భీమ్ న్యూస్ ప్రతినిధి న్యూఢిల్లీ – జాతీయం (నవంబర్ 02) ఏపీ మాజీ సిఎం వైఎస్ జగన్ 11 ఏళ్లుగా బెయిల్‌పైనే ఉన్నారని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ గుర్తు చేశారు.ఒక వ్యక్తి ఇన్నేళ్లుగా బెయిల్‌పై బయట ఉండటం దేశ చరిత్రలోనే ఇది తొలిసారని అన్నారు. శనివారం నాడు న్యూఢిల్లీ లోని అజోరు భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ అక్రమాస్తుల కేసు 11 ఏళ్లుగా తేలలేదు కాబట్టే.. జగన్, షర్మిల మధ్య ఇప్పుడు ఆస్తుల పంచాయతీ వచ్చిందని విమర్శించారు.
జగన్ విషయంలో దర్యాప్తు సంస్థలు ఏళ్ల తరబడి విచారణ చేస్తూనే ఉన్నాయని, ఇంకెంతకాలం ఇలా కాలయాపన చేస్తారని ప్రశ్నించారు. ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అండదండలతోనే జగన్ స్వేచ్ఛగా ఏళ్ల తరబడి బయట తిరుగుతున్నారని విమర్శించారు. జగన్ కేసుల వ్యవహారం బిజెపి చేతిలో ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా సమస్యలను పరిష్కరించకుండా రాజకీయం చేస్తుందన్నారు.
తమిళనాడు, కేరళ, ఢిల్లీ రాష్ట్రాలను లెఫ్ట్‌నెంట్ గవర్నర్ల ద్వారా ఇబ్బందులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. సమాఖ్య వ్యవస్థను దెబ్బ తీసేలా ప్రధాని నరేంద్ర మోడీ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఒక దేశం – ఒకే ఎన్నిక అనేది దేశానికి మంచిది కాదని అన్నారు. అధికారం కోసం దేశం వినాశనమైనా ఫర్వాలేదనేలా బిజెపి ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. ప్రాంతీయ పార్టీలు బలపడేకొద్దీ జాతీయ పార్టీలు నష్టపోతున్నాయని అభిప్రాయపడ్డారు. సిపిఐ క్షేత్ర స్థాయిలో బలపడటానికి కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. జార్ఖండ్‌లో తొమ్మిది స్థానాల్లో సొంతంగా పోటీ చేస్తున్నామని, మహారాష్ట్రలో ఇండియా బ్లాక్ పొత్తులో భాగంగా ఒక స్థానంలో పోటీలో ఉన్నామని మీడియా ముఖంగా తెలిపారు.
Leave a Reply