భీమ్ న్యూస్ ప్రతినిధి తిరుపతి (డిసెంబర్ 14) భారత రాజ్యాంగం 75వ వార్షికోత్సవం పురస్కరించుకుని భారత రాజ్యాంగం అమలు, సాదించిన పురోగతి, సవాళ్ళపై పార్లమెంటులో చర్చ జరిగింది. ఈ చర్చలో వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ తరపున తిరుపతి ఎంపీ డా.మద్దిల గురుమూర్తి పాల్గొన్నారు. రాజ్యాంగం ఆమోదింపబడే నాటికి భారత దేశం సుమారు 20% అక్షరాస్యత రేటు, సగటు ఆయుర్దాయం 32 సంవత్సరాలు ఉన్నప్పటికీ, అప్పటి మన వ్యవస్థాపక నాయకులు న్యాయం, స్వాతంత్య్రం, సమానత్వం మరియు సోదరాభిమానంపై బలంగా నమ్మి రాజ్యాంగాన్ని రూపొందించారని అన్నారు. డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ప్రపంచంలోని 60 కంటే ఎక్కువ దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి, భారతదేశ ప్రజల కోసం అనువైన రాజ్యాంగాన్ని రూపొందించారని తెలిపారు. ఆయన రాజ్యాంగాన్ని “జీవిత వాహనం” అని వర్ణించారని, మనం రాజ్యాంగాన్ని కేవలం రాజకీయ దస్తావేజుగా మాత్రమే కాకుండా, సామాజిక మార్పు, చరిత్రపూర్వక అన్యాయాలపైన హక్కుల రక్షణగా కూడా చూడాలన్నారు. కేశవానంద భారతి తీర్పు మరియు ప్రాథమిక నిర్మాణ సిద్ధాంతం ద్వారా మన లౌకిక మరియు ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించుకుంటూ భిన్నత్వంలో ఏకత్వాన్ని జరుపుకుంటూ, న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే కీలక సూత్రాలు మన ప్రజాస్వామ్యానికి పునాదిగా నిలుస్తాయని అన్నారు.
ఈ రాజ్యాంగం అమలు తర్వాత అనేక రంగాలలో సాదించిన పురోగతి గురించి ఎంపీ గురుమూర్తి వివరిస్తూ భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా అవతరించిందని, శక్తివంతమైన ఓటరు భాగస్వామ్యంతో మన వ్యవస్థలపై నమ్మకాన్ని ప్రదర్శిస్తుందని తెలిపారు. అణగారిన సమాజానికి ప్రభుత్వ ప్రణాళికల ద్వారా అర్థ ప్రధమైన మార్పులు చోటుచేసుకున్నాయని అంతే కాకుండా అసమానతలు కూడా తొలగించబడ్డాయని అన్నారు. భారత్ ఏకకాలంలో అగ్రరాజ్య ఆర్థిక వ్యవస్థ నుంచి ఐటీ, వ్యవసాయం వంటి రంగాలలో ప్రపంచంలో అగ్రగామిగా ఎదిగిందని పేర్కొన్నారు. అక్షరాస్యత రేటు 74% కు పెరిగిందని అలాగే సగటు జీవితకాలం 70 సంవత్సరాలకు చేరుకుందని అన్నారు. G20 వంటి ఆర్గనైజేషన్లలో భారతదేశం కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. ఈ 75 సంవత్సరాల ప్రగతి సాధించినప్పటికీ కొన్ని సవాళ్లు ఇంకా ఉన్నాయని అన్నారు. సంపద విభజనను సరిచేసి, సమానాభివృద్ధిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందిని అన్నారు. అలాగే సామాజిక ఇబ్బందులు అయినటువంటి కుల,లింగ వివక్షతలను సమర్థంగా తొలగించాల్సిన అవసరం ఉందని తెలియజేశారు. దేశంలోని ఆర్థిక మరియు వాతావరణ సమస్యలను ప్రత్యేకంగా అంతర్జాతీయ స్థాయిలో సమన్వయం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. దేశంలో 50% జనాభా 25 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు కలిగి ఉండగా, యువత సామాజిక బాధ్యతలను అవగాహన చేసుకొనే విదంవి లువలు వృద్ధి చెందడానికి చాలా ముఖ్యమైనవని తెలిపారు.
*తన సహచర టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి పార్లమెంట్ లో ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేస్తూ నిరాధారమైన ఆరోపణలు చేశారని, ఇది టీడీపీ యొక్క సర్వసాధారణ వ్యూహమని అన్నారు. రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి నేత్రుత్వంలోని గత ప్రభుత్వ పరిపాలన గూర్చి వివరిస్తూ ఈ సందర్భంలో, మా నాయకుడు రాజ్యాంగం పట్ల విశ్వాసాన్ని ప్రతిబింబించేలా పరిపాలించారని ఎంపీ గురుమూర్తి వివరించారు.
1. సామాజిక న్యాయం: “జగనన్న విద్యా దీవెన”, “అమ్మ ఒడి” మరియు “వైఎస్సార్ చేయూత” వంటి కార్యక్రమాలు మామూలు మతతత్వాలను కూలగొట్టి అణగారిన వర్గాలను సమాజంలో భాగం చేశాయని అన్నారు.
2. భూమి, ఇల్లు హక్కు: మా గత ప్రభుత్వం 31 లక్షల కుటుంబాలకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేసిందని పారదర్శకత పరంగా అరుదైన ఘనతలలో ఇది ఒకటని తెలిపారు.
3. స్థానిక పాలన: “వాలంటీర్ సిస్టం”, “నాడు-నేడు”, “వైఎస్సార్ రైతు భరోసా” వంటి కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాలలో అద్భుతమైన మార్పును తెచ్చాయని అన్నారు.
4. ఆర్థిక అభివృద్ధి: గత ప్రభుత్వం “ఈజ్ ఆఫ్ డోయింగ్ బిజినెస్”లో అగ్రస్థానాన్ని సాధించడంతోపాటు ₹13.41 లక్షల కోట్లు పెట్టుబడులను ఆకర్షించిందని 6 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించిందని తెలిపారు.
5. మహిళల భద్రత: “దిశ యాప్”, “దిశ పోలీసు స్టేషన్లు” వంటి చర్యలతో మహిళల భద్రతపై మన ప్రభుత్వం అగ్రగామిగా నిలబడిందని పేర్కొన్నారు.
*నిరాధారమైన ఆరోపణలకు లేదా ప్రచారాలను మనం నమ్మరాదంటూ, గత ప్రభుత్వ పాలనలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో సామాజిక న్యాయం జరిగిందని అన్నారు. చివరగా తన ప్రసంగాన్ని ముగిస్తూ “రాజ్యాంగం ఎంత మంచిదైనా దానిని అమలు చేయబడే వారు చెడ్డవారిగా ఉంటే అది చెడ్డదిగా మారుతుంది.” అని డాక్టర్ అంబేద్కర్ సముచితంగా హెచ్చరించాడని చెబుతూ రాబోయే తరాలకు ఇది ఆశ, ఐక్యత మరియు ప్రగతికి దీటుగా ఉండేలా దాని ఆదర్శాలను నిలబెట్టుకుంటామని ప్రతిజ్ఞ చేద్దాం అంటూ ముగించారు.
Leave a Reply