భీమ్ న్యూస్ ప్రతినిధి నెల్లూరు నగరం (డిసెంబర్ 23) దివంగత సీనియర్ జర్నలిస్ట్ గవిని చక్రపాణి కాంస్య విగ్రహాన్ని ఇందుకూరుపేట మండలంలో ఏర్పాటు చేయాలని, దానికి కావలసిన స్థలానికి అనుమతులు ఇవ్వాలని కోరుతూ ఇందుకూరుపేట మండలం జర్నలిస్టులు, ప్రజా సంఘాల నాయకులు, అభిమానులు కలిసి నెల్లూరు నగరంలోని గాంధీ బొమ్మ సెంటర్ నుండి కలెక్టరేట్ వరకూ పాదయాత్ర చేసుకుంటూ వెళ్ళారు. అనంతరం గ్రీవెన్స్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ కి వినతి పత్రం సమర్పించారు. విగ్రహం ఏర్పాటుకు సానుకూలంగా స్పందించిన జిల్లా కలెక్టర్ కు జర్నలిస్ట్ గవిని చక్రపాణి కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ 40 ఏళ్లు జర్నలిస్ట్ గా పని చేసిన సీనియర్ జర్నలిస్ట్ గవిని చక్రపాణి అందరితో కలివిడిగా ఉండేవాడని, అటు ప్రజా ప్రతినిధులతో, ఇటు అధికారులతో, స్నేహ పూర్వకంగా వుంటూ ఎన్నో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేశారని, అటువంటి నిస్వార్థ సేవకుడికి చిహ్నంగా కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని జర్నలిస్టులు నిర్ణయం తీసుకోవడం, దీనికి తోడు జర్నలిస్ట్ చక్రపాణి అభిమానులు పెద్ద ఎత్తున తరలి రావడం చాలా ఆనందంగా వుందని అన్నారు. చక్రపాణి విగ్రహం ఏర్పాటు పూర్తయ్యే వరకూ ప్రజా సంఘాలు తోడుగా నిలుస్తాయి అని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఇందుకూరుపేట మండలం జర్నలిస్టులు, జర్నలిస్ట్ చక్రపాణి కుటుంబ సభ్యులు, అభిమానులు పాల్గొన్నారు.
Leave a Reply