భీమ్ న్యూస్ ప్రతినిధి రాజమండ్రి (డిసెంబర్ 24) ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్టు పద్ధతిన విధులు నిర్వహించిన హెల్త్ అసిస్టెంట్ల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. కోర్టు తీర్పు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 930 మందిని తొలగించడంతో వారి కుటుంబాలు వీధిన పడ్డాయి. తమను విధుల్లోకి తీసుకుని ఆదుకోవాలని హెల్త్ అసిస్టెంట్టు కోరుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైద్య, ఆరోగ్య సిబ్బంది సైతం వారికి మద్దతుగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. కోర్టు ఆదేశాలతో తొలగింపు పదో తరగతి విద్యార్హతతో అప్పటికే శానిటరీ ఇన్స్పెక్టర్లుగా శిక్షణ పొందిన వారిని మేల్ అసిస్టెంట్లుగా నియమించేందుకు 2022 జులైలో అప్పటి టిడిపి ప్రభుత్వం నోటిఫికేషన్‌ను జారీ చేసింది. అదే ఏడాది అగస్టులో రాత పరీక్ష నిర్వహించి 2003లో ఉద్యోగాలను భర్తీ చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఈ పోస్టులపై వివాదం కొనసాగుతోంది. అప్పుడు ప్రకటించిన మెరిట్ జాబితాల ప్రకారం తొలుత హైకోర్టు ఆదేశాల మేరకే ఇంటర్ వారికి పోస్టింగులు ఇచ్చారు, హైకోర్టు ఆదేశాలపై సుప్రీం కోరట్టు స్టే ఇచ్చింది. సుప్రీం కోర్టు తుది ఆదేశాల మేరకు వీరిని 2012లో విధుల నుంచి తప్పించారు. 2013లో మళ్లీ 1207 జిఒ ద్వారా విధుల్లోకి తీసుకున్నారు. దీనిపై న్యాయవివాదం తలెత్తగా 11 ఏళ్ల సుదీర్ఘకాలం అనంతరం ఈ నెల 5న తెలంగాణ హైకోర్టు తుదితీర్పు ఇచ్చింది. దీంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నియమితులైన 1200 మందిని తొలగించారు. వీరిలో 930 మంది ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు కాగా మిగిలిన 270 మంది తెలంగాణాకు చెందిన వారు. ఉద్యోగాలు కోల్పోయిన వారి సగటు వయసు 50 ఏళ్లు ఈ ఉద్యోగాలపైనే ఆధారపడ్డ తమ కుటుంబాల పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తీసుకున్న గందరగోళ నిర్ణయాల వల్ల తాము శిక్ష అనుభవిస్తున్నామని, రెగ్యులర్ చేస్తారని ఆశపడితే ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగం కూడా పోయిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తొలగించడానికి ఇంకా 90 రోజుల గడువు ఉన్నదని సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం కూడా ఇవ్వకుండా ఇలా హఠాత్తుగా ఒక్కరోజులోనే ఉత్తర్వులు ఇచ్చి తొలగించడం అన్యామన్నారు. జిల్లాల వారీగా శ్రీకాకుళం 123, విజయనగరం 56, విశాఖపట్నం 142, తూర్పు గోదావరి 92, పశ్చిమ గోదావరి 111, కష్ణా 94, గుంటూరు 76, ప్రకాశం 75, నెల్లూరు 54, చిత్తూరు 10, కడప 33, అనంతపురం 40 మంది ఉద్యోగాలను కోల్పోయారు.
సానుకూలంగా స్పందించాలి
మెరిట్ ఆధారంగా జాబితా రూపొందించి రాష్ట్రంలో శాంక్షన్ పోస్టులన్నీ భర్తీ చేయాలి. ఈ విధంగా భర్తీ చేస్తే నష్ట తీవ్రత తగ్గే అవకాశాలున్నాయి. అధిక శాతం మంది తిరిగి ఉద్యోగం పొందే అవకాశం ఉంది. 22 ఏళ్ల సర్వీసు ఉంది.ప్రభుత్వం సానుకూలంగా స్పందించి అందరికీ న్యాయ బద్ధంగా వ్యవహరించాలని జివివి.ప్రసాద్, రాష్ట్ర కన్వీనర్, ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్టు పారామెడికల్ ఉద్యోగుల సంఘం కోరింది.
Leave a Reply