అరాచక పాలనకు మారు పేరే జగన్: మాజీ మంత్రి నారాయణ
1 min readభీమ్ న్యూస్ ప్రతినిధి నెల్లూరు (మార్చి 28) ఏపీలో ఏ ప్రజలతోనైతే అధికారంలోకి వచ్చాడో గత ఐదేళ్లుగా ఆ ప్రజల్నే ఆయన మరచిపోయాడని ప్రజా శ్రేయస్సును పూర్తిగా విస్మరించాడని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై మాజీ మంత్రి, టీడీపీ నెల్లూరు సిటీ ఇన్‌చార్జి డాక్టర్ పొంగూరు నారాయణ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని 3,4వ డివిజన్ లో నారాయణ విద్యాసంస్థల జీఎం వేమిరెడ్డి విజయభాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీగా టీడీపీలోకి చేరికలు జరిగాయి. ఈ కార్యక్రమానికి నారాయణ ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఈ సందర్భంగా మద్దూరు వెంకటేశ్వర్లు, కిరణ్ కుమార్, తాతా వెంకటేశ్వర్లు, పర్చూరు శ్రీనివాసులు, ఆధ్వర్యంలో వారి మిత్ర బృందం వైసీపీకి గుడ్ బై చెప్పి మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. వారందరికి నారాయణ పార్టీ కండువాలు కప్పి టీడీపీలోకి సాదరంగా ఆహ్వానించారు. టీడీపీలో చేరిన ప్రతి ఒక్కరికి సముచితస్థానం గౌరవం ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. ముందుగా మున్సిపల్ మాజీ ఛైర్మపర్సన్ తాళ్లపాక అనురాధతో పాటు టీడీపీ ముఖ్యనేతలతో కలిసి డివిజన్‌కు విచ్చేసిన నారాయణకు టీడీపీ శ్రేణులు, స్థానిక ప్రజలు ఘనస్వాగతం పలుకుతూ అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. చేరికల కార్యక్రమంలో వేదికపైన నారాయణను గజమాలతో సత్కరించారు.
అనంతరం డాక్టర్ పొంగూరు నారాయణ ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడారు. గత ఐదేళ్లుగా ఆంధ్ర రాష్ట్రం రావణకాష్టంగా తయారైందని విమర్శించారు. ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని చెప్పి రాష్ట్రంలో జగన్మోహన్‌రెడ్డి గద్దెనెక్కారన్నారు. ఏ ప్రజలతోనైతే అధికారంలోకి వచ్చాడో ఆ ప్రజల్నే ఆయన మరచిపోయాడని ఆరోపించారు. ప్రజా శ్రేయస్సును పూర్తిగా విస్మరించాడన్నారు. పూర్తిగా అరాచక పాలనే కొనసాగించి ప్రజల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేశాడన్నారు. ప్రజా పరిపాలన అంటే సంక్షేమంతో పాటు పేద నిరుపేదలందరికి చేయూత నివ్వాలన్నారు. వారి అభివృద్ధికి తోడ్పడాలన్నారు. అభివృద్ధి లేకపోతో మన పిల్లల భవిష్యత్ అంధకారంలోకి వెళ్లిపోతుందన్నారు. ప్రస్తుతం మన రాష్ట్రంలో జరుగుతోంది అదేనని దుయ్యబట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 175 నియోజకవర్గాల్లో డెవలప్‌మెంట్ శూన్యమన్నారు. రాష్ట్రంలో ఎక్కడకెళ్లినా తమ పిల్లలు బీటెక్, ఎంఎస్సీలు చదివారని కానీ వాళ్లకు ఉద్యోగాలు లేవని…కనీసం మీరు అధికారంలోకి రాగానే మా పిల్లల భవిష్యత్‌కు బంగారు బాటలు వేయండని తల్లులు అడుగుతున్నారన్నారు. ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే ఆ రాష్ట్రంలో అరాచకాలు, అన్యాయాలు, దౌర్జన్యాలు ఉండకూడదని ప్రశాంతంగా ఉండాలన్నారు. ఎప్పుడైతే రాష్ట్రం ప్రశాంత వాతావరణంలో ఉంటుందో అప్పుడే వ్యాపారాలు బాగా జరుగుతాయని పరిశ్రమలు వస్తాయని ఆటోమెటిక్ గా యువతకు ఉద్యోగాలు కూడా వస్తాయన్నారు. కానీ మన రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలన్నీ జగన్ దెబ్బతికి ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయాయని ఎద్దేవా చేశారు. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారులైతే చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్‌కు వెళ్లిపోయారన్నారు. అనంతపురంలో కియా పరిశ్రమలను ఏర్పాటు చేసింది చంద్రబాబేనని ఆ పరిశ్రమ పుణ్యమా అని సుమారు 10వేల మంది యువత ఉద్యోగాలు చేస్తున్నారని దాని కారణంగా 10వేల కుటుంబాలు బాగుపడ్డాయని గుర్తు చేశారు. నెల్లూరు నగరంలో దుమ్ము లేకుండా ఉండాలన్న ఉద్దేశంతో రూ. 710 కోట్లతో ఎండ్ టూ ఎండ్ రోడ్లను ఎంతో అద్భుతంగా వేయించానని చెప్పారు. అదే విధంగా దోమలు లేని నెల్లూరు నగరాన్ని తీర్చిదిద్దేందుకు రూ. 550 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ తీసుకువచ్చానన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొదటగా నెల్లూరులో అండర్‌గ్రౌండ్ డ్రైనేజిని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రం స్వర్ణాంధ్రగా మారాలంటే విజన్ కలిగిన నేత చంద్రబాబు ప్లానింగ్‌తోనే సాధ్యమవుతుందని చెప్పారు. రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.