భీమ్ న్యూస్ ప్రతినిధి తాడికొండ (నవంబర్ 19) గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామంలోని జడ్పీ హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్న షేక్ సమీర్, ఊరు సమీప పొలాల్లోని ఓ బావిలో శవమై తేలిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అక్టోబర్ 24న ఆ స్కూల్లో చదువుతున్న తోటి విద్యార్థులే సమీర్‌ను చంపి బావిలో పడేశారని, ఈ ఘటనపై విచారణ జరిపించాలని సమీర్ నాయనమ్మ మస్తాన్ బీ, గుంటూరు కలెక్టరేట్లో ఇచ్చిన గ్రీవెన్స్ డే ఫిర్యాదు నేపథ్యంలో ఈ ఉదంతం కలకలం రేపుతోంది.
మస్తాన్ బీ చెప్పిందేమిటి :
”షేక్ సమీర్ నా మనుమడు. మా సొంతూరు గుంటూరు జిల్లా అమరావతి మండలం కర్లపూడి గ్రామం. నా కుమారుడు (సమీర్ తండ్రి) కొన్నేళ్ల కిందట రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. సమీర్ చిన్నతనంలో అతడి తల్లి మృతి చెందింది. తల్లిదండ్రులిద్దరూ చనిపోవడంతో ప్రస్తుతం నేను ఉంటున్న తాడికొండ మండలం పొన్నెకల్లులోనే సమీర్ ఉంటూ.. జెడ్పీ హై స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. గత నెల 24న ఒంట్లో బాలేదని స్కూలుకు వెళ్లలేదు. ఆ రోజు మధ్యాహ్నం తన తోటి విద్యార్థులు వచ్చారని బయటకు వెళ్లాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి గ్రామస్థులు వచ్చి మీ మనుమడు పొలం బావిలో శవమై తేలాడని చెప్పారు” అని సమీర్ నాయనమ్మ మస్తాన్ బీ విలపించారు.
‘తోటిపిల్లలే చంపేశారు’ :
”అంతకు ముందు స్కూల్లో గొడవ జరిగిందట. అవేమీ మాకు తెలియదు. కొంతమంది పిల్లలు వచ్చి బావిలో ఈత కొడదామని చెప్పి మా మనుమడిని ఇంట్లో నుంచి తీసుకువెళ్లారు. అక్కడే గొడవ పడి చంపేసి బావిలో పడేశారని అంటున్నారు. మొదట్లో ఇవేమీ మాకు తెలియదు. నేను అంత్యక్రియలు చేసేందుకు మా సొంతూరు కర్లపూడి తీసుకువెళ్లినప్పుడు శరీరంపై రక్త గాయాలు కనిపించాయి. దాంతో అందరికీ అనుమానం వచ్చింది. మా ఊరి పెద్ద, సర్పంచ్ భర్త రామారావును కలిసి చెబితే ముందు ఆయన స్కూలు ఉపాధ్యాయులతో మాట్లాడారు. వారి నుంచి సరిగ్గా స్పందన రాకపోవడంతో కలెక్టరేట్లో ఫిర్యాదు చేశామని మీడియా కి తెలిపారు.
Leave a Reply