భీమ్ న్యూస్ ప్రతినిధి తిరుపతి (డిసెంబర్ 16) తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని వివిద రైల్వే సమస్యలపై తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి సోమవారం పార్లమెంటు జీరో హవర్ లో గళమెత్తారు. ఈ సందర్భంగా పలు రైల్వే సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. పెరుగుతున్న రైల్వే ట్రాఫిక్ దృష్ట్యా రేణిగుంట-గూడూరు మధ్య మూడవ రైల్వే లైన్ నిర్మాణం కూడా అత్యవసరమని ఎంపీ తెలిపారు. ప్రస్తుతం ఉన్న రైల్వే మార్గాలపై భారం తగ్గించి, ప్రయాణం వేగవంతం చేసేందుకు ఈ కొత్త లైన్ ఎంతో అవసరమనే విషయాన్ని వివరించారు. అలాగే పూడి, ఏర్పేడు మధ్య కొత్త రైల్వే లైన్ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయడం ద్వారా స్థానిక ప్రాంతాల మధ్య కనెక్టివిటీ మెరుగవుతుందని తెలిపారు. ఇది స్థానిక ఆర్థిక వనరుల్ని బలోపేతం చేయడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుందని ఈ లైన్ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తెసుకోవాలని కోరారు.
కోవిడ్-19 సమయంలో కొన్ని రైళ్లు స్టాపింగ్లను ఎత్తేశారని తిరిగి వాటిని పునరుద్ధరించాలని, అందులో భాగంగా వెందోడు, నాయుడుపేట, సూళ్లూరుపేట స్టేషన్లలో నిలిపివేసిన రైళ్ల స్టాపింగ్లను పునరుద్ధరించాలని అభ్యర్థించారు. తద్వారా ఈ ప్రయాణికులకు రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయని మంత్రికి ఎంపీ వివరించారు. తిరుపతి-నెల్లూరు మరియు కడప మధ్య మెము సర్వీసులు అందించడం ద్వారా నిత్యం ప్రయాణించే వారికి ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు.
గూడూరు అంబేద్కర్ నగర్ వద్ద ఇరుకైన అండర్ పాస్ కారణంగా తీవ్ర రవాణా సమస్యలు ఎదురవుతున్నాయని, దీనిని విస్తరించడం ద్వారా ట్రాఫిక్ కష్టాలను తగ్గించవచ్చని వివరించారు. తిరుపతి, విశాఖపట్నం మధ్య వందే భారత్ స్లీపర్ రైలు సేవలను అందించడం ద్వారా యాత్రికులకు వేగవంతమైన ప్రయాణ సౌకర్యాలు లభిస్తాయని ఎంపీ వివరించారు. అలాగే, తిరుపతి నుంచి వారణాసి -అయోధ్యకు కొత్త రైలు సర్వీసులు ప్రారంభించడం ద్వారా భక్తులు, యాత్రికులకు అద్భుతమైన రవాణా సౌకర్యాలను కల్పించొచ్చని గౌరవ సభ ద్వారా కేంద్ర రైల్వే మంత్రి దృష్టికి ఎంపీ గురుమూర్తి తీసుకెళ్లారు. కావున, ఈ ప్రాజెక్టులపై తక్షణం దృష్టి సారించి వాటి అమలును వేగవంతం చేయాల్సిందిగా రైల్వేమంత్రికి తిరుపతి ఎంపీ విజ్ఞప్తి చేశారు.
Leave a Reply