April 24, 2024

BHIM NEWS

Telugu News Channel

విమానాశ్రయం తెస్తామనడం మరోసారి స్థానిక ప్రజలను మోసం చేయడమే: ఎస్. మల్లి

1 min read

భీమ్ న్యూస్ ప్రతినిధి కావలి (ఏప్రిల్ 01) విజయసాయిరెడ్డి, బీద మస్తాన్‌ రావు విమానాశ్రయం తెస్తామనడం మరోసారి స్థానిక ప్రజలను మోసం చేయడమేనని దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షులు ఎస్‌.మల్లి పేర్కొన్నారు. సోమవారం కావలి పట్టణంలోని జర్నలిస్టుక్లబ్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షులు ఎస్‌.మల్లి మాట్లాడుతూ దగదర్తిలో ఆదివారం వైసిపి నాయకులు ఎన్నికల ప్రచారంలో దగదర్తి ప్రజలనే కాకుండా బోగోలు, అల్లూరు, కొడవలూరు చుట్టు ప్రక్కల మండలాల ప్రజలను మోసానికి గురిచేస్తున్నారని తెలిపారు. ఆరు సంవత్సరాల కిందట చంద్రబాబునాయుడు ప్రారంభించిన దామవరం విమానాశ్రయం 1800 ఎకరాలలో ప్రారంభమైనా 670 ఎకరాలకు మాత్రమే డబ్బులు ఇచ్చినారు. మిగతా 335, 336 సర్వే నెంబర్లలో ఇంకా 700 ఎకరాలకు డబ్బులు ఇవ్వాల్సి ఉందన్నారు. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వచ్చిన తరువాత చంద్రబాబునాయుడు ప్రారంభించినవి అన్నీ రద్దుచేసి కందుకూరు నియోజకవర్గంలోని వీరేపల్లి నుంచి చాకిచర్ల వరకు సర్వే చేసి ఇక్కడి విమానాశ్రయాన్ని రద్దుచేసినారని తెలిపారు. మరలా ఇప్పుడు మరోసారి మోసం చేయడానికి స్థానిక ప్రజలకు ఉద్యోగాలు చేయకుండా, బి.ఎం. ఆర్‌. లాంటి కంపెనీలలో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వకుండా అస్సాం, బెంగుళూరు వంటి ప్రాంతాల నుంచి మంచి నిపుణులను తెచ్చుకుని పనులు చేయించుకుంటున్నారని తెలిపారు. స్థానిక యువకులకు మాత్రం రొయ్య పొట్టు ఒలిచే ఉద్యోగాలు ఇస్తున్నారని తెలిపారు. చదువుకున్న యువతకు ఉద్యోగాలు ఇవ్వడం లేదన్నారు. భూములు మాత్రం లాక్కొన్నారని తెలిపారు. అన్నీ కూడా పేద వర్గాలకు చెందిన భూములకు ఎకరాకు రెండు లక్షలు ఇచ్చి 200 ఎకరాలు గుంజుకున్నాడని తెలిపారు. అదే విధంగా ఎస్‌.ఆర్‌. శంకర్‌ ఇచ్చిన బాల కార్మికుల పాఠశాల 13 ఎకరాలను కూడా ఫ్యాక్టరీలో కలుపుకున్న వారు నీతులు చెపుతున్నారని తెలియచేసారు. స్థానిక యువకులకు ఉద్యోగాలు ఇవ్వాలని జగనన్న చెపుతున్నప్పటికీ ఒక్కరికి కూడా ఇవ్వడం లేదన్నారు. ఇవ్వకపోగా స్థానిక యువకులు సారాయి కేసులు, ఇతర కేసుల్లో ఇరుక్కుని జైలుపాలు అవుతున్నారని తెలిపారు. గిరిజనుల చేతివృత్తి శిక్షణ కేంద్రం నిర్మించి ఆరు సంవత్సరాలు అవుతున్నా, దాని గురించి పట్టించుకోలేదన్నారు. మరలా ఇప్పుడు ఉద్యోగాలు ఇచ్చి విమానాశ్రయం తెప్పిస్తామనడం ఘోరమైన విషయం అన్నారు. ఈ కార్యక్రమంలో జరుగుమల్లి విజయ రత్నం, చౌటారి వెంకటరత్నం, కంకరణాల ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *