భీమ్ న్యూస్ ప్రతినిధి అమరావతి (డిసెంబర్ 04) ఏపీలో తుఫాను ముప్పు వీడటం లేదు. ఫెంగల్ తుఫాను ప్రభావం నుంచి పూర్తిగా బయట పడక ముందే ఏపీకి మరో హెచ్చరిక జారీ అయింది. శుక్రవారం రోజు(6వ తేదీ)న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. ఈనెల 6, 7 తేదీల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. దీని ప్రభావంతో ఏపీ లోని పలు జిల్లాల్లో రానున్న నాలుగు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. దీంతో, తీర ప్రాంత జిల్లాల యంత్రాంగం అప్రమత్తమవుతోంది.
కొనసాగుతున్న వర్షాలు :
ఏపీకి మరో ముప్పు ఉంచి ఉందని అధికారులు వెల్లడించాయి. ఫెంగల్ తుఫాను ముప్పు ఏపీ పైన తక్కువగా ఉన్నా.. ఇప్పుడు మరోసారి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంలో తాజా అలర్ట్ జారీ అయింది. ఈ అల్పపీడనం వాయుగుండంగా మారి తుపానుగా పరిణమించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావం ఏపీపై అధికంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ నిపుణలు భావిస్తున్నారు. ఫెంగల్ తుఫానుతో ఏపీలో పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడుతున్నాయి. నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి.మంగళవారం కూడా దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు పడుతా యని అధికారులు చెప్పారు.
కోస్తా జిల్లాలపై ప్రభావం :
తాజా తుఫాను పై రెండు రోజుల్లో స్పష్టత రానుందని అధికారులు చెబుతున్నారు. ఫెంగల్ తుఫాన్ బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారి మంగళవారం అరేబియా సముద్రంలోకి ప్రవేశించింది. తుఫాన్ ప్రభావంతో సముద్రం నుంచి భారీగా తేమ రావడంతో తమిళనాడు, దానిని ఆనుకుని ఉన్న కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు దక్షిణ కోస్తా, రాయల సీమల్లో అనేకచోట్ల, ఉత్తర కోస్తాలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తరువాత రెండు, మూడు రోజులు కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు ఉంటాయని వెల్లడించారు.
Leave a Reply