భీమ్ న్యూస్ ప్రతినిధి చెన్నై – జాతీయం (డిసెంబర్ 26) నగరం నడిబొడ్డున జరిగిన దారుణ ఘటన.. తమిళనాడును ఉలిక్కి పడేలా చేసింది. ప్రముఖ ప్రభుత్వ విద్యాసంస్థ వర్సిటీ క్యాంపస్‌లోనే ఓ ఇంజినీరింగ్ విద్యార్థినిపై లైంగిక దాడి జరిగింది.ఆమెతో ఉన్న స్నేహితుడిపై దాడి చేసి మరీ.. దగ్గర్లోని పొదల్లో లాక్కెళ్లి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ కీచకపర్వంతో విద్యార్థి లోకం భగ్గుమంది. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ రోడ్డెక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన బాట పట్టింది. మరోవైపు ఈ ఘటనపై అగ్ర నటుడు, టీవీకే అధినేత విజయ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.”చెన్నై అన్నా యూనివర్సిటీ క్యాంపస్‌లో జరిగిన ఘటన దిగ్భ్రాంతికి గురి చేసింది. నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారనే సమాచారం మాకు అందింది. అయితే ఈ కేసులో ఉన్నవాళ్లు ఎంతటివాళ్లైనా వదలిపెట్టకూడదు. బాధితురాలికి తక్షణ న్యాయం జరిగేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా..
రాష్ట్రంలో మహిళల భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలి. అఘాయిత్యాలు జరుగుతున్న ప్రాంతాల్లో భద్రతను పెంచాలి. ఉమెన్ సేఫ్టీ కోసం మొబైల్ యాప్స్, స్మార్ట్ పోల్స్, ఎమర్జెన్సీ బటన్స్, సీసీ కెమెరాలు, టెలిఫోన్లను ఏర్పాటు చేయాలి. పబ్లిక్ ప్లేసుల్లో వాళ్ల కోసం కనీస వసతులు ఏర్పాట్లు చేయాలి. ప్రభుత్వ-ప్రవేట్ విద్యా సంస్థలను కూడా ఇందులో చేర్చాలి. బాధితులకు అవసరమైన న్యాయ సహాయం ప్రభుత్వమే అందించాలి. మానసికంగా ధైర్యంగా ఉంచేందుకు కౌన్సెలింగ్‌లాంటివి ఇప్పించాలి. వీటన్నింటి కోసం ప్రతీ ఏడాది నిర్భయ ఫండ్ నుంచి ఖర్చు చేయాలి. మహిళల భద్రత విషయంలో ప్రభుత్వం వెనకడుగు ఉండకూడదు. నిరంతరం ఈ వ్యవస్థను సమీక్షిస్తూ ఉండాలి” అని విజయ్ తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు.
మరోవైపు.. ప్రభుత్వ విద్యా సంస్థలో జరిగిన ఈ ఘటనపై ప్రతి పక్షాలు ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నాయి . అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామి, బీజేపీ అధ్యక్షుడు అన్నామలై, డీఎండీకే ప్రధాన కార్యదర్శిప్రేమలత విజయకాంత్, పీఎంకే నేతలు రాందాసు, అన్బుమణి రాందాసు వేర్వేరు ప్రకటనలో ఈ ఘటనను ఖండించారు. విద్యా సంస్థలలోనూ విద్యార్దినులకు భద్రత కరువైందన్న ఆందోళనను వ్యక్తంచేశారు. ఈ ఘటన సిగ్గుచేటు అని, నేరగాళ్లకు తప్పా, ఇతరులు ఎవ్వరికి ఈ ప్రభుత్వంలో కనీస భద్రత కరువైందని మండిపడ్డారు.కాగా ఉన్నత విద్యా మంత్రి కోవి చెలియన్ మాట్లాడుతూ, ఈ వ్యవహారాన్ని రాజకీయం చేయడం శోచనీయమన్నారు. నిందితులు కఠినంగా శిక్షించ బడుతారన్నారు. ఓ విద్యార్థినిపై జరిగిన ఈ దాడిని కూడా రాజకీయం చేయడం మంచి పద్ధతి కాదన్నారు.
కాగా ఈ ఘటనకు సంబంధించి ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు జ్ఞానశేఖరన్.. క్యాంపస్ దగ్గర్లోనే ఓ బిర్యానీ సెంటర్ నడిపిస్తున్నాడు. అయితే అతనికి నేర చరిత్ర ఉండడంతో పాటు అధికార డీఎంకే పార్టీ కార్యకర్త కావడం ఈ వ్యవహారాన్ని సోషల్ మీడియాకు ఎక్కించింది. గతంలోనూ డిప్యూటీ సీఎం ఉదయ్‌నిధి స్టాలిన్‌తోపాటు మరికొందరు డీఎంకే పెద్దలతో నిందితుడు దిగిన ఫొటో ఒకటి వైరల్ అవుతోంది. అంతేకాదు.. డీఎంకే యువ విభాగం ప్రెసిడెంట్‌గానూ పని చేశాడనతను.
నిందితుడు జ్ఞానశేఖరన్ అధికార డీఎంకే కార్యకర్త కావడంతో విషయాన్ని పక్కదోవ పట్టించి నిందితుడ్ని తప్పించే ప్రయత్నం జరుగుతోందని విద్యార్థులు అంటున్నారు. ఘటన తర్వాత బాధితురాలి దగ్గరకు ఎవరినీ వెళ్లనివ్వలేదని.. యూనివర్సిటీ అధికారులు కేసును పక్కదోవపట్టించే ప్రయత్నం చేస్తున్నారని కొందరు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు తోడు మరోవైపు.. పెరియాకుప్పం సముద్ర తీరంలో పిక్‌నిక్ వెళ్లిన కొందరు యువతులపై తప్పతాగిన ఆగంతకులు అనుచితంగా ప్రవర్తించారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురిని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. అయితే తమిళనాడులో మహిళలకు భద్రత కరువైందంటూ.. #ShameOnYouStalin హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.
నిందితుడు జ్ఞానశేఖరన్ కాళ్లకు, చేతులకు దెబ్బలు తగిలి.. బ్యాండేజ్‌తో ఉన్న ఫొటో ఒకటి వైరల్ అవుతోంది. దీంతో డీఎంకే ప్రభుత్వం న్యాయం చేసిందని, గతం పొల్లాచ్చి కేసులో నిందితుడు పారిపోయినప్పుడు అన్నాడీఎంకే ప్రభుత్వం ఉందని.. ఆ సమయంలో బీజేపీ కూడా ఎలాంటి ప్రభుత్వ వ్యతిరేక నిరసలు చేయలేదని కొందరు డీఎంకే అనుకూల పోస్టులు పెడుతున్నారు. అయితే విక్షాలు దీన్ని ప్రభుత్వ జిమ్మిక్కుగా కొట్టి పారేస్తున్నాయి.
Leave a Reply