భీమ్ న్యూస్ ప్రతినిధి అమరావతి (డిసెంబర్ 01) బంగాళాఖాతంలో నేటి తెల్లవారు జామున తుపాన్ తీరం దాటింది. ప్రస్తుతం ఈ తుపాన్ ఇంకా తీవ్రంగానే ఉంది. నేటి ఉదయం (ఆదివారం) 4 గంటలకు తమిళనాడులోని కరైకల్, మహాబలిపురం మధ్య తీరం దాటిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ సమయంలో గంటకు 90కిలోమీటర్ల వేగంగా బలమైన గాలులు వీచాయి. ఈ తుపాన్ పశ్చిమం వైపు కదులుతూ నేడు వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ప్రసుత్తం తమిళనాడు, రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుపాన్ కారణంగా తమిళనాడుతో పాటు ఏపీలోని రాయలసీమ, కోస్తాంధ్ర, యానాంలో నేడు ఆదివారం భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.
తెలంగాణలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. నేడు రోజంతా తూర్పు రాయలసీమ, కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురుస్తాయి. పశ్చిమ రాయలసీమలో మోస్తరు వర్షాలు పడుతాయి. తూర్పు తెలంగాణలో అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. రెండు రాష్ట్రాల్లో రోజంతా మేఘాలు ఉంటాయని వెల్లడించింది. నేడు ఏపీలోని కోస్తాంధ్ర, తూర్పు రాయలసీమలో భారీ వర్షాలు రోజంతా కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. ఒంగోలు నెల్లూరు, తిరుపతి, కడప, అనంతపురం, గుంటూరు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది.
అటు బంగాళాఖాతంలో తుపాన్ నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు రియల్ టైమ్ లో అంచనా వేస్తూ దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సీఎం నిర్దేశించారు. ఫెంగల్ తుపాన్ పై జిల్లా కలెక్టర్లు, విపత్తు నిర్వహణ శాఖ, సీఎంవో, రియల్ టైమ్ గవర్నెన్స్ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షించారు.
Leave a Reply