భీమ్ న్యూస్ ప్రతినిధి బాపట్ల – కడప (డిసెంబర్ 07) ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తీపికబురు చెప్పారు. శనివారం బాపట్ల మున్సిపల్ హైస్కూల్లో జరిగిన మెగా పేరెంట్స్, టీచర్స్ మీట్ కార్యక్రమంలో చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు. దేశంలోని తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో ఈ కార్యక్రమం ఏపీలో ప్రారంభమైంది. విద్యార్థులు, తల్లిదండ్రులు, దాతలు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు కలిసి రాష్ట్రవ్యాప్తంగా సుమారు కోటిమందికి పైగా ఈ కార్యక్రమంలో పాల్గొని పెద్ద పండుగలా నిర్వహించారు. శనివారం ఒక్కరోజే 45వేలకు పైలుకు ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా క్లాస్ రూమ్‌లు, నిర్మాణంలో ఉన్న భవనాలను పరిశీలించిన చంద్రబాబు, లోకేశ్ విద్యార్థులతో ముచ్చటించారు. అనంతరం విద్యార్థులు, పేరెంట్స్‌తో కలిసి ఇరువురూ భోజనాలు కూడా చేశారు.
తల్లిదండ్రులు, పూర్వవిద్యార్థుల సూచనలు, సలహాలు విన్న చంద్రబాబు విద్యార్థులు, ఉపాధ్యాయులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం పూర్వ విద్యార్థులు, పేరెంట్స్ నిర్వహించిన ఆటల పోటీల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు మాట్లాడుతూ డీఎస్సీ ప్రస్తావన తీసుకొచ్చారు. టీడీపీ హయాంలో 11 డీఎస్సీలు నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పటి వరకూ 1.50 లక్షల మంది టీచర్లను నియమించామని, ఖాళీ అయిన పోస్టులన్నింటినీ భర్తీ చేసేవాళ్లమని వెల్లడించారు. ఇకపై ప్రతి ఏటా డీఎస్సీ నిర్వహించి, టైమ్ టేబుల్ ప్రకారం నోటిఫికేషన్లు ఇస్తామని నిరుద్యోగులు సీఎం హామీ ఇచ్చారు. జూన్‌లో స్కూళ్లు ప్రారంభమయ్యే నాటికి నియమాకాలు పూర్తి చేసేందుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ చర్యలు తీసుకుంటాన్నారని తెలిపారు.
ఓ కంట కనిపెట్టాలి :
చదువు అనేది అన్నింటి కంటే పెద్ద ఆస్తి. పిల్లలు బాగా చదువుకునేలా అటు టీచర్లు, ఇటు తల్లిదండ్రులు కూడా సహకరించాలి. అందుకోసమే మంత్రి లోకేశ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో మొదటిసారి ఇలా పేరెంట్ టీచర్ మీట్ పెడుతున్నాం. పిల్లలను తల్లిదండ్రులు ఓ కంట కనిపెట్టాలి. పాఠశాలలు, కాలేజీలకు వెళ్తున్న పిల్లలు, విద్యార్థులు స్మార్ట్ఫోన్లకు బానిసలు కాకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లల భవిష్యత్ టీచర్లు, తల్లిదండ్రులు చేతుల్లోనే ఉంది. పిల్లల చదువుల పట్ల తల్లిదండ్రులు ఎప్పకప్పుడు పర్యవేక్షించాలి. యుక్త వయసులో పిల్లలు డ్రగ్స్, ఇతర దురవాట్లకు దూరంగా ఉండాలి.
మాదకద్రవ్యాలు మానవ సంబంధాలను నాశనం చేస్తాయి. రాష్ట్రంలో డ్రగ్స్ రక్కసిని రూపుమాపేందుకు ప్రభుత్వం ఈగల్ పేరుతో డ్రగ్స్ నిరోధక వ్యవస్థను ఏర్పాటు చేశాం. విద్యార్థులు డ్రగ్స్ ప్రమాదాన్ని తెలుసుకుని ఈ పోరాటంలో భాగస్వాములు కావాలి. డ్రగ్స్ వ్యతిరేక పోరాటం పాఠశాలల నుంచే ప్రారంభం కావాలి. విద్యా వ్యవస్థలో ఈరోజు చేసే మార్పులు, భవిష్యత్తులో పెను మార్పులు తీసుకొస్తాయి. గత ప్రభుత్వం గుంతల రోడ్లను, అప్పుల ఖజానాను మిగిల్చిపోయింది. విద్యాశాఖ వ్యవస్థలో భారీ అప్పులు బిగించిపోయింది. రాష్ట్ర బడ్జెట్ లక్షల కోట్ల అప్పులతో లోటు బడ్జెట్‌గా ఉంది. రాష్ట్రంలో చెత్త పేరుకు పోయింది. అయినా ఏ బాధ్యతను విస్మరించం’ అని చంద్రబాబు చెప్పారు.
ఛాలెంజ్‌గా తీసుకున్నాం :
మెగా పేరెంట్స్, టీచర్స్ మీట్ మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ విద్యాశాఖను ఛాలెంజ్‌గా తీసుకున్నానన్నారు. కేజీ నుంచి పీజీ వరకు విద్యా వ్యవస్థలో సమూల మార్పులు చేస్తామని చెప్పారు. ‘ పిల్లల్లో నేను దేవుడ్ని చూస్తాను. ప్రతి పిల్లవాడి అభివృద్ధి వెనుక వాళ్ల తల్లిదండ్రులు ఉంటారు. గ్రామీణ ప్రాంతాల్లో పిల్లల అభివృద్ధి కోసం, విద్యార్థుల తల్లిదండ్రులతో ఉపాద్యాయులతో కలిపి సమావేశం పెట్టాం. పిల్లల ఆరోగ్యంపై కూడా ప్రత్యేక దృష్టి పెడుతున్నాం. గడిచిన ఐదేళ్లలో విద్యా వ్యవస్థ నిర్వీర్యమైపోయింది. గాడి తప్పింది, అలా గాడి తప్పిన, విద్యాశాఖను గాడిలో పెట్టే బాధ్యత సీఎం చంద్రబాబు నాకు అప్పగించారు. ఇకపై విద్యా వ్యవస్థలో రాజకీయ జోక్యం లేకుండా చేస్తాం.
రాజకీయ నాయకుల ఫొటోలు స్కూల్లో, బుక్స్‌లో ఉండకూడదు. పాఠ్య పుస్తకాల్లో మహిళలకు సముచిత గౌరవం ఇవ్వాలి. నేను స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకుని, కొన్ని విషయాలు నేర్చుకున్నాను. పరీక్షా కేంద్రాల్లో టీచర్లు గానీ, ఇన్విజిలేటర్లు గానీ అక్కడ ఉండరు. అయినా ఎవరూ పక్క వాళ్ల పేపర్ కోసం, కాపీయింగ్ కోసం చూడరు. అలాంటి విద్య వ్యవస్థ ఇక్కడ కూడా రావాలి. ప్రభుత్వ విద్యావ్యవస్థ బాగుపడాలంటే మనం అంతా కలిసి పనిచేయాలి. అందుకే దేశంలో ఎప్పుడూ జరగని, లేని విధంగా మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఏర్పాటు చేశాం. విద్యా వ్యవస్థకు టెక్నాలజీని జోడిస్తాం. త్వరలోనే డిజిటల్ క్లాస్‌ను ప్రారంభిస్తాం’ అని లోకేశ్ వెల్లడించారు.
తండ్రికి సాయం :
కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు, లోకేశ్ ఇద్దరూ కలిసి భోజనం చేశారు. పూర్తయ్యాక తర్వాత చంద్రబాబు తిన్న ప్లేట్‌ను లోకేశ్ తీయడం అందరి దృష్టిని ఆకర్షించింది. దీనిపై ఎక్స్ వేదికగా తల్లి నారా భువనేశ్వరి స్పందించారు. ‘వెల్ డన్ లోకేశ్, చంద్రబాబు తిన్న ప్లేట్‌ను నువ్వు తీయడం, భోజన అనంతరం శుభ్రం చేస్తున్న సిబ్బందికి సాయపడడం, తల్లిదండ్రుల పట్ల నీకున్న అత్యంత గౌరవాన్ని చాటి చెప్పడమే కాదు, నిత్యం మనకు సహాయకారిగా ఉండే వారి పట్ల ఎంతటి విధేయతను కలిగి ఉన్నావో ఈ చర్య ద్వారా స్పష్టమవుతోంది. నిజంగా ఇది స్ఫూర్తిదాయకం’ అంటూ కుమారుడిపై ప్రశంసలు కురిపించారు.
మహనీయుల నేలకు :
కడప మున్సిపల్ హైస్కూలులో నిర్వహించిన మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్‌లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. స్కూల్ ప్రాంగణంలో తల్లిదండ్రులు, విద్యార్థులతో ముచ్చటించారు. మంత్రి నారా లోకేశ్ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమం జరగడం అభినందనీయమని కొనియాడారు. కార్యక్రమంలో భాగంగా పవన్ మాట్లాడుతూ మహనీయుల నేలకు తానొచ్చానని చెప్పారు. ‘ చదువుల నేల రాయలసీమ. అత్యధికంగా లైబ్రరీలు ఉన్న ప్రాంతం ఇదే. అందుకే నేను ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నాను. నన్ను పిఠాపురానికే పరిమితం చేసేవారు. కానీ, నేను సరస్వతికి నిలయమైన రాయలసీమను ఎంచుకున్నాను.
రాయచోటిలో విద్యార్థులు గొడవ చేస్తూ ఉంటే మందలించిన ఆ ఉపాధ్యాయుడు మృత్యువాత పడ్డాడు. చదువు ఉద్యోగం కోసమే కాదు జ్ఞానం సంపాదించుకోవడానికి కూడా. మనం భారతీయులం అని మరిచిపోకూడదు. రాయలసీమలో అన్నమయ్య, వేమన, పుట్టపర్తి నారాయణ చార్యులు, కేవీ రెడ్డి, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, గాడిచర్ల సర్వోత్తమరావు లాంటి మహానుభావులు పుట్టారు. అలాంటి ప్రాంతం అభివృద్ధి వెనకబాటుకాదు. అవకాశాలకు ముందుండి నడిచే ప్రాంతంగా రాయలసీమ కావాలి.
సీఎం చంద్రబాబ , మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాయలసీమ ప్రాంతం వారు కావడంతో సమస్యలు తీరిపోయి ఉంటాయి అని అనుకున్నాను. కానీ, కడపలో నీటి సమస్య తీవ్రంగా ఉంది. ఈ సమస్య ఉంటుందని నేను అసలు అనుకోలేదు. పులివెందులలో తాగునీటి సమస్య కోసం 40 కోట్ల నిధులను విడుదల చేస్తాం. గత ప్రభుత్వం చేపట్టిన పథకాలను పనులను కొనసాగిస్తున్నాం. కడప నగరంలో తాగునీటి సమస్య మౌలిక వసతులు సమస్య తీర్చడానికి కచ్చితంగా నేను బాధ్యత తీసుకుంటాను’ అని పవన్ కళ్యాణ్ చెప్పారు.
మాటిస్తున్నాం :
ఈ సందర్భంగా కడప ప్రభుత్వ స్కూల్ కిచెన్ ఆధునీకరణకు, విద్యార్థినుల ఆటలకు అవసరమైన నిధులన్నీ తానే సమకూరుస్తానని పవన్ మాటిచ్చారు. ‘ నా నిజమైన హీరోలు టీచర్లే. నా సినిమాలో రీ రికార్డింగ్స్ ఉంటాయి. నిజమైన హీరోలకు రీ రికార్డింగ్స్ ఉండవు. కార్గిల్‌లో మనకోసం చనిపోయిన వారికి రి రికార్డింగ్స్ ఉండవు. వీధులు శుభ్రపరిచే మన కుటుంబం అది. నా చేత మా అమ్మానాన్న బాత్రూంలు కడిగించారు.
ప్రతి విద్యార్థి డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంశాన్ని గుర్తు పెట్టుకోవాలి. శానిటేషన్ సిబ్బంది అంటే నాకెంతో గౌరవం. వారిని ప్రతి ఒక్కరూ గౌరవించాలి. దేశం కోసం ప్రాణాలు అర్పిస్తున్న సైనికులు, ప్రాణాలర్పిస్తున్న పోలీసులు వారిని ప్రేరణగా తీసుకోవాలి స్కూల్స్‌ను ఇతర కార్యక్రమాలకు వాడినా, కబ్జా చేసినా కేసులు పెడతాం. రాయలసీమ అంటే తెగింపుల నేల, ఆడపిల్లలను ఏడిపిస్తే సహించేది లేదు. రాయలసీమ అంటే వెనుకబడిన ప్రాంతం కాదు సాహిత్యానికి నిలయం’ అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు.
పదిలో ఫెయిల్ అయ్యా :
1972లో తాను 10వ తరగతి ఫెయిల్ అయ్యానన్న విషయాన్ని మంత్రి పొంగూరు నారాయణ గుర్తు చేసుకున్నారు. ఇలా జరిగిన తర్వాతే తనలో కసి పెరిగిందని డిగ్రీ, పీజీలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్‌గా తయారయ్యానని చెప్పారు. సక్సెస్ కంటే ముందే తానొక ఫెయిల్యూర్ వ్యక్తినని చెప్పడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. నెల్లూరులోని బీవీఎస్ గర్ల్స్ హైస్కూల్లో జరిగిన పేరెంట్స్, టీచర్స్ మీటింగ్‌లో మంత్రి పాల్గొన్నారు. కార్యక్రమంలో మాట్లాడుతూ తన విద్యా సంస్థల ద్వారా లక్షలాది మంది విద్యార్థులకు విద్యను అందిస్తున్నట్లు తెలిపారు. మార్కులు తక్కువ వచ్చాయని పిల్లలను తిట్టకూడదని, వారు బాగా చదువుకునేలా ప్రోత్సహించాలని మంత్రి సూచించారు.
Leave a Reply