మేమంతా సిద్ధం – ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ పాత పాటే!
1 min readభీమ్ న్యూస్ ప్రతినిధి ప్రొద్దుటూరు (మార్చి 27) వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరులో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కడప జిల్లా ప్రజలను తనను బిడ్డలా చూసుకున్నారని తెలిపారు. పేద ప్రజలకు రూ. 2 లక్షల 70 వేల కోట్లు సంక్షేమ పథకాల రూపంలో పంచామని తెలిపారు. 2024 ఎన్నికలకు తామంతా సిద్ధంగా ఉన్నామని జగన్ పేర్కొన్నారు.
ఉద్యోగాల ఊసే లేదు :
ఐదేళ్ల సమయంలో నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధిని ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆశించిన మేర ఉద్యోగావకాశాలను సృష్టించలేకపోయింది. నిరుద్యోగ యువతను కనీస వేతనాలకు నోచుకోని అసంఘటిత రంగం వైపు నెట్టింది. సంక్షేమ కార్పొరేషన్ల బడ్జెట్ మొత్తాన్ని ఆ వర్గాలకే పరిమితం చేయకుండా నవరత్నాలకు మళ్లించింది. ఇది కొంత వ్యతిరేకతకు దారి తీసింది. ప్రధానంగా కౌలు రైతుల విషయంలో ప్రభుత్వం భూయజమానులకు అనుకూలంగా కౌల్దారీ చట్టాన్ని మార్చేసింది. 75 శాతం కౌలుతో నడిచే వ్యవసాయ రంగాన్ని కోలుకోలేని దెబ్బతీసింది.
నిత్యావసర వస్తువులు పై బాదుడు బాదుడే :
ఓ వైపు పెద్ద ఎత్తున అప్పులు చేస్తున్నా పేద, మధ్య తరగతిపై ప్రభుత్వం ఎనలేని భారాలు మోపింది. పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ ధరల పెంపుతో పాటు నిత్యావసరాలపై జీఎస్టీ బాదుడు వల్ల దిగువ మధ్య తరగతి సైతం పేదరికంలోకి జారిపోయింది. కరెంటు, రవాణా చార్జీలు తడిసి మోపెడయ్యాయి. అర్బన్ సంస్కరణల పేరుతో ఆస్తి, ఇంటి పన్నులు పెంచారు. దీంతో అర్బన్‌లో ఇంటి అద్దెలు కొండెక్కాయి. మద్యం ధరల పెంపుతో సగటు కుటుంబ బడ్జెట్ ఆదాయానికి పొంతన లేకుండా పోయింది. ఇవన్నీ సగటు ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకతకు దారితీసింది.
ప్రజలు రోడ్లపై తిరగలేని పరిస్థితే అభివృద్ధి :
ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత లబ్ది చేకూర్చాలనే లక్ష్యంతో వైసీపీ సర్కారు నవరత్నాలను ప్రకటించింది. అదే సమయంలో సామాజిక వృద్ధిని గాలికొదిలేసింది. రోడ్లు, ప్రాజెక్టులు, ఇతర మౌలిక సదుపాయాలకు నిధులు వెచ్చించలేకపోయింది. దీంతో అనేక ప్రాజెక్టుల గేట్లు కొట్టుకుపోయాయి. పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. మరమ్మతులు లేని రహదారులు ప్రజలకు నరకం చూపిస్తున్నాయి. కేంద్రం నుంచి అప్పులకు అనుమతులు తప్ప విభజన హామీలు ఒక్కటీ సాధించలేకపోయింది. ఇవన్నీ మధ్య తరగతి వర్గంలో వ్యతిరేకతను పెంచాయి. సీఎం జగన్ ఆత్మ విమర్శ చేసుకొని ఎన్నికల ప్రచారంలో ఏం హామీలిస్తారు.. కొత్తగా ఏం చెబుతారనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
సంక్షేమ పథకాలకే ఎక్కువుగా ప్రాధాన్యం :
ఎక్కడైనా అధికార పార్టీ తమకు మళ్లీ అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరినప్పుడు ఇప్పటి దాకా తాము ఏం చేశామో చెప్పడం.. ఏం చేయాలేకపోయామని కూడా వెల్లడించడం సముచితం. మరోసారి అధికారానికి వస్తే ఏం చేస్తామో వివరిస్తే జనం ఆలోచిస్తారు. అవన్నీ వదిలేసి నేను ఒక్కడినే.. అన్ని పార్టీలు కలిసి నాపై దండెత్తుతున్నాయి.. ఇది పేదలకు, పెత్తందారుల మధ్య యుద్ధమంటూ సానుభూతి కోసం పాకులాడడం అంతగా ఆకట్టుకోదు. ‘మేమంతా సిద్ధం’ పేరుతో ఎన్నికల ప్రచారాన్ని నేటి నుంచి సీఎం జగన్ ప్రారంభించారు ఆత్మ విమర్శ చేసుకుని కొత్తగా ఏం చేయాలనుకుంటున్నారో చెబుతారనేది కాకుండా పాత పాటే పాడారని అనేది సర్వత్రా ఆసక్తిగా మారింది.