April 24, 2024

BHIM NEWS

Telugu News Channel

ఒకేరాజధాని – అభివృద్ధి వికేంద్రీకరణే నినాదం : నారా లోకేష్

1 min read

భీమ్ న్యూస్ ప్రతినిధి  మంగళగిరి (మార్చి 19)          ఏపీ లో ఒకేరాజధాని – అభివృద్ధి వికేంద్రీకరణయే టీడీపీ -జనసేన -బిజెపి కూటమి నినాదం అన్నారు. మంగళగిరి టీడీపీ అభ్యర్థి నారా లోకేష్. పాలనా సౌలభ్యం కోసం ఒకేచోట రాజధాని ఏర్పాటుచేసి.. అభివృద్ధిని వికేంద్రీకరించాలన్నది టీడీపీ కూటమి విధానమని తెలిపారు. ఎన్నికల షెడ్యూలు వెలువడటంతో మంగళగిరి నియోజకవర్గం ఆత్మకూరు మిడ్ వ్యాలీ సిటీలో బ్రేక్ ఫాస్ట్ విత్ లోకేష్ అనే కార్యక్రమంతో యువనేత ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు.

గత ఐదేళ్లుగా ప్రజారాజధాని అమరావతిలో ఆగిపోయిన పనులన్నింటినీ అధికారంలోకి వచ్చాక ప్రారంభిస్తామన్నారు. వచ్చే 10 ఏళ్లలో సమర్థమైన ప్రభుత్వం ఉంటేనే ఈ కష్టాల నుంచి గట్టెక్కగలమన్నారు. రాష్ట్రంలో ప్రతి గడపకు సురక్షితమైన తాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. రెండు నెలలు ఓపిక పడితే ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటై రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టిస్తామన్నారు.

అప్పులతో కాకుండా అభివృద్ధి చేసి రాష్ట్ర ఆదాయం ద్వారా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలన్నది తెలుగుదేశం పార్టీ విధానమన్నారు. 2014లో చంద్రబాబునాయుడు సున్నాతో పాలన ప్రారంభించారని, గత అయిదేళ్లలో జగన్ విధ్వంస పాలన కారణంగా 30ఏళ్లు వెనక్కివెళ్లిందన్నారు. అయినా రాష్ట్రాభివృద్ధికి అవసరమైన సమగ్ర ప్రణాళిక తమ వద్ద ఉందని తెలిపారు. పరిశ్రమలు రప్పించడం ద్వారా లక్షల ఉద్యోగాలు కల్పిస్తే రాష్ట్ర ఆదాయం రెట్టింపు అవుతుందని, చంద్రబాబు గారి ఆలోచనలమేరకు 20లక్షలు ఉద్యోగాలు కల్పించడం ద్వారా రెండున్నర రెట్లు పెరుగుతుందని చెప్పారు.ఆదాయం పెంపుదల ద్వారా ఇప్పటికంటే మెరుగైన సంక్షేమాన్ని ప్రజలకు అందించడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. దేశానికి సంక్షేమాన్ని పరిచయం చేసిన వ్యక్తి అన్న ఎన్టీఆర్ అన్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి విద్యావంతులు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. జగన్ మూడు ముక్కలాటతో తీవ్రంగా నష్టపోయామన్నారు. అటు విశాఖ, ఇటు అమరావతి, కర్నూలు ఏదీ అభివృద్ధి చెందలేదని.. రాష్ట్రంలో పరిస్థితులు బీహార్ కంటే దారుణంగా తయారయ్యాయని విమర్శించారు. జగన్ పాలనలో రాష్ట్రానికి కొత్తగా పరిశ్రమలు రాకపోగా.. ఉన్న పరిశ్రమలు పొరుగు రాష్ట్రాలకు తరలివెళ్లాయని ధ్వజమెత్తారు. చంద్రబాబు మొదలుపెట్టిన పనులు కొనసాగించి ఉంటే లక్షలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించేవన్నారు.

భావప్రకటన స్వేచ్ఛను వైసీపీ ప్రభుత్వం కాలరాసిందని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలు వెల్లడించిన మహిళలపై వైఎస్సార్‌సీపీ బ్యాచ్ అసభ్యకరమైన కామెంట్స్ పెడుతున్నారని.. వారిపై ఎలాంటి చర్యలు లేవన్నారు. తన తల్లిని కూడా అవమానించారని.. మహిళలను గౌరవించే విధంగా విద్యావ్యవస్థలో మార్పులు తీసుకువస్తామన్నారు. చంద్రబాబును అసెంబ్లీ సాక్షిగా నారాయణస్వామి అసభ్య పదజాలంతో అవమానిస్తే ముఖ్యమంత్రి కనీసం స్పందించలేదన్నారు. పైగా ప్రతిపక్షనేతలను బాగా తిడితేనే టిక్కెట్లు ఇస్తామని జగన్ నిస్సిగ్గుగా ఆ పార్టీవారికి చెబుతున్నారన్నారు. ఇటువంటి వారికి ఓటుతోనే ప్రజలు బుద్దిచెప్పాల్సి ఉందన్నారు. వివేకా హత్య కేసులో నారాసుర రక్త చరిత్ర అంటూ దుష్ప్రచారం చేశారని.. ఇవాళ ఆయన సొంత కూతురే వివేకాను ఎవరు చంపారో బయటకు తేల్చాలని పదేపదే చెప్పారన్నారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *