భీమ్ న్యూస్ ప్రతినిధి విజయనగరం – రాజాం (నవంబర్ 16) గత ఐదేళ్ల వైసీపీ పాలనలో పాఠశాల విద్యాశాఖపై ఎన్నోరకాల ప్రయోగాలు జరిగాయి. పాఠశాలల ఎత్తివేత, ఉపాధ్యాయులను సమీప ఉన్నత పాఠశాలల్లో సర్దుబాటు వంటి ప్రక్రియతో పాఠశాల విద్యాశాఖ అస్తవ్యస్తంగా మారింది. దాని ప్రభావం విద్యార్థుల చదువుపై పడింది. చిన్న తరగతుల వారు కిలోమీటర్ల మేర నడిచి పాఠశాలలకు చేరుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది. ఆర్థికంగా పర్వాలేదనుకున్న వారు ప్రైవేటు పాఠశాలల్లో చేరారు. సామాన్యులు మాత్రం ప్రభుత్వ పాఠశాలల్లో కొనసాగుతున్నారు. ఈ తరుణంలో డ్రాపౌట్స్ పెరిగారు. బడిఈడు కలిగిన విద్యార్థులు బయటే ఉండిపోవాల్సి వచ్చింది. ఉమ్మడి జిల్లాలో 6,259 మంది డ్రాపౌట్స్ ఉన్నట్టు తాజాగా కూటమి ప్రభుత్వం తేల్చింది. జిల్లాల వారీగా సర్వే చేపట్టి గుర్తించింది. ఇది ఆందోళనకు గురిచేసే విషయం. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత దీనిని గుర్తించేందుకు ‘నేడు బడికి పోతా’ అనే కార్యక్రమాన్ని నిర్వహించింది. జిల్లావ్యాప్తంగా బడిబయట ఉన్న 512 మంది గురించి పాఠశాలల్లో చేర్పించింది. అయినా సరే ఇంకా డ్రాపౌట్స్ ఉండిపోవడం విశేషం. జిల్లాలో డ్రాపౌట్స్ లేరని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. బడిఈడు కలిగిన పిల్లలంతా పాఠశాలలో చేర్పించామని చెప్పుకుంటున్నారు. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. 1.3 శాతం మంది విద్యార్థులు పాఠశాల, ఆపై కళాశాల స్థాయికి వెళ్లడం లేదని ఓ సర్వే తేల్చింది. ఈ ఏడాది ప్రారంభంలో సర్వే చేసే సమయంలో 32.1 శాతం మంది బాలురు, 12.1 శాతం మంది బాలికలు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లకుండా ఇంటి వద్ద ఉండిపోయారని ప్రథమ్ అనే సర్వే తేల్చిచెప్పింది. కానీ, అప్పట్లో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం దీనిని తేలిగా తీసుకుంది.
గుణాత్మకమైన విద్య కనుమరుగు :
విద్యార్థులకు గుణాత్మకమైన విద్య కరువవుతోంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విద్యావ్యవస్థలో సంస్కరణలు తీసుకొచ్చింది. పాఠశాలలను కుదించింది. పరిసర పాఠశాలల్లో విలీనం చేసింది. అటు ఉపాధ్యాయులను సైతం సర్దుబాటు చేసింది. ఆన్లైన్ బోధనకు ప్రాధాన్యం ఇచ్చింది. ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి మాతృభాష, ప్రాంతీయ భాషలను నీరుగార్చిందనే విమర్శలు ఉన్నాయి. బైజూస్ లాంటి సంస్థలతో ఒప్పందాలు చేసుకొని ఉపాధ్యాయుల పాత్రను నిర్వీర్యం చేసింది. ఇవన్నీ పాఠశాల విద్యాబోధనపై ప్రభావం చూపాయి. కేవలం ప్రభుత్వం అంకెల గారడీ కోసం పరితపించడంతో విద్యార్థులకు చదువు అందని ద్రాక్షగా మిగిలింది. డ్రాపౌట్స్ పెరిగిపోయారు. ఇప్పుడు ఆ తప్పిదాలను సరిచేసే పనిలో పడింది కూటమి ప్రభుత్వం.
దృష్టిసారించాం :
జిల్లాలో డ్రాపౌట్స్‌పై దృష్టిసారించామని, జూన్‌లోనే బడికిపోతాం ప్రత్యేక డ్రైవ్ చేపట్టామని. 512 మందిని గుర్తించామని, ప్రస్తుతం ఎక్కడైతే డ్రాపౌట్స్ ఉన్నారో ఆయా కుటుంబాలను సిబ్బంది కలుస్తున్నామని, వారిని పాఠశాలల్లో చేర్పించే ఏర్పాట్లు చేస్తున్నామని విజయనగరం డీఈవో మాణిక్యాల నాయుడు తెలిపారు.
Leave a Reply