భీమ్ న్యూస్ ప్రతినిధి విజయవాడ (డిసెంబర్ 10) ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషీకి నిన్న ఫోన్ చేసి చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్, మెసేజ్ లు చేసిన వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. నిన్న పవన్ కళ్యాణ్ పేషీ నుంచి అందిన ఫిర్యాదు మేరకు డీజీపీ పోలీసుల్ని అప్రమత్తం చేశారు. దీంతో 24 గంటల్లోనే పవన్ ను చంపేస్తామంటూ బెదిరించిన నిందితుడిని గుర్తించడంతో పాటు అరెస్టు కూడా చేశారు.
గతంలో అతను హోంమంత్రి అనితను కూడా బెదిరించినట్లు గుర్తించారు. పవన్ కళ్యాణ్ ని చంపుతానని ఫోన్ లో ఆయన పేషీ సిబ్బందిని బెదిరించిన వ్యక్తి విజయవాడకి చెందిన నూక మల్లిఖార్జున్ గా పోలీసులు గుర్తించారు. మల్లిఖార్జున కోసం నాలుగు పోలీసు బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చేపట్టగా అతను నగరంలోనే దొరికాడు. దీంతో అతని స్థానిక పీఎస్ కు తీసుకెళ్లి విచారిస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ పేషీ నంబర్లు ఎలా దొరికాయి, ఫోన్ చేసి ఏమేం మాట్లాడాడన్న దానిపై విచారిస్తున్నారు. అయితే అరెస్టును అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
నూక మల్లిఖార్జున మానసిక పరిస్థితి సరిగా లేదని పోలీసులు గుర్తించారు. మద్యం మత్తులో ఇలా బెదిరింపు కాల్స్ చేసినట్లు నిర్ధారించారు. గతంలో ఇలా ఎవరెవరిని బెదిరించాడన్న దానిపై నూక మల్లిఖార్జునను పోలీసులు విచారిస్తున్నారు. విచారణలో భాగంగా గతంలో వైజాగ్ లో నూక మల్లిఖార్జునపై 354 కేసు నమోదు అయినట్లు గుర్తించారు. దీంతో ఇంకా ఏయే పోలీసు స్టేషనన్లలో అతనిపై కేసులున్నాయన్న దానిపై ఆరా తీస్తున్నారు.
Leave a Reply