భీమ్ న్యూస్ ప్రతినిధి పెళ్లకూరు (డిసెంబర్ 07) తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నెలుబల్లిలో మెగా పేరెంట్ టీచర్ల సమావేశం ప్రధానోపాధ్యాయిని డి కవిత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ పోలంరెడ్డి శేఖర్ రెడ్డి, జడ్పిటిసి ప్రిస్కల్లా, నెలుబల్లి సర్పంచ్ కమలమ్మ దంపతులు, పాఠశాల కమిటీ చైర్మన్ శంకరయ్య, వైస్ చైర్మన్, మాజీ చైర్మన్ మునికృష్ణారెడ్డి తదితరులు హాజరయ్యారు. తల్లిదండ్రులను, ప్రజాప్రతినిధులను ఉపాధ్యాయులు, విద్యార్థులు సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మండల పరిషత్ ప్రెసిడెంట్ (ఎంపీపీ) శేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులుగా మండలంలోని పాఠశాలల అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. విద్యాభివృద్ధిలో పాఠశాలల ముందుంచే విధంగా తమ వైపు ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. తల్లిదండ్రులు బడివైపు ఒక ముందడుగు వేసి తమ పిల్లల చదువులను గమనిస్తూ మరింత బాగా చదివేందుకు విద్యార్థులను ప్రోత్సహించాలని తల్లిదండ్రులను కోరారు.
జడ్పిటిసి ప్రిస్కిల్లా మాట్లాడుతూ విద్యార్థులు తల్లిదండ్రులు పాఠశాలలో జరిగే వివిధ కార్యక్రమాలకు హాజరవడం మూలంగా తమ విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దుకునే విధంగా తయారు చేసుకోవచ్చని అన్నారు. విద్యార్థులు క్రమశిక్షణగా చదువుకుంటే భవిష్యత్తులో మంచి స్థాయిలో రాణిస్తారని అన్నారు. సమాజంలో విద్యార్థులు ప్రవర్తన ఆదర్శంగా ఉండేటట్లు తల్లిదండ్రులు తీర్చిదిద్దాలని కోరారు. విద్యార్థులకు పాఠశాలల్లో ఉపాధ్యాయుల బోధన మంచి ఉత్తీర్ణత పెంపొందే దిశగా సాగుతోందని విద్యార్థులు మరింత సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. పాఠశాల కమిటీచైర్మన్ శంకరయ్య మాట్లాడుతూ తాము చదివే కాలంలో టీచర్లంటే భయభక్తులు పెరిగి చదువు పట్ల శ్రద్ధ భక్తులు ఉండేటివి అని అన్నారు. ఇదే పాఠశాలలో చదివామని ఆ అనుభూతులను గుర్తు చేసుకున్నారు. మాజీ చైర్మన్ ముని కృష్ణారెడ్డి మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థులు మంచి ఉత్తీర్ణత స్థాయిని చేరుకోవడం చాలా సంతోషకరమని ఇదే విధంగా కొనసాగాలని కోరారు.
తల్లిదండ్రులు మాట్లాడుతూ విద్యార్థులకు ఉపాధ్యాయులకు ప్రభుత్వం ఏర్పరిచే ఇటువంటి కార్యక్రమాల పట్ల సానుకూల వాతావరణం ఏర్పడి విద్యార్థుల సమస్యలు తల్లిదండ్రులకు తెలపడం మూలంగా విద్యార్థులను మరింత శ్రద్ధగా చదివించేందుకు మంచి ప్రవర్తన పెంచేందుకు ఉపయోగపడతాయని అన్నారు. ఈ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమం మంచి కార్యక్రమంగా అభివర్ణించారు. ప్రధానోపాధ్యాయులు డి కవిత మాట్లాడుతూ పాఠశాలలో మెరుగైన సౌకర్యాలు ఏర్పాటుకు తమ వంతు కృషి చేస్తూ ఉన్నామని అన్నారు. విద్యార్థులను చదువు పట్ల ఎప్పటికప్పుడు మెలకువలు నేర్పించడం ఉపాధ్యాయుల ద్వారా జరుగుతోందని తెలిపారు. తమ పాఠశాల సిబ్బంది విద్యార్థుల యొక్క సమస్యల పట్ల కూడా మరింత అప్రమత్తంగా ఉంటున్నారని అన్నారు. ఈ కారణంగా కూడా పాఠశాలలో గత సంవత్సరంలో పదవ తరగతి ఉత్తీర్ణతలో 100% తీసుకు రాగలిగామని, అన్నారు. విద్యార్థులను ఏ విధంగానైనా మంచి ఉత్తీర్ణతలు స్థాయిలో నిలపడమే ప్రధాన ధ్యేయంగా పనిచేయడం జరుగుతుందని అన్నారు. అనంతరం విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహించి బహుమతులు అందించారు. తల్లిదండ్రులు విద్యార్థులతో కలిపి సహపంక్తి భోజనాలతో కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ, పోలీసుశాఖ, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.
Leave a Reply