భీమ్ న్యూస్ ప్రతినిధి ఇందుకూరుపేట (నవంబర్ 22) నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కొత్తూరు పంచాయతీలోని దేవాదాయ ధర్మాదాయ శాఖ భూమి (డేవిస్ పేట పంచాయతీ నారాయణపురం కాలనీకి ఎదురుగా వున్న భూమి) గత 7 సంవత్సరాల నుండి హిందూ – క్రిస్టియన్ ల మధ్య మత సంఘర్షణలకు నిలయమైన విషయం తెలిసిందే. పోలీసు, రెవిన్యూ, దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు మత సామరస్యానికి చేసిన ప్రయత్నాలు ఫలించి, ఆ స్థల వివాదం ముగిసింది. ఇన్ని రోజులు వివాదాలకు నిలయమైన దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలో వున్న ఆ 24 అంకణాలు స్థలం ఇందుకూరుపేట గ్రామంలోని శ్రీలక్ష్మి నరసింహస్వామి దేవస్థానానికి చెందిన భూమిగా అధికారులు గుర్తించారు. అయితే మత సంఘర్షణలు ముగిశాయి, గ్రామంలో ప్రశాంత వాతావరణం నెలకొన్నదనుకుని అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ నేడు కొందరు వ్యక్తులు 24 అంకణాలు దేవాదాయ ధర్మాదాయ శాఖ స్థలాన్ని ఆక్రమణ చేసి, ఆ స్థలంలో చెత్తా చెదారం పడేస్తూ, ఇక ఈ స్థలం మాదే అని ప్రచారం చేసుకోవడం మళ్ళీ వివాదాలకు తెర లేపినట్లయ్యింది.
స్థలం ఆక్రమణ విషయంపై శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం కార్య నిర్వహణాధికారి మోహన్ ను భీమ్ మీడియా వివరణ కోరగా దేవుడి స్థలాన్ని ఆక్రమించడం మంచిది పద్దతి కాదని అన్నారు. త్వరలో ఆ స్థలాన్ని లీజు వేలం పాటకు పెడుతున్నామని, వేలం పాట అనుమతుల కోసం నెల్లూరు జిల్లా దేవాదాయ ధర్మాదాయశాఖ సహాయ కమీషనర్ కు లేఖ పంపామని, ఒక వారంలో వేలం పాట తేదీని మీడియా ద్వారా ప్రకటిస్తామని, ఎవరైనా వ్యవసాయం చేసే రైతులు వేలం పాట పాడుకోవచ్చని, వేలం పాటలో ఆ స్థలాన్ని లీజుకు తీసుకున్న రైతులు ఆ స్థలంలో వున్న చెత్తను తొలగించి వ్యవసాయ ఆధారిత పంటలు వేసుకోవాలని తెలిపారు. అదే విధంగా నెల్లూరు జిల్లా బ్రాహ్మణ అర్చక సమాఖ్య ప్రధాన కార్యదర్శి మరియు శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ప్రధాన అర్చకులు డా. ఉదయగిరి వెంకట శేషాచార్యులను వివరణ కోరగా దేవుడి స్థలం ఆక్రమించిన వాళ్ళు ఎవరైనా సరే ఊరుకునేది లేదని, ఒక వారంలో ఆ స్థలం లీజు వేలం పాటకు పెట్టడం జరుగుతుందని, అప్పుడే స్థలం ఆక్రమణ సమస్యను కూడా పరిష్కరించడం జరుగుతుందని అన్నారు.
Leave a Reply