భీమ్ న్యూస్ ప్రతినిధి నెల్లూరు నగరం (నవంబర్ 22) నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలోని గిరిజన విద్యార్థినీ విద్యార్థులు, తల్లి తండ్రులతో కలిసి గురువారం నెల్లూరు మాగుంట లే – అవుట్ లోని విపిఆర్ నివాసానికి తరలి వచ్చారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి పుష్ప గుఛ్ఛాలు అందించారు. పుట్టినరోజు కేక్ కట్ చేసి ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డికి ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులకు స్టడీ కిట్స్ అందచేసే కార్యక్రమంలో భాగంగా ఇందుకూరుపేట వెళ్లిన సందర్భంగా ఇందుకూరుపేట మండలంలో దాదాపు 600 మంది గిరిజన బాల బాలికలకు బర్త్ సర్టిఫికేట్స్ మరియు ఆధార్ కార్డులు లేని కారణంగా వాళ్ళు కొన్ని ప్రభుత్వ పధకాలకు అనర్హులు అవుతున్నారన్న తన దృష్టికి వచ్చిందన్నారు.
జిల్లా విద్యాశాఖాధికారి వద్ద వివరాలు ఆరా తీస్తే భారత పౌరులకు ఆధార్ కార్డులా విద్యార్థినీ విద్యార్థుల కోసం జాతీయ స్థాయిలో “అపార్” The Automated Permanent Academic Account Registry (APAAR) అనే యూనిక్ ఐడి ప్రవేశపెట్టిందని లేకపోతే స్కూళ్లలో అడ్మిషన్ కూడ కష్టమమని తెలిసిందన్నారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన “అపార్” ఐడి లేకపోతే విద్యార్థులకు ప్రభుత్వం అందచేసే ప్రోత్సాహకాలు అందవని తెలిసాక మనసు కలచి వేసిందన్నారు. అసలే నిరక్షరాశ్యత, పైగా స్థిర నివాసాలంటూ లేక కాలువ గట్ల మీద, రొయ్యల చెరువుల కాడ వుంటూ జీవనం సాగించే వారిలో కొంతమందికి అసలు ఆధార్ కార్డులే లేవని అన్నారు. కొందరికి ఆధార్ కార్డులున్నా బర్త్ డేట్స్ వుండవన్నారు. ఈ సాంకేతిక సమస్యలు గిరి పుత్రుల చదువులకు ఆటంకంగా మారాయన్నారు.
గిరిజన బిడ్డల సమస్య పరిష్కారినికై ఎమ్మెల్యే హోదాలో జిల్లా పరిషత్ సర్వసభ సమావేశలు మొదలు అసెంబ్లీ దాకా గిరిజన బిడ్డలు ఎదుర్కొంటున్న సమస్యను నాకు అవకాశం దొరికిన ప్రతి చోట ప్రస్తావించాను అని అన్నారు. గిరిజన బిడ్డల చదువులకు ఆటంకంగా మారిన ఆధార్ కార్డ్ అప్డేట్ సమస్యపై జిల్లా ఉన్నతాధికారులు స్పందించారని, ఆధార్ అప్డేట్ సమస్యను స్పెషల్ కేస్ గా పరిగణించి ప్రత్యేక ఆధార్ సెంటర్స్ ఏర్పాటు చేసే దిశగా ఆదేశాలిచ్చారని తెలిపారు. మండల అధికారులు, స్థానిక టిడిపి నాయకులు ప్రత్యేక చొరవ తీసుకుని ఇందుకూరుపేట మండలంలో గ్రామాల వారీగా గిరిజన పిల్లల వివరాలు సేకరించి దాదాపు 500 లకు పైగా పిల్లలకు సంబంధించిన ఆధార్ అప్డేట్స్ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారని, ఇందుకూరుపేట మండలంలో వందలాది మంది గిరిజన బాల బాలికల చదువులకు సంబంధించి మార్గం సుగుమం చేయడంలో సహాయ సహకారాలు అందించిన అధికారులకు నాయకులకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలియజేశారు.
ఇందుకూరుపేట మండలంలో విజయవంతంగా పూర్తయిన గిరిజన పిల్లల ఆధార్ అప్డేట్స్ కార్యక్రమాన్ని కోవూరు నియోజకవర్గంలో అన్ని మండలాలలో నిర్వహిస్తామన్నారు. తనకు ముందస్తు శభాకాంక్షలు చెప్పిన గిరిజన పిల్లలు చదువులలో రాణించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశీర్వదించారు. స్పెషల్ డ్రైవ్ ద్వారా 511 మంది గిరిజన బిడ్డలకు బర్త్ సర్టిఫికేట్లు, ఆధార్ కరక్షన్ల సర్టిఫికేట్ లను పంపిణీ చేశారు. తమ బిడ్డల బడి బాటకు మార్గం సుగమం చేసిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డికి గిరిజన విద్యార్థినీ విద్యార్థుల తల్లి తండ్రులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, బెజవాడ వంశీ కృష్ణారెడ్డి లతో పాటు ఇతర ముఖ్య నేతలు, ఇందుకూరుపేట మండల పరిషత్ అభివృద్ధి అధికారి నాగేంద్ర బాబు, మండల పరిధిలోని వివిధ పాఠశాలలకు చెందిన పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Leave a Reply