భీమ్ న్యూస్ ప్రతినిధి విజయవాడ (నవంబర్ 02) దేశంలో , రాష్ట్రంలో జాతీయ విద్యా విధానంలో భాగంగా ప్రతి విద్యార్థికి ఆపార్(ఆటోమేటెడ్ పర్మినెంట్ అకాడమిక్ అథెంటిక్ రిజిస్ట్రీ) సంఖ్య అందించేందుకు కష్టాలు తప్పడం లేదు. ఆధార్‌లో ఉన్న సమాచారం మేరకు ఆపార్ కార్డులు జారీ అవుతున్నాయి. ఆధార్‌లో విద్యార్థుల వివరాలు తప్పుల తడకగా ఉండడంతో వాటిని ఆన్లైన్లో పొందుపర్చడానికి సమస్యలు తీవ్రంగా తలెత్తుతున్నాయి. ముందుగా ఆధార్‌లోని వివరాలు సరి చేసి తర్వాత నమోదు చేయాల్సి వస్తోంది. ఆధార్ మార్చాలంటే జన్మదిన సర్టిఫికెట్ ను తీసుకురమ్మని ఆధార్ నమోదు సిబ్బంది తెలుపుతున్నారు. ఈ రెండింటిలో వ్యత్యాసం కారణంగా ఆధార్ మార్చడానికి ఆధార్ నమోదు సిబ్బంది ససేమిరా అంటున్నారు. ఈ విధంగా ఎన్నో రకాల సమస్యలతో అపార్ కార్డులు చేయడానికి ఉపాధ్యాయులు, విద్యాశాఖ సిబ్బంది తల మునకలై ఉన్నను 50% విద్యార్థుల వివరాలు తప్పులు తడకగా ఉన్నాయి. ఈ కారణం గానే అపార్ కార్డులు నమోదు చేయడంలో తీవ్రమైన సమస్యలు తలెత్తుతున్నాయని తెలుపుతున్నారు. విద్యాశాఖ ఉన్నతాధికారులు జిల్లాస్థాయిలో, రాష్ట్రస్థాయిలో విద్యార్థులపై, తల్లిదండ్రులపై, ప్రధానోపాధ్యాయులపై, మండల విద్యాశాఖ అధికారులపై, విద్యాశాఖ సిబ్బందిపై తీవ్రమైన ఒత్తిడి చర్యలు తీసుకోవడం తప్ప, ఇంకేమీ జరగడం లేదని వాపోతున్నారు. జన్మదిన సర్టిఫికెట్, ఆధార్ కార్డులలో సవరణలు పూర్తయితే తప్ప అపార్ ముందుకు సాగదని అంటున్నారు. దీనికోసం ప్రత్యేక అవకాశం కల్పిస్తే తప్ప ఆ ప్రక్రియ సజావుగా జరగదని విద్యాశాఖలో సిబ్బంది చెబుతున్నారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లోని డీఈవోలు మండల విద్యాశాఖాధికారులకు, ప్రధానోపాధ్యాయులకు మెమోలు జారీ చేయడం జరిగిందని ఒకింత ఆందోళన చెందుతున్నారు. సమస్యలు తలెత్తినప్పుడు పరిష్కరించడం మానేసి మెమోలు జారీ చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
30 శాతానికి పైగా విద్యార్థుల వివరాలు నమోదు :
జిల్లాలో ఆపార్ కార్డులు జారీకి కష్టాలు తప్పడం లేదు. ఈ కార్డులు జారీ బాధ్యతలు పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు విద్యాశాఖ అప్పగించింది. నవంబరు 30వ తేదీలోగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. చాలా మంది విద్యార్థుల వివరాలు పాఠశాల రికార్డులో ఒకలా.. ఆధార్ కార్డులో మరోలా ఉన్నాయి. ఒకసారి ఆపార్ కార్డు ఇస్తే విద్యార్థి చదువు పూర్తయి. ఉద్యోగం సాధించే వరకు ఇదే నంబరు కార్డు ఉంటుంది. కేంద్ర జారీ చేస్తున్న ఆపార్ కార్డులో విద్యార్థికి సంబంధించిన పూర్తి స్థాయి వివరాలు అందులో నమోదై ఉంటుంది. శాశ్వత డిజిటల్ గుర్తింపు సంఖ్యతో దేశంలో ఎక్కడ చదవాలన్న ఉపాధి ఆవకాశాలకు సంబంధించి ఈ కార్డు కీలకం కానుంది.
ఆధార్ వివరాలల్లో పెద్ద ఎత్తున తప్పులు ఉన్నాయి. ప్రస్తుత్తం ఆపార్ కార్డు విద్యార్థులకు తప్పనిసరి కావడంతో ఆధార్‌లోని తప్పలను సరి చేయాల్సి ఉంటుంది. గ్రామీణ వాసులు సమీప పట్టణంలోని ఆధార్ కేంద్రాలకు వెళ్లి తప్పులను సరి చేసుకోవాల్సి ఉంటుంది. పాఠశాలలో అడ్మిషన్ రిజిష్టర్ ప్రకారం ప్రధానోపాధ్యాయులు సర్టిఫికెట్ ఇస్తే, ఆ వివరాల ప్రకారం ఆధార్ కేంద్రాల్లో మార్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. ఆధార్ వివరాల సవరణ భాధ్యత సచివాలయ సిబ్బందికి అప్పగిస్తే ప్రయోజనం ఉంటుందని కొంతమంది తల్లిదండ్రులు కోరుతున్నారు. జిల్లా అధికారులు విద్యార్థుల ఆధార్ సమస్యలు పరిష్కరించేల్లా ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తే ఆపార్ నమోదు మరింత వేగవంతమవుతుందని, విద్యార్థుల తల్లిదండ్రులపై, పాఠశాల సిబ్బందిపై, మండల విద్యాశాఖ అధికారులపై, చర్యలు తీసుకోవడం సమంజసం కాదని, దీనిని విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పందించి వెంటనే, సమస్యలపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే విద్యాశాఖ వ్యవస్థలో విద్యార్థులకు చదువు తప్ప అది చేయండి ఇది చేయండి అని పాఠశాల సిబ్బందిపై తీవ్ర ఒత్తిడి తీసుకోవడం ఏరకంగానూ సమంజసం కాదని, విద్యార్థుల తల్లిదండ్రులు కూడా మా పిల్లలకు చదువు తప్ప ఇతర ఇతర కార్యకలాపాలు పట్ల ఉపాధ్యాయులను వేగవంతం చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానం విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆలోచించి, తల్లిదండ్రుల కోరిక మేరకు విద్యార్థులకు చదువును అందించడంలో ముందుండాలని కోరుతున్నారు.
Leave a Reply