భీమ్ న్యూస్ ప్రతినిధి విశాఖపట్నం (డిసెంబర్ 18) ఏపీలో ఒకవైపు చలి, మరోవైపు ముసురు వాతావరణంతో ఏపీలో చిత్రమైన పరిస్థితి నెలకొంది. దీనికి తోడు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతుండటంతో రాబోయే రెండు మూడురోజుల్లో మరింత బలపడుతుందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం వెల్లడించింది.
బలపడిన తర్వాత అల్పపీడనం తమిళనాడు తీరంవైపు సాగుతుందని, దీని ప్రభావంతో ఏపీ, తమిళనాడు, యానాంలో భారీ వర్షాలు కురవనున్నట్లు తెలిపింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించింది.
భారీ నుంచి అతి భారీ వర్షాలు :
బుధవారం ప్రకాశం, బాపట్ల, కృష్ణా, విజయనగరం జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే తిరుపతి, నెల్లూరు, శ్రీపొట్టి శ్రీరాములు జిల్లా, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురియనున్నాయి.అలాగే తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, కృష్ణా, కోనసీమ, శ్రీకాకుళం జిల్లాలో భారీ వానలు పడటానికి అవకాశం ఉంది. అల్పపీడనం వాయుగుండంగా మారనుందని అధికారులు తెలిపారు. దీనివల్ల పంటపొలాల్లో వ్యవసాయం చేస్తున్న అన్నదాతలకు కష్టాలు ఎదురుకానున్నాయి. ఇప్పటికీ సంక్రాంతికి ఇంటికి పంట రావాల్సి ఉండగా వర్షాల వల్ల నెలరోజులు ముందుగానే కోతకు సిద్ధమయ్యారు. ధాన్యంలో 25 శాతం తేమ ఉన్నప్పటికీ కొనుగోలు చేయాలని ఏపీ ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీచేసింది.
వేటకు వెళ్లినవారు అప్రమత్తంగా :
రాష్ట్ర విపత్తులు, నిర్వహణ సంస్థ, రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో పాటు రైల్వే శాఖను విశాఖపట్నం వాతావరణ కేంద్రం అప్రమత్తం చేసింది. గంటకు 55 కిలోమీటర్ల వేగంతో దక్షిణ కోస్తాలో బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నట్లు తెలిపింది. మత్స్యకారులెవరూ సముద్రంలో వేటకు వెళ్లవద్దని, వెళ్లినవారు తిరిగిరావాలని సూచించింది. పొలాల్లో పంటలు వేస్తున్న రైతులు వాతావరణశాఖ చేసిన సూచనలవల్ల ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే గిట్టుబాటు ధర కోసం నానా ప్రయత్నాలు చేస్తున్నామని, ఇటువంటి పరిస్థితుల్లో తిరిగి వర్షాలు పడితే అన్నదాతలను ప్రభుత్వమే ఆదుకోవాలని, ఇప్పుడున్న పంటలను గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయడంతోపాటు రాబోయే కాలంలో పంటలు వేసేందుకు పెట్టుబడి సాయాన్ని అందించాలని కోరుతున్నారు.
Leave a Reply