భీమ్ న్యూస్ ప్రతినిధి చిత్తూరు (డిసెంబర్ 25) క్రిస్మస్ అనేది క్రైస్తవుల పండుగ. యేసుక్రీస్తు పుట్టినరోజును పురస్కరించుకుని ప్రతి సంవత్సరం డిసెంబర్ 25న క్రిస్మస్ జరుపుకుంటారు. బహుమతులు పంచుకోవడం, ఇళ్లను అందంగా అలంకరించుకోవడం, ఇంటి పైన స్టార్-షేప్డ్ లైట్ ఏర్పాటు చేయడం, ప్రత్యేక విందులు చేసుకోవడం ఇవన్నీ పండుగ వేడుకల్లో భాగం. నేడు క్రిస్మస్ సందర్భంగా ఈ పండుగ చరిత్ర, ప్రాముఖ్యత ఇలా….
క్రిస్మస్ వేడుకలు :
సాధారణంగా క్రిస్మస్ వేడుకలు డిసెంబర్ 24న క్రిస్మస్ ఈవ్‌తో మొదలవుతాయి. ఈరోజు క్రైస్తవులు అర్ధరాత్రి ప్రార్థనలకు చర్చిలకు వెళ్తారు. ఈ ప్రార్థనలు దాదాపు అర్ధరాత్రి మొదలై డిసెంబర్ 25 తెల్లవారుజాము వరకు కొనసాగుతాయి. క్రిస్మస్ రోజున పొద్దున్నే చర్చిలలో యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ప్రార్థనలు జరుగుతాయి. ఈ ప్రార్థనలు చర్చిని బట్టి ఉదయం 6:00 లేదా 7:00 గంటలకు ప్రారంభమవుతాయి.
క్రిస్మస్ చరిత్ర :
క్రైస్తవ విశ్వాసాల ప్రకారం, గాబ్రియేల్ అనే దేవదూత మేరీ అనే ఒక యువతిని చూస్తాడు. ఆమె కన్య అయినా, దేవుని కృపతో ఒక కుమారుడికి జన్మనిస్తుందని ఆయన చెబుతాడు. మేరీకి జోసెఫ్‌తో పెళ్లి కుదురుతుంది. కానీ ఆమె గర్భం దాల్చిందని తెలిసి అతను పెళ్లి క్యాన్సిల్ చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అప్పుడు జోసెఫ్‌కు కలలో దేవదూత కనిపించి, మేరీ దేవుడి వరం వల్ల గర్భవతి అయ్యిందని, ఆమె కుమారుడు దేవుని కుమారుడని, ప్రజలను పాపాల నుంచి రక్షిస్తాడని చెప్పాడు. జోసెఫ్ దైవాజ్ఞతో మేరీని ఆదరించాడు.
రాజాజ్ఞ మేరకు వారు బెత్లేహేమ్‌కు ప్రయాణించాల్సి వచ్చింది. అక్కడ వారికి ఎక్కడా ఉండటానికి చోటు దొరకలేదు. అన్ని సత్రాలు నిండిపోవడంతో, చివరికి వారు పశువుల పాకలో తలదాచుకోవలసి వచ్చింది. అక్కడే మేరీ యేసుకు జన్మనిచ్చింది. ఆ పసికందును పశువుల దాణా తొట్టిలో పడుకోబెట్టారు.
యేసు పుట్టిన వెంటనే, బెత్లేహేమ్లోని పొలాల్లో గొర్రెలు కాస్తున్న కాపరులకు ఒక దేవదూత ప్రత్యక్షమై, లోక రక్షకుడు జన్మించాడని శుభవార్తను తెలియజేశాడు. ఆ ప్రభువు పసికందుగా గుడ్డల్లో చుట్టి, పశువుల తొట్టిలో ఉంటాడని చెప్పాడు. వెంటనే అనేకమంది దేవదూతలు దిగివచ్చి దేవుడిని స్తుతించారు. కాపరులు పాకకు వెళ్లి శిశువును, మేరీ, జోసెఫ్‌లను చూసి, దేవదూత చెప్పిన విషయాలు అందరికీ తెలిపారు.
ఇలా 2000 సంవత్సరాల క్రితం డిసెంబర్ 24 అర్ధరాత్రి దాటాక, అంటే డిసెంబర్ 25న యేసు జన్మించాడు. అందుకే డిసెంబర్ 25న క్రిస్మస్ జరుపుకుంటారు. మరోవైపు తూర్పు దేశాల నుంచి జ్ఞానులు ఒక ప్రకాశవంతమైన నక్షత్రాన్ని అనుసరిస్తూ బెత్లేహేమ్‌కు చేరుకున్నారు. వారు యేసుకు విలువైన కానుకలు సమర్పించి, ఆ నవజాత శిశువును రాజుగా గుర్తించి ఆరాధించారు.
క్రిస్మస్ ప్రాముఖ్యత :
క్రిస్మస్ క్రైస్తవులకు ఎంతో పవిత్రమైన రోజు. యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు ఈ పండుగను ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. యేసుక్రీస్తు బోధనలు, ఆయన చూపిన ప్రేమ, మానవజాతి కోసం ఆయన చేసిన త్యాగాలను స్మరించుకుంటారు. క్రిస్మస్ అనేది విశ్వాసం, సంతోషం, సద్భావనకు చిహ్నం. ఈ పండుగ ప్రజలను ఒక్కటి చేస్తుంది, ప్రేమను, ఆశను పంచుతుంది. కుటుంబ సభ్యులు, స్నేహితులు ఒకచోట చేరి బహుమతులు పంచుకోవడం, పాటలు పాడటం, ప్రత్యేక విందులు చేసుకోవడం క్రిస్మస్లో ముఖ్యమైన భాగాలు.
Leave a Reply