భీమ్ న్యూస్ ప్రతినిధి ఇందుకూరుపేట (నవంబర్ 22) నెల్లూరు జిల్లా వ్యవసాయ శాఖా సంయుక్త సంచాలకులు ఏ. రాజ్ కుమార్ ఇందుకూరుపేట మండలం ఇందుకూరుపేట సొసైటీలో విలువలను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులకు ఈ సీజన్లో వరి సాగుకు తీసుకోవలసిన జాగ్రత్తలను, ఎరువు మందులు, పురుగు మందులు వాడవలసిన విధానాలను వివరించారు. రైతులు యురియాను పంటల పైన అధికంగా వాడుతూ ఉంటారు. వేయవలసిన మోతాదు కంటే రెండు నుండి రెండున్నర రెట్లు అధికంగా వాడుతూ ఉంటారు. అధికంగా నత్రజని ఎరువులు, యూరియాను వాడటం వల్ల పంటలకు అనేక నష్టాలు కలుగుతూ ఉన్నాయి. కాబట్టి నత్రజని ఎరువులు మోతాదుని తగ్గించుకోవాలి. అది ఏ విధంగా అనేది మనం ఇప్పుడు చూద్దాం. సాధారణంగా రైతులు యూరియాని ఎక్కువగా వాడుతూ ఉంటారు. మరి వరి పైరు పైన ఇలా అధికంగా వాడటం వలన అనేక నష్టాలు ఉన్నాయి. అవి పంటల తెగుళ్లు, పురుగులు బారిన పడతాయి. అందువల్ల వీటి నివారణకు పురుగు మందులు మరల, మరల పంటల పైన పిచికారి చేయవలసి ఉంటుంది. ఆ కారణంగా వ్యవసాయ ఖర్చులు, పెట్టుబడి కూడా పెరుగుతుంది. దీనితో పాటు దిగుబడులు కూడా తగ్గిపోతుంటాయి.
ఇవే కాకుండా అధికంగా యూరియా వాడటం వలన భూమి నిస్తారమై, ఉప్పు నేలను, చౌడు భూములుగా మారుస్తాయి. భూమిలో ఉన్న పంటలకు పోషకాలు అందించే మేలు చేసే సూక్ష్మజీవులు సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోతుంది. పంటలు చాలా ఎత్తుగా పెరుగుతాయి. పంటలో పూత రావటం ఆలస్యం అవుతుంది. పంట కాల పరిమితి పెరుగుతుంది. ఆలస్యంగా పంటకోతకు వస్తుంది. దిగుబడులు కూడా తగ్గిపోతాయి. భూసార పరీక్ష చేసుకొని, రసాయనిక ఎరువులను, యూరియాలను సమతుల్యంగా వాడుకుంటే పంటలకు ఎలాంటి నష్టం ఉండదు. యూరియాను నూరు శాతం వాడకుండ, సేంద్రియ ఎరువులను 40 శాతం వాడుకుంటే, పంటలకు యూరియా 30% వాడుకోవచ్చు. దాని కోసం పశువుల ఎరువులను 5 టన్నులు, పచ్చ రొట్టె ఎరువులు, జనుము, జీలుగా, పిల్లి పెసర వంటివి వాడుకొని, యూరియా మోతాదు తగ్గించుకోవచ్చును. సాధారణంగా శాస్త్రవేత్తలు వరి పంట కాలంలో 48 కిలో నత్రజనికి ఒక ఎకరాకు వాడాలి అని అంటారు. అందుకోసం యురియా రూపంలో 110 నుంచి 120 కిలో సరిపోతుంది. ఇందులో ఒక భాగము దమ్ములో, రెండో భాగము పిలకలు వేసే దశలోనూ, మిగిలిన భాగం చిరు పొట్ట దశలో వేసుకుంటే సరిపోతుంది.
డి.ఏ.పీ. కాంప్లెక్స్ ఎరువులు రేట్లు ప్రభుత్వం పెంచినప్పుడు రైతులు యురియాని అధికంగా వాడుతుంటారు. అలా వాడటం వల్ల పంటలకు అనేక నష్టాలు జరుగుతాయి. యూరియాని రైతులు వరిలో ఏ విధంగా వాడాలంటే వరిలో యురియా చల్లేటప్పుడు నీరు తీసి యూరియా చల్లుకోవాలి. 24 గంటల తర్వాత నీరు పెట్టుకోవాలి. అప్పుడు పంటలకు యూరియా బాగా పడుతుంది. నీమ్ కోటెడ్ యూరియా గానీ లేక యూరియాకు వేప పిండి ఐదు నుంచి పది కిలోలు కలిపి చల్లుకుంటే యురియా నిదానంగా కరిగి, పంటలకు ఎక్కువ రోజులు అందుబాటులో ఉంటుంది. రైతులు సన్న యురియా అని లావు యురియా అని తేడాలు చూస్తుంటారు. రెండిట్లోనూ నత్రజని 46% ఉంటుంది. కాబట్టి రైతులు ఏ యూరియా అయినా వాడుకోవచ్చని తెలియజేశారు.
Leave a Reply