భీమ్ న్యూస్ ప్రతినిధి అమరావతి (నవంబర్ 27) ఏపీ లో పెండింగ్‌లో ఉన్న ఉద్యోగ నియామకాలు భర్తీ చేయడంపై ఏపీపీఎస్సీ ఛైర్‌పర్సన్ అనురాధ దృష్టి సారించారు. గత వైకాపా ప్రభుత్వం పలు విభాగాల్లో అరకొర సంఖ్యలో ఖాళీల భర్తీ కోసం పలు ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసినప్పటికీ నియామక ప్రక్రియ ముందుకు సాగలేదు. దీనివల్ల అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారు. గ్రూప్-1, గ్రూప్-2 సహా అంతకుముందు విడుదల చేసిన 19 నోటిఫికేషన్ల నియామకాలు పెండింగ్‌లో ఉన్నాయి. క్రమంగా వాటన్నింటినీ పూర్తి చేసేందుకు ఏపీపీఎస్సీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. పలు పరీక్షల ఫలితాలు విడుదల చేయడం సహా నియామక ప్రక్రియను ముందుకు తీసుకెళ్తోంది. ఇప్పటికే గ్రూప్-2 పరీక్ష తేదీలు నిర్ణయించిన ఏపీపీఎస్సీ.. గ్రూప్-1 మెయిన్స్ నిర్వహణ సహా మిగిలిన నియామకాల ప్రక్రియను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటోంది.
గతేడాది జూన్‌లో నోటిఫికేషన్ విడుదల చేసి పెండింగ్‌లో ఉన్న హోమియోపతి లెక్చరర్ల పరీక్ష ఫలితాలను మంగళవారం కమిషన్ విడుదల చేసింది. ఇందుకు సంబంధించి సర్టిఫికెట్ వెరిఫికేషన్ తేదీలనూ ప్రకటించింది. డిసెంబర్ 3న ధ్రువపత్రాల పరిశీలనకు ఏర్పాట్లు చేసింది. 2021లో నోటిఫికేషన్ విడుదల చేసి పరీక్షలు జరిగినా ఫలితాలు విడుదల చేయకుండా ఉండిపోయిన దేవాదాయశాఖలో అసిస్టెంట్ కమిషనర్ ఉద్యోగ నియామక పరీక్ష ఫలితాలను ఇవాళ విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఏపీపీఎస్సీ వెబ్ సైట్‌లో పొందుపరిచారు. ఇప్పటికే నోటిఫికేషన్లు విడుదల చేసి.. నియామక ప్రక్రియ పెండింగ్‌లోఉన్న పలు ఉద్యోగ నియామకాల ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేసేలా కమిషన్ కార్యాచరణ రూపొందించింది.
Leave a Reply