కారు లోయలో పడి 10 మంది మృతి
1 min readభీమ్ న్యూస్ ప్రతినిధి కాశ్మీర్- రాంబన్ జాతీయం (మార్చి 29) జమ్మూ కశ్మీర్‌లో ప్రయాణికులతో వెళ్తున్న కారు ప్రమాదవశాత్తు లోయలోకి జారిపడి 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు. జమ్మూ – శ్రీనగర్ జాతీయ రహదారిపై రాంబన్ జిల్లాలోని బట్టేరీ చస్మా ప్రాంతంలో శుక్రవారం ఉదయం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. జమ్మూ నుంచి కశ్మీర్ లోయకు ప్రయాణికులతో వస్తున్న టవేరా వాహనం జాతీయ రహదారి నుంచి ఒక్కసారిగా అదుపుతప్పి 300 అడుగుల లోతైన లోయలోకి దూసుకెళ్లింది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్, సివిల్ క్విక్ రెస్పాన్స్ టీం హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. కారు లోంచి క్షతగాత్రులను బయటకు తీయడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే, ప్రతికూల వాతావరణం సహాయక చర్యలకు ఆటంకంగా మారింది. వర్షం పడుతుంటంతో అతికష్టంతో వాహనంలోని మృతదేహాలను బయటకు తీస్తున్నామని, ఇప్పటి వరకూ ఎనిమిది నుంచి పది వరకూ గుర్తించాని అధికారులు తెలిపారు. లభ్యమైన ఐడీ కార్డులు ఆధారంగా జమ్మూ కశ్మీర్‌కు చెందిన బల్వాన్ సింగ్, బిహార్‌కు చెందిన విపిన్ ముఖియాలను గుర్తించామని చెప్పారు. అయితే, బాధితుల్లో ఎక్కువ మంది స్థానికేతరులే ఉన్నట్టు పోలీసులు పేర్కొన్నారు. దాదాపు పది మంది ప్రాణాలు కోల్పోయారని, సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని చెప్పారు. ప్రమాదంపై కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ‘ప్రయాణికుల వాహనం ప్రమాదానికి గురై 10 మంది చనిపోయిన విషయం తెలిసిన వెంటనే రాంబన్ జిల్లా కలెక్టర్ బసీర్ ఉల్ హక్‌తో మాట్లాడాను. పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్, సివిల్ క్యిక్ రెస్పాన్స్ దళాలు అక్కడకు చేరుకున్నాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అధికారులతో తాను నిరంతరం మాట్లాడుతున్నాను. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి’ అని మంత్రి పోస్ట్ చేశారు.