భీమ్ న్యూస్ ప్రతినిధి ఇందుకూరుపేట (డిసెంబర్ 10) నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కొరుటూరు పంచాయతీ కొరుటూరు గ్రామ సచివాలయం ఎదుట మంగళవారం గ్రామ ఉప సర్పంచ్ తుమ్మల ప్రసాద్ యాదవ్ మరికొంతమంది గ్రామస్తులతో కలిసి నిరసనలు తెలిపారు. ఈ సందర్భంగా ఉప సర్పంచ్ ప్రసాద్ మాట్లాడుతూ గతంలో గ్రామ స్మశాన వాటికలో అనేక అసాంఘిక కార్యక్రమాలు జరిగేవని, వాటిని నిర్మూలించేందుకు స్మశాన వాటికను గోపాల్ అనే దాత సహాయంతో 20 లక్షల రూపాయలు వెచ్చించి సుందరంగా తీర్చిదిద్దామని అన్నారు. స్మశాన వాటికకు కాపలాగా 7000 రూపాయలు జీతం ఇచ్చి రఘు రామయ్య అనే వ్యక్తిని వాచ్ మెన్ గా ఏర్పాటు చేసి చెట్లు నాటించామని, శ్మశాన గేటుకు తాళం వేసి కాపాడుకుంటూ వస్తున్నామని తెలిపారు. అయితే నూతనంగా నియమితమైన పంచాయతీ సెక్రటరీ శివ జ్యోతి తాళం వెయ్యొద్దు అని గ్రామస్తులను వారిస్తుందని, స్మశాన వాటికకు తాళం వేయకపోతే అనేక అసాంఘిక కార్యక్రమాలు జరుగుతాయంటూ గ్రామస్తులంతా కలిసి నిర్ణయం తీసుకున్నామని అన్నారు. సదరు స్మశాన వాటిక విషయమై పంచాయతీ సెక్రటరీ అత్యుత్సాహం చూపిస్తుందని, జామీన్ సెక్రెటరీ సర్టిఫికెట్ ఇచ్చేందుకు ఒక గ్రామస్తుడి వద్ద 1000 రూపాయలు నగదు తీసుకుందని ఉప సర్పంచ్ ప్రసాద్ ఆరోపించారు.
గ్రామ పంచాయతీ కార్యదర్శి వివరణ:
భీమ్ మీడియా ప్రతినిధి ఈ విషయంపై పంచాయతీ కార్యదర్శి శివ జ్యోతిని చరవాణిలో వివరణ కోరగా పంచాయతీలోని గిరిజనులు చనిపోతే ఆ శవాలను పూడ్చేందుకు శ్మశాన వాటిక వద్దకు వెళితే శ్మశాన గేట్లు తీయడం లేదని, గ్రామంలో నాయకులకు తెలియపరచినా ఎవరూ పట్టించుకోవడం లేదని గ్రామంలోని ఎస్టీలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాను శ్మశానం గేటుకు తాళం వేయొద్దని చెప్పినట్లు తెలిపారు. దీంతో గ్రామ ఉప సర్పంచ్ ప్రసాద్ గ్రామస్తుడి వద్ద లంచం తీసుకున్నట్లు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, 2023 లో రొయ్యల ఫాక్టరీల వద్ద వ్యర్ధాలను సేకరించినట్లు దానికి సంబంధించిన సర్టిఫికేట్ ఇవ్వమని ఉప సర్పంచ్ ప్రసాద్ కోరగా, సంవత్సరం క్రితం చేసిన పనికి నెల రోజుల క్రితం పంచాయతీకి వచ్చిన నేను, ఆ సర్టిఫికేట్ ఇవ్వలేనని చెప్పినందుకు ఉప సర్పంచ్ ప్రసాద్ కక్ష సాధింపు చర్యగా తనపై కావాలనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, గతంలో తాను పని చేసిన పంచాయతీలో గ్రామస్తులను అడిగితే తన నిజాయతీ గురించి చెబుతారని వెల్లడించారు.
Leave a Reply