భీమ్ న్యూస్ ప్రతినిధి ఇబ్రహీంపట్నం (నవంబరు 09) దేశంలో ఎస్సీల ఏబీసీడీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు తీర్పును పునఃసమీక్షించాలని చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ కోరారు.ఈ వర్గీకరణ రాజ్యాంగ బద్ధంగా రావాలని.. మనువాద వర్గీకరణ వద్దని ఆయన అన్నారు. శనివారం ఇబ్రహీంపట్నంలో జరిగిన మాల ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జాతి నిర్మాణం, హక్కుల కోసం అన్ని వర్గాలు కలిసి పనిచేయాలేగాని ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం మంచిది కాదన్నారు.
హక్కుల కోసం మాలలు సంఘటితంగా ఉద్యమించాలని లేదంటే భవిష్యత్తులో మాలలకు తీవ్ర నష్టం జరుగుతుందనే విషయం గుర్తెరగాలన్నారు. రాష్ట్రంలో అన్నిరంగాల్లో మాలలకు జరుగుతున్న అన్యాయంపై ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లామని గుర్తు చేశారు. త్వరలోనే రాష్ట్రంలో ఓ యూనివర్సిటీకి మాల సామాజికవర్గానికి చెందిన వైస్ చాన్సలర్‌ను నియమిస్తామని కూడా హామీ ఇచ్చినట్లు వివేక్ తెలిపారు. బుద్ధవనం ఓఎస్డీ మల్లేపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ మోదీ దళిత వ్యతిరేకి అని, మాల, మాదిగలను విడగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నానరంటూ ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో మాలలు సంఘటితం కావాల్సిన అవసరముందన్నారు. మాలల ఐక్యవేదిక ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కన్వీనర్ లకుమల్ల మారయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సమతా సైనిక్‌దళ్ జాతీయ ప్రధాన కార్యదర్శి దిగంబర్ కామ్లే, ప్రజా గాయకుడు రెంజర్ల రాజేష్, మాల మహానాడు నాయకుడు చెన్నయ్య, కార్డియాలజిస్ట్ డా.ఎం.ఎస్. గోపీనాథ్, మాల మహానాడు ఐక్య వేదిక కో-కన్వీనర్లు హనుమండ్ల కిష్టయ్య, డా.అబ్బయ్య, భర్తాకి జగన్, వై.శ్రవణ్‌కుమార్, ఈగల రాములు, ఆవుల మల్లేష్, చిలుకల బుగ్గరాములు, బండి విజయనిర్మల తదితరులు పాల్గొన్నారు.
Leave a Reply