April 24, 2024

BHIM NEWS

Telugu News Channel

ఓటర్లును, పోలింగ్ ఏజెంట్ లను ప్రలోభాలకు, భయ భ్రాంతులు గురి చేయకూడదు: జిల్లా ఎన్నికల అధికారి

1 min read

 

   భీమ్ న్యూస్ ప్రతినిధి తిరుపతి (మార్చి 23) ఏపీ రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో స్వేచ్ఛాయుత వాతావరణంలో సాధారణ ఎన్నికలు జరిగేందుకు సహకరించాలని, ఓటర్లు ప్రశాంతంగా స్వేచ్చగా ఓటు హక్కు వినియోగించుకునేలా రాజకీయ పార్టీలు, పోలింగ్ ఏజెంట్లు అందరూ సహకరించాలని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డా. జి. లక్ష్మీ శ అన్ని రాజకీయ పక్షాలకు కోరారు. శనివారం సాయంత్రం ఎన్నికల ప్రవర్తన నియమావళి, నామినేషన్లు, ప్రచారం, పోలింగ్, కౌంటింగ్, ఎన్నికల యాప్ లపై త‌దిత‌ర‌ ఎన్నికల ప్రక్రియపై రాజకీయ పార్టీలకు చెందిన ప్రతినిధులతో స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి అధ్యక్షతన విస్తృత అవ‌గాహ‌న సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మార్చి 16న కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుద‌ల చేసిన రోజు నుంచే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిందని గుర్తు చేశారు. నాటి నుంచి ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ఈ కోడ్ అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రతి రాజకీయ పక్షం నడుచుకోవాల్సి ఉంటుందని తెలిపారు. స్వేచ్చాయుత వాతావరణంలో, పారదర్శకంగా ప్రజలు ఓటు హక్కును వినియోగించుకునేలా రాజకీయ పక్షాలు సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి విజ్ఞప్తి చేశారు.

జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం క‌ల‌గ‌కుండా రాజ‌కీయ ప‌క్షాలు వ్య‌వ‌హ‌రించాల‌ని, ఓటర్లు స్వేచ్చగా తమ ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రజాస్వామ్యాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని, ప్రజలు నిర్భయంగా వారి ఓటు హక్కును వినియోగించుకునేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని, తగినంత పోలీస్ బందోబస్తు, కేంద్ర బలగాల మోహరింపు ఉంటుందని, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మైక్రో అబ్జర్వర్ గా ఉంటారని, వెబ్ కాస్టింగ్ ఏర్పాటుతో పాటు వీడియోగ్రఫీ ఉంటుందని, ఎట్టి పరిస్థితిలో హింసాత్మక సంఘటనలు చేసుకోరాదని, రీ పోల్ కు తావు లేకుండా అన్ని చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఓటరును ప్రలోభాలకు గురిచేయడం, భయపెట్టడం చేయరాదని రాజకీయ పక్షాలకు వివరించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిన క్షణం నుంచి జిల్లాలోని వివిధ రాజకీయ పక్షాలకు చెందిన విగ్రహాలకు ముసుగులు వేశామ‌ని, కటౌట్లు, జెండాలు, హోర్డింగులను తొలగించామ‌ని పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల ప్రాంగణాల్లోని వాణిజ్య స్థలాల్లో ఎటువంటి రాజకీయ ప్రకటనలు, హోర్డింగులు, పోస్టర్లు, బ్యానర్లను అనుమతించబోమని తేల్చిచెప్పారు. ర్యాలీలు, మైక్, వాహనాలను వినియోగించుకోవాలన్నా రిటర్నింగ్ అధికారి అనుమతి తప్పనిసరి అని, అయితే ఇందుకోసం సువిధ యాప్ ఉందని, అందులో ముందుగా 48 గంటల ముందు నమోదు చేసుకున్నవారికి రాజకీయ పక్షాలపై వివక్ష లేకుండా తొలి ప్రాధాన్యతగా అనుమతులు ఇవ్వడం జరుగుతుందని క‌లెక్టర్ స్ప‌ష్టం చేశారు. ఎన్నికల నియమావళి అమలు నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభం వరకు చేసిన ఖర్చులన్నీ ఆయా పార్టీ ఖాతాల్లో నమోదు చేస్తామని, నామినేషన్ల ప్ర‌క్రియ‌ ప్రారంభం నుంచి అభ్యర్థి వ్యక్తిగత ఖాతాల్లో నమోద‌వుతాయ‌ని చెప్పారు. రాజకీయ పక్షాలకు చెందిన ప్రతి అభ్యర్ధిపై నిఘా ఉంటుందని, వారు ఖర్చు చేసే ప్రతి పైసాను ఎన్నికల వ్యయంలో లెక్కిస్తామ‌ని పేర్కొన్నారు. ఆర్ఓ అనుమతి లేకుండా బైకు ర్యాలీ, ఇతర ర్యాలీలను నిర్వహించరాదని, అనుమతి లేకుండా ర్యాలీలు నిర్వహిస్తే ఉపేక్షించేది లేదని, కోడ్ ఉల్లంఘనగా భావించి బాధ్యులపై చర్యలు ఉంటాయని తెలిపారు.

పౌరులు ఎవరైనా ఎన్నికల కోడ్ ఉల్లంఘన చర్యలను గుర్తించినచో సి.విజల్ యాప్ నందు తమ ఫిర్యాదులను నమోదు చేయవచ్చని, నమోదు చేసిన 100 నిమిషాల్లో స్పందించి ఫిర్యాదుదారునికి తీసుకున్న చర్యలు గురించి తెలియ‌జేస్తామ‌ని చెప్పారు. సి-విజిల్ యాప్ వినియోగంపై వీడియో ప్రదర్శన ద్వారా వివరించారు. రాజ‌కీయ పార్టీ లేదా వ్యక్తులు ఓటర్లను, పోలింగ్ ఏజెంట్ లను ప్రలోభాలకు, భయ భ్రాంతులు గురి చేయకుండా ఎన్నికల వేళ ప్రజలు నచ్చిన విధంగా ఓటు హక్కును వినియోగించుకునేలా చేయడం కొరకే ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రధాన ఉద్దేశ‌మన్నారు. వాహనాలు, ర్యాలీలు, సభల నిర్వహణ కోసం వినియోగించుకునే ప్రాంగణాల కోసం సువిధ యాప్ నందు దరఖాస్తు చేసుకొని సంబంధిత RO నుండి అనుమతులు తీసుకోవచ్చునని తెలిపారు. వాహనాలు ఎవరి పేరున తీసుకున్నారో, వారు మాత్రమే వినియోగించుకోవాలని, వేరే వ్యక్తులు వినియోగించినట్లు అయితే కోడ్ ఉల్లంఘన కింద వాహనాలను సీజ్ చేస్తామన్నారు. ప్రజలకు ఇబ్బంది కలిగించేలా సమావేశాలు, లౌడ్ స్పీకర్లను వినియోగించరాదన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, డి ఆర్ ఓ పెంచల కిషోర్, ఈఆర్ఓ లు అదితి సింగ్, కిరణ్ కుమార్, రవి శంకర్ రెడ్డి, నిషాంత్ రెడ్డి, చంద్రముని, నోడల్ అధికారులు మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *