మినహా ఎవరికీ సెక్యూరిటీ, ప్రోటోకాల్ ఉండేందుకు వీల్లేదు. వ్యక్తులు, సంస్థలకు భూ కేటాయంపులపై ఈసీ అనుమతి కావాల్సిందే. సీఎంఆర్ఎఫ్ నిధులు కూడా ఇచ్చేందుకు వీల్లేదు. వాలంటీర్లు ఎక్కడా ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు వీల్లేదు. సచివాలయం ఉద్యోగుల్లో ఒకరిని ఎన్నికల విధుల్లో వాడుకునేందుకు అవకాశం ఉంది. కేవలం వారిని ఇంకు వేసేందుకు మాత్రమే వినియోగిస్తాం. ఇప్పటికే ఈసీఐ దీనిపై మార్గదర్శకాలు జారీ చేసింది.
రెండు లక్షల ఈవీఎంలు ఏర్పాటు :
ఎన్నికల షెడ్యూల్ ప్రకటన రాక ముందు నుంచే రాష్ట్రంలోకి వచ్చే రహదారుల్లో చెక్ పోస్టులు పెట్టామని ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఇప్పటి వరకూ 164 కోట్ల విలువైన నగదు, వస్తువులు, డ్రగ్స్, మద్యం సీజ్ చేశామన్నారు. ఉచితాలు, నగదు తరలింపు కోసం అన్ని కేంద్ర, రాష్ట్ర ఏజెన్సీలతో నిఘా పెట్టామని తెలిపారు. హెలికాప్టర్లు, విమానాల ద్వారా తరలించేందుకు అవకాశం లేకుండా తనిఖీలు చేస్తున్నామన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్ లు కూడా ఏర్పాటు చేశామని చెప్పారు. ఈసారి ఎన్నికలకు పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈసారి బందోబస్తు కోసం 1,14,950 మంది సివిల్ పోలీసులు, 58 కంపెనీల పారామిలటరీ బలగాలు, 465 కంపెనీల సాయుధ బలగాలు అవసరం అవుతున్నారని చెప్పారు. ఏపీకి 2 లక్షల ఈవీఎం యంత్రాలను ఈసీఐ కేటాయించిందని ముఖేష్ కుమార్ మీనా తెలిపారు.
121 చెక్ పోస్టుల్లో తనిఖీలు :
రాష్ట్రంలో 2,18,515 మంది పోలీసు సిబ్బంది బందోబస్తు కోసం అవసరం అవుతున్నారని పోలీస్ ఎన్నికల నోడల్ అధికారి శంకబ్రత బాఘ్చి అన్నారు. రాష్ట్ర పోలీసులు, ఇతర రాష్ట్రాలకు చెందిన పోలీసులు, కేంద్ర బలగాలు, ఎక్స్ సర్వీస్ మెన్ ను కూడా నియమిస్తున్నామన్నారు. ప్రస్తుతం ఏపీలో 121 చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. ఇంకా చాలా అవసరం అవుతాయని చెప్పారు. ఓటర్లను మభ్య పెట్టేందుకు చేసే ప్రయత్నాలను అడ్డుకునేలా చర్యలు ఉంటాయన్నారు. ఉచితాలు, నగదు, మద్యం తదితర అంశాలను అడ్డుకునేలా నిఘా పెడుతున్నామని చెప్పారు.