భీమ్ న్యూస్ ప్రతినిధి అమరావతి (డిసెంబర్ 20) తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడి.. విశాఖకు 450 కిమీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఆ తర్వాత, ఇది ఉత్తర-ఈశాన్య దిశగా కదులుతూ, తదుపరి 24 గంటలలో తీవ్ర వాయుగుండంగా కొనసాగునున్నదని దీని ప్రభావంతో శనివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, మరికొన్ని చోట్ల భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.పశ్చిమ మధ్య దాని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం కేంద్రీకృతమైంది. అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి సగటు 5.8 కి.మీ వరకు విస్తరించి ఉందని తెలిపింది.
డిసెంబర్ 21న శనివారం:
శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
అలాగే రాగల 24 గంటల్లో కాకినాడ, అల్లూరి, అనకాపల్లి, విశాఖ, మన్యం విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలోని పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయంది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లు గరిష్టంగా 60 కిలోమీటర్లు వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. మత్య్సకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. కళింగపట్నం నుంచి మచిలీపట్నం వరకు ఉన్న అన్ని పోర్టుల్లో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కాగా, గడిచిన 24 గంటలలో విజయనగరం జిల్లా మెంటాడలో 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ వెల్లడించింది.
Leave a Reply