భీమ్ న్యూస్ ప్రతినిధి శ్రీకాకుళం (డిసెంబర్ 23) అరసవిల్లి రథసప్తమి రాష్ట్ర పండుగ వేడుకలు కోలాహలంగా జరిపి రాష్ట్ర స్థాయి పండుగలా నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కోరామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన వెంటనే అరసవిల్లి రథసప్తమి రాష్ట్ర పండుగ వేడుకలు జరుపుకోవడానికి ఉత్తర్వులు జారీ చేశారని అన్నారు. జిల్లా కలెక్టరెట్ సమావేశ మందిరంలో సోమవారం ఏర్పాటు చేసిన రాష్ట్ర పండుగగా రథసప్తమి వేడుకల ఏర్పాట్లపై మంత్రి, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పి కె వి మహేశ్వర రెడ్డి, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, శ్రీకాకుళం, నరసన్నపేట శాసనసభ్యులు గొండు శంకర్, బగ్గు రమణమూర్తితో కలసి సమీక్షించారు.
దేవాదాయశాఖ సహాయ కమిషనర్ ముందుగా రథసప్తమి వేడుకలకు సంబందించి చేపట్టనున్న పనులపై నివేదిక సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వామి వారికి పట్టు వస్త్రాలు జిల్లా ఇంచార్జ్ మంత్రి చేతులపై అందించే దిశగా చర్యలు చేపట్టాలన్నారు. రథసప్తమికి రెండు రోజుల ముందునుండే కార్యక్రమాలు నిర్వహించాలని, ఆలయానికి రంగులు వేయాలన్నారు. డిసిఎంఎస్ కార్యాలయం నుండి మూడు లైన్లలో దర్శనానికి ఏర్పాటు చేయాలని, ప్రతీ పాస్ పై క్యూఆర్ కోడ్ తప్పనిసరిగా ఉండాలని ఆలయ అధికారులను మంత్రి ఆదేశించారు.
డోనర్లు, ఐదువందల టికెట్, ఉచిత దర్శనం వారికి డిసిఎమ్ఎస్ నుండి, విఐపిలకు ఆలయ ముఖద్వారం నుండి ప్రవేశం కల్పించాలని అన్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా త్రాగునీరు, మరుగుదొడ్లు సిద్దం చేయాలన్నారు. పారిశుధ్యం, వాహనాల ప్రవేశం, బయటకు వెళ్లే మార్గాలు పక్కాగా ఉండాలన్నారు. పార్కింగ్ ముందుగా మూడు ప్రాంతాలు గుర్తించాలన్నారు. కేశ ఖండనశాల ఏర్పాట్లపై దృష్టి సారించాలన్నారు. మంత్రి గూగుల్ మ్యాప్ లో అరసవిల్లి పరిసర ప్రాంతాలు పరిశీలించారు. కోవెల ఎదురుగా ఉన్న షాప్ లు తొలగించాలని దానికి సంబంధించిన అనుమతులు తెప్పించడానికి చర్యలు చెప్పడతామన్నారు. దేవాలయానికి డొనేషన్ ఇచ్చిన వారు జనవరి 5 వ తేదీ లోగా కోవెల కార్యాలయానికి వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు. రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారికి మాత్రమే డోనర్ కార్డు అందజేయడం జరుగుతుందన్నారు. వారికి మాత్రమే దర్శనానికి అనుమతించడం జరుగుతుందన్నారు.
పట్టణంలో ముఖ్యమైన కూడలల్లో పూర్తి స్థాయిలో దీపాలంకరణ చేయాలన్నారు. వేడుకలు ప్రశాంతంగా సజావుగా జరగాలని అధికారులకు సూచించారు. దర్శనానికి వచ్చే భక్తులకు దర్శనం చేసుకోవడానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలనీ అన్నారు. అధికారులు, కమిటీ సభ్యులు సమన్వయంతో కృషి చేయాలని కోరారు. ఇతర రాష్ట్రాల నుండి లక్షలాదిగా భక్తులు తరలి వస్తారని అందుకు తగిన ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. గత అనుభవాల దృష్ట్యా లోపాలను సవరించుకుంటూ వేడుకలు విజయవంతంగా చేయాలని విజ్ఞప్తి చేశారు. పక్కాగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి, ఎటువంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖను కోరారు. త్రాగు నీటి సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ముందస్తుగా ప్రతీ 300, 400 మీటర్లకి త్రాగు నీరు అందించేలా చర్యలు చేపట్టాలన్నారు. భక్తులకు ఉచిత ప్రసాదం అందించే దిశగా చర్యలు చేపట్టాలన్నారు. మీడియాకి సంబంధించి లింక్ అందజేయడం జరుగుతుందన్నారు.
మీడియా పాయింట్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలకు కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. మందుగుండు సామాగ్రి సిద్ధం చేసుకోవాలన్నారు. రెండవ సమావేశం కోవెలలొ నిర్వహించడం జరుగుతుందన్నారు. అన్ని శాఖల సమన్వయంతో ఘనంగా నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో ఇంచార్జ్ డిఆర్ఓ అప్పారావు, ఆర్ డి ఓ సాయి ప్రత్యూష, జిల్లా వైద్య ఆరోగ్య అధికారిణి డా. బి. మీనాక్షి సంబంధిత శాఖల అధికారులు, దేవాదాయ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Leave a Reply