భీమ్ న్యూస్ ప్రతినిధి శ్రీకాకుళం (నవంబర్ 28) జర్నలిస్టులపై ఇటీవల వివిధ స్టేషన్లో తప్పుడు ఫిర్యాదులపై అక్రమ కేసులు నమోదు చేయడాన్ని జిల్లా జర్నలిస్టు సంఘాల అత్యవసర సమావేశం తీవ్రంగా ఖండించింది. ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు సిహెచ్ జగదీష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ప్రధాన యూనియన్, జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్, చిన్న, మధ్య తరహా వార్తాపత్రికల సంఘం జిల్లా కార్యవర్గాలు, సీనియర్ నాయకులు హాజరయ్యారు. పలాస- కాశీబుగ్గ, టెక్కలి మరికొన్ని పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల గురించి చర్చ జరిగింది. ఆ కేసుల్లో బాధితులైన జర్నలిస్టులు తమ ఇబ్బందులను వివరించారు. పలాస లోని అన్నా క్యాంటీన్ నిర్వహకుడు, అక్కడ జరిగిన ఒక సంఘటనతో సంబంధం లేని జర్నలిస్టులను ఇరికిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు ఆ ప్రెస్ క్లబ్ సభ్యులు తెలిపారు. క్యాంటీన్ పై ఒక పత్రికలో వార్త వస్తే, ఇతర పత్రికల్లో వార్త కూడా రాయని జర్నలిస్టులపై కేసు నమోదు చేయడం అన్యాయమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పలాస డిఎస్పి దృష్టికి, గ్రీవెన్స్ డే నాడు ఎస్పీకి వాస్తవాలను వివరించినట్టు తెలిపారు. ఎఫ్.ఐ.ఆర్. లో అట్రాసిటీ సెక్షన్ తో పాటు నాన్ బెయిల్ బుల్ సెక్షన్లు కూడా వేశారని, ఇది రాజకీయ దురుద్దేశం, వ్యక్తిగత ద్వేషాలతో కొందరు ప్రేరేపించడం వల్ల నమోదైన కేసుగా వారు అనుమానం వ్యక్తం చేశారు.
2022లో జనసేన కార్యాలయంపై జరిగిన దాడి కేసును తిరగదోడి, ఆనాడు ఒక పత్రికలో పనిచేసిన జర్నలిస్టును 21వ నిందితునిగా చేర్చి, తాజాగా కేసును దర్యాప్తు చేస్తున్నారని టెక్కలి ప్రెస్ క్లబ్ సభ్యులు తెలిపారు. చానళ్లకు, యూట్యూబ్ ఛానెళ్లు కు ఇష్టానుసారం ఇంటర్వ్యూలు ఇచ్చిన వైసీపీ నాయకురాలు దివ్వల మాధురి, ఒక ప్రముఖ ఛానల్ జర్నలిస్టులతో పాటు ఒక యూట్యూబ్ ఛానల్ పై తప్పుడు ఫిర్యాదు ఇచ్చారని, దాన్ని కూడా పోలీసులు కేసుగా నమోదు చేశారని వివరించారు. శ్రీకాకుళంలో నమోదైన కేసులు కూడా చర్చకు వచ్చాయి. కొన్ని కేసులు వెనక వ్యక్తిగత కక్షలతో కొందరు జర్నలిస్టుల పాత్ర కూడా ఉందని చాలామంది ప్రతినిధులు విమర్శించారు. ఆరోపణలను సమగ్రంగా విచారించి, వ్యక్తుల ఒత్తిళ్లకు తలొగ్గకుండా ఫిర్యాదు అందిన తర్వాత పోలీసులు ఎఫ్.ఐ.ఆర్. లు నమోదు చేస్తే బాగుండేదని సమావేశం అభిప్రాయపడింది.
అనంతరం ముఖ్యఅతిథిగా హాజరై, మాట్లాడిన ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ కార్యవర్గ సభ్యులు, చిన్న, మధ్య తరహా వార్తాపత్రికల సంఘం రాష్ట్ర అధ్యక్షులు నల్లి ధర్మారావు, జిల్లాలో ఒకేసారి జర్నలిస్టులపై నమోదు అవుతున్న కేసుల గురించి ఆందోళన వ్యక్తం చేశారు. కేసుల్లో ఉన్న జర్నలిస్టులకు తెలియకుండా, వేర్వేరు మార్గాల్లో జిల్లా యూనియన్ కూడా విచారణ చేసిందని చెప్పారు. పలాస-కాశిబుగ్గ జర్నలిస్టులపై నమోదు చేసిన కేసు పూర్తిగా సరైనది కాదని తెలిసినట్టు వెల్లడించారు. టెక్కలి జర్నలిస్టులపై మాధురి ఫిర్యాదులోనూ చేసిన ఆరోపణలు సరైనవి కావని అభిప్రాయపడ్డారు. ఇంటర్వ్యూలో ఇబ్బందికరమైన ప్రశ్నలు అడిగితే జవాబు చెప్పడం మానుకోవాలని, చెప్పిన తర్వాత కేసు పెట్టడం అన్యాయమని అన్నారు. జర్నలిస్టుల గురించి కూడా ఆయన మాట్లాడుతూ, చట్టానికి అందరూ సమానులేనని, ఈ విషయం జర్నలిస్టులు గుర్తెరిగి ప్రవర్తించాలని కోరారు. బలవంతపు వసూళ్లు, బ్లాక్ మెయిలింగ్, వ్యక్తిత్వాలను డామేజ్ చేసే తప్పుడు వార్తలు రాయడం వంటి ఆరోపణలు కొంతమంది జర్నలిస్టులపై వస్తున్నాయని, అటువంటి వారిని వెనకేసుకుని ఏపీయూడబ్ల్యూజే పోరాటం చేయలేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియా చాలా వెర్రి తలలు వేస్తుందని, చాలామంది జర్నలిస్టులు దీని మాయలో పడిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తాజా వైఖరి, పిడి యాక్ట్ సవరణను దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాలని కోరారు. అక్రమ కేసులుగా భావిస్తున్న వాటిపై ఎస్పీని కలిసి వినతిపత్రం ఇచ్చి, వాస్తవాలను వివరిస్తామన్నారు. యూనియన్ రాష్ట్ర నాయకత్వానికి ఈ కేసుల గురించి సమాచారం అందించామని, ఎస్పీ స్థాయిలో న్యాయం జరుగుతుందన్న ఆశ ఉందని అన్నారు.
ఆర్గనైజింగ్ సెక్రటరీ సనపల రమేష్ సమావేశంలో సంస్థాగత వ్యవహారాల కూడా చర్చకు వచ్చాయి. జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా సనపల రమేష్ ను సమావేశం ఏకగ్రీవంగా ఎన్నుకుంది. రాష్ట్ర అధ్యక్షుడు, కౌన్సిలర్ల ఎన్నికల కోసం జిల్లా రిటర్నింగ్ అధికారిగా సీనియర్ జర్నలిస్ట్ చింతాడ కృష్ణారావును సమావేశం ఏకగ్రీవంగా ఎన్నుకుంది. సమావేశం ప్రారంభంలో ఇటీవల మరణించిన జర్నలిస్ట్, సినీ కవి కులశేఖర్, యూనియన్ జిల్లా మాజీ అధ్యక్షుడు పీఏ పంతులు, వీడియో జర్నలిస్ట్ గుణ కుటుంబాలకు సానుభూతిని తెలుపుతూ, వారి మరణం పట్ల సమావేశం సంతాపం ప్రకటించింది. ఈ సమావేశానికి యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎన్. ఈశ్వరరావు, సన్న రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎం.వి. మల్లేశ్వరరావు, జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి బెండి నరసింగరావు, ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బాలకృష్ణ, సామ్నా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సింగూరు శ్రీనివాస్, చిన్నారావు తదితరులు హాజరయ్యారు.
Leave a Reply