భీమ్ న్యూస్ ప్రతినిధి విశాఖపట్నం (డిసెంబర్ 06) ఏపీలో వర్షాలు బెంబేలెత్తిస్తున్నవేళ అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడి పశ్చిమ దిశగా కదులుతోంది. మరోవైపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు విశాఖపట్నం వాతావరణ కేంద్రం వెల్లడించింది.మరో రెండురోజుల్లో దీనిపై పూర్తిస్థాయిలో స్పష్టత వస్తుందని అధికారులు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సాధారణ వర్షాలేకానీ భారీ వర్షాలు లేవని పేర్కొన్నారు. అయితే హిందూ మహా సముద్రంతోపాటు ఆగ్నేయ ఆసియాలో మూడు తుపాన్లు ఉన్నట్లు వెల్లడించారు. ఈ మేఘాలన్నీ బంగాళాఖాతంవైపు కదులుతుండటంతో తుపానుకు అవకాశం ఏమైనా ఉందేమో చూడాలని అధికారులు చెబుతున్నారు.
పంట కోత వేగంగా పూర్తిచేసిన అన్నదాతలు :
నేడు తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్, అనంతపురం, నంద్యాల, ప్రకాశం, పల్నాడు, ఎన్టీఆర్, పశ్చిమగోదావరి, కోనసీమ, అల్లూరి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణం కేంద్రం తెలిపింది. అయితే తెలంగాణకు మాత్రం ఎటువంటి వర్ష సూచనలు లేవు. చలి మాత్రం తీవ్రంగా ఉంటోంది. రాత్రివేళ ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలకు చేరుకునే అవకాశం ఉందంటున్నారు. ఈనెల మొదటివారంలో భారీ వర్షాలు కురుస్తాయనే ఉద్దేశంతో ఏపీలోని అన్నదాతలు పంట కోతలను వేగంగా పూర్తిచేశారు. వాస్తవానికి జనవరిలో పంట చేతికి వస్తుంది. అకాల వర్షాల వల్ల ధాన్యంలో తేమశాతం అధికంగా ఉంది. ఏపీ ప్రభుత్వం తేమ శాతం 25 వరకు ఉన్నప్పటికీ వీటిని కొనుగోలు చేసి 48 గంటల్లోగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేయనుంది.
చెదురు మదురు వర్షాలకు అవకాశం :
శాటిలైట్ అంచనాల ప్రకారం రాయలసీమలో చెదురు మదురు వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీలంకకు తూర్పువైపున ఒక అల్పపీనడం ఏర్పడటానికి అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఏపీలో గంటకు 10 నుంచి 15 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయి. తెలంగాణలో అయితే గంటకు 5 కిలోమీటర్ల వేగంతో వీస్తాయి. తెలంగాణలో పగటి ఉష్ణోగ్రత 29 డిగ్రీలు, ఏపీలో 32 డిగ్రీలు, తెలంగాణలో రాత్రివేళ 22 డిగ్రీలు, ఏపీలో 24 డిగ్రీలుగా ఉంటుంది. తేమ శాతం మాత్రం ఏపీలో 60 నుంచి 80 శాతం వరకు, తెలంగాణలో 60 నుంచి 70 శాతం వరకు ఉండనుందని వాతావరణ శాఖ తెలిపింది.
Leave a Reply