భీమ్ న్యూస్ ప్రతినిధి ఇందుకూరుపేట (నవంబర్ 20) అంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడానికి నాయకులు, కార్యకర్తలు ఎంతో శ్రమ కోర్చారు అనేది వచ్చిన ఎన్నికల ఫలితాలను చూస్తేనే తెలుస్తుంది. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం డేవిస్ పేట పంచాయతీలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో తన మార్కును చూపిన ఎన్డీఏ కూటమి నాయకత్వం ఆరు నెలలు కాకముందే బలహీనపడి కుదేలైనట్లు, ఘోర పరాజయం పాలైన వైఎస్సార్సీపీ హవా కొనసాగిస్తూ, బలం పుంజుకుంటున్నట్లు కొన్ని ప్రత్యక్ష సంఘటనల ద్వారా వాస్తవాలు తెలుపకనే తెలుపుతున్నాయి. కొన్ని సంఘటనలు లోతుగా పరిశీలిస్తే, సర్వే నెంబర్: 762/1, ఎల్.పి.ఎం. నెంబర్: 663, 664 లలో అనుమతులు లేకుండా ఒక ఎకరా వ్యవసాయ భూమిలో కొత్తగా లే – అవుట్ వేశారు. సదరు లే – అవుట్ యజమాని వైఎస్సార్సీపీ నాయకుడు కావడంతో స్థానిక వైఎస్సార్సీపీ నాయకుడు మరియు సర్పంచ్ ప్రతినిధితో స్నేహ సంబంధాలు కొనసాగిస్తూ, పంచాయతీలోని ఎన్డిఏ కూటమి నాయకులను పట్టించుకోకుండా, గ్రామ అధికారులకు సైతం స్పందించకుండా వ్యవహరిస్తున్న తీరుపై గ్రామ ప్రజలు పలు రకాలగా చర్చించుకోవడం డేవిస్ పేట పంచాయతీలో గత ప్రభుత్వం వైసీపీ హవా కొనసాగుతున్నది అనేందుకు ఒక ప్రత్యక్ష ఉదాహరణ.
అదేవిధంగా ఎయిర్ టెల్ కంపెనీ సెల్ టవర్ కి పంచాయతీలోని అంజనీ గార్డెన్స్ లే – అవుట్ లో పంచాయతీకి కేటాయించిన పది శాతం భూమిలో కొంత భూభాగాన్ని కూటమి నాయకులు సెల్ ఫోన్ టవర్ కి కేటాయించారు. కానీ స్థానిక వైఎస్సార్సీపీ నాయకుడు మరో లే – అవుట్ లోకి స్థలాన్ని బదలాయింపు చేసి, ఎయిర్ టెల్ కంపెనీ సెల్ ఫోన్ టవర్ నిర్మాణం చేయించారు. ఈ విషయంలో కూడా పంచాయతీలోని ఎన్డిఏ కూటమి నాయకుల మాటలు చెల్లుబాటు కాలేదని, వైఎస్సార్సీపీ నాయకుడి హవానే కొనసాగిందని తేట తెల్లమైందని గ్రామ ప్రజలు చర్చించుకోవడం విశేషం. ఈ సంఘటనలను చూస్తే రాబోయే పంచాయతీ ఎన్నికల్లో ఎన్డిఏ కూటమి పరాజయం పాలై, ఖచ్చితంగా వైఎస్సార్సీపీ విజయకేతనం ఎగుర వేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయని అనడంలో ఎలాంటి సందేహం అక్ఖర్లేదు. కోవూరు నియోజకవర్గంలో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటూ, ప్రతీ మండలంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న స్థానిక శాసన సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఈ పంచాయతీపై ప్రత్యేక దృష్టి సారిస్తే గానీ, రాబోయే పంచాయతీ ఎన్నికల్లో ఫలితాలు ఎన్డిఏ కూటమికి అనుకూలంగా రావు అనే విషయం స్పష్టమవుతోంది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో వేచి చూడాలి మరి.
Leave a Reply