April 24, 2024

BHIM NEWS

Telugu News Channel

రేణిగుంటలో పట్టుబడ్డ వైసీపీ ఎన్నికల తాయిలాలు

1 min read

 

         భీమ్ న్యూస్ ప్రతినిధి రేణిగుంట (మార్చి 26) తిరుపతి జిల్లా రేణిగుంటలోని రామకృష్ణాపురం సీడబ్ల్యూసీ  గోదాముల వద్ద వైఎస్సార్సీపీ ప్రచార సామాగ్రికి సంబంధించిన ఓ లారీని ఈసీ ఫ్లయింగ్ స్క్వాడ్ స్వాధీనం చేసుకుంది. లారీలో ఉన్న వైఎస్సార్సీపీ టోపీలు, టీ- షర్టులు, జెండాలు, బ్యానర్లు తదితర ప్రచార సామాగ్రిని ఎన్నికల అధికారులు సీజ్ చేశారు. ఎన్నికల్లో ఓటర్లకు పంచడానికి కుక్కర్లు సహా ఇతర సామాగ్రి ఉన్నట్లు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వీటిని ఇతర ప్రాంతాలకు తరలించేందుకు వైఎస్సార్సీపీ నేతలు యత్నిస్తున్నారనీ తెలిపారు. దీంతో అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఓ వైపు ఎన్నికల కోడ్​ వచ్చినా అధికార పార్టీ శ్రేణులు క్షేత్ర స్థాయిలో ప్రచారాలు, ప్రజల్ని ప్రలోభ పెట్టే పనులు మాత్రం మానుకోవడం లేదు. ప్రచారాల విషయమై ఎన్నికల అధికారులు వాలెంటీర్ల మీద కొరడా ఝులిపించినా వైఎస్సార్సీపీ కార్యకర్తల, పార్టీకి కొమ్ము కాస్తున్న కార్యకర్తల తీరు మారడం లేదని పలువురు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో పంపిణీ చేయడం కోసం పలు రకాల వస్తువులను అధికార పార్టీ డంప్ చేసిందని వాటి పంపిణీ ద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ఆలోచనతోనే ఈ విధమైన తాయిలాలను పంచడానికి సిద్ధమైందని టిడిపి నాయకులు, కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.

విషయం తెలుసుకున్న తిరుపతి పార్లమెంట్ తెలుగు యువత అధ్యక్షులు అక్షింతల కృష్ణ యాదవ్ ఇతర టీడీపీ నాయకులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. గౌడన్ తెరిచి అందులో ఉన్న సామాగ్రిని కూడా సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. గౌడన్ తెరిచే వరకు ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తే లేదని భీష్మించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో యథేచ్ఛగా ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్నారని పేపర్ లో కథనాలు వస్తున్నా కూడా పోలీసులు చోద్యం చూస్తున్నారని విమర్శించారు. టీడీపీకి సంబంధించిన కేవలం పది పాంప్లెట్లు ఉంటేనే కారును పోలీస్ స్టేషన్ వరకు తీసుకెళ్లి నానా ఇబ్బందులు పెట్టారని, ఇంత భారీగా తరలిస్తున్న వైయస్సార్ పార్టీ ప్రచార సామాగ్రిని పోలీసులు చూసి చూడనట్టు వ్యవహరించడం బాధాకరమన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *