అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ పై ఐక్యరాజ్యసమితి కీలక వ్యాఖ్యలు
1 min readభీమ్ న్యూస్ ప్రతినిధి న్యూఢిల్లీ (మార్చి 29) మద్యం పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్, కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయడంపై ఇప్పటికే జర్మనీ, అమెరికాలు స్పందించాయి. తాజాగా, ఈ అంశాలపై ఐక్యరాజ్యసమితి కీలక వ్యాఖ్యలు చేసింది. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ప్రతినిధి స్టెఫాన్ డుజారిక్ మాట్లాడుతూ భారత్, ఎన్నికలు జరిగే ఏ దేశంలోనైనా ప్రజల ‘రాజకీయ, పౌర హక్కులు రక్షింపబడతాయని, ప్రతి ఒక్కరూ స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు వేయవచ్చని మేము ఆశిస్తున్నాం’ అని అన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్టు, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్ నేపథ్యంలో రాబోయే లోక్‌సభ ఎన్నికలకు ముందు భారత్‌లో ‘రాజకీయ అశాంతి’ గురించి మీడియా అడిగిన ప్రశ్నకు స్టీఫెన్ డుజారిక్ గురువారం ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఎన్నికలు ఉన్న ఏ దేశంలోనైనా, రాజకీయ, పౌర హక్కులతో సహా ప్రతి ఒక్కరి హక్కులు రక్షించబడతాయి. ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా, న్యాయమైన వాతావరణంలో ఓటు వేయగలరని మేము చాలా ఆశిస్తున్నాం’ అని రోజువారీ మీడియా బ్రీఫింగ్‌లో డుజారిక్ వ్యాఖ్యానించారు. కేజ్రీవాల్ అరెస్ట్, కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల స్తంభనంపై ఇటీవలే అమెరికా విదేశాంగ ప్రతినిధికి ఇటువంటి ప్రశ్నలే ఎదురయ్యాయి. న్యూఢిల్లీలోని అమెరికా దౌత్యవేత్తకు భారత్ సమన్లు పంపి నిరసన తెలిపింది. బుధవారం విదేశాంగ శాఖ సౌత్ బ్లాక్‌లో 40 నిమిషాల పాటు ఆయనను దీనిపై నిలదీసింది. దౌత్య సంబంధాల్లో ఆయా దేశాలు ఇతరుల సార్వభౌమాధికారం, అంతర్గత వ్యవహారాలను గౌరవించాలని తాము భావిస్తున్నామని భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇదే సమయంలో అమెరికా విదేశాంగ శాఖ అథికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ మాట్లాడుతూ కాంగ్రెస్ కేసుల్లో నిష్పాక్షిక, పారదర్శక, సమయానుకూల విచారణను తాము కోరుకుంటున్నామని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకునేలా తమ బ్యాంకు ఖాతాలను ఆదాయపన్ను విభాగం స్తంభింపజేసిందంటూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలూ మా దృష్టికి వచ్చాయి. అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు సహా ఈ కేసులన్నింటిలో తీసుకుంటున్న చర్యలను మేం నిశితంగా గమనిస్తాం’ అని మిల్లర్ వ్యాఖ్యానించారు. దీనిపై భారత్ తన వైఖరిని కుండబద్దలు కొట్టింది. ఇవి పూర్తిగా తమ దేశ అంతర్గత విషయాలని ఆయా దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవించాలని బదులిచ్చింది. దేశ సార్వభౌమాధికారం అంతర్భాగం అయినప్పటికీ దేశం ఐక్యరాజ్యసమితిలో సభ్య దేశమైనప్పుడు ఆ దేశంలో జరిగే అన్యాయాలపై ప్రశ్నించి, పరిశీలించే అధికారం, మానవ హక్కుల ఉల్లంఘన, తదితర అంశాలను కాపాడే అధికారాన్ని ఐక్యరాజ్యసమితి పరిగణలోకి తీసుకుంటుందని ప్రతిగా గుర్తుచేసింది.