భీమ్ న్యూస్ ప్రతినిధి అమరావతి (డిసెంబర్ 28) రాష్ట్ర వ్యాప్తంగా ప్రమాదాల బారిన పడే వారిని కాపాడే పనిలో నిమగ్నమయ్యే ఈ సేవల్లోని సిబ్బందికి శుభవార్త చెప్పారు. ఎన్నాళ్లుగానో వాళ్లు డిమాండ్ చేస్తున్న జీతాల పెంపుపై కీలక నిర్ణయం తీసుకున్న సీఎం చంద్రబాబు.. వారి కోరికను తీర్చేందుకు ఆమోద ముద్ర వేశారు. దాంతో.. రాష్ట్ర వ్యాప్తంగా 104, 108 సిబ్బంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. చాన్నాళ్లుగా పెండింగ్ లో ఉన్న అనేక అంశాలు సీఎం దృష్టికి రాగా.. వాటి పరిష్కార మార్గాలపై చర్చించిన చంద్రబాబు.. తక్షణమే ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని పేదలు, బడుగు, బలహీన వర్గాల వారికి ప్రమాద సమయాల్లో ఆసరాగా ఉండే ప్రభుత్వ అంబులెన్సుల కొరతను తక్షణమే పరిష్కరించాలని సూచించిన సీఎం చంద్రబాబు.. వెంటనే 109 కొత్త 108 వాహనాలు కొనుగోలు చేసేందుకు నిర్ణయించారు.
చాన్నాళ్లుగా పెంపుదలకు నోచుకోని 108 అంబులెన్స్ సిబ్బంది జీతభత్యాలకు సంబంధించి డిమాండ్లు సీఎం చంద్రబాబు దృష్టికి రాగా తక్షణమే స్పందించారు. ఇకపై ప్రతీ నెల వారికి అందిస్తున్న జీతానికి అదనంగా మరో రూ.4,000 అందించాలని నిర్ణయించారు. ఈ పెంచిన జీతాలను 108 డ్రైవర్లు, సిబ్బందికి అమలు చేయాలని సీఎం ఆదేశించారు. దీంతో.. సంక్రాంతి కానుకగా సిబ్బందికి నూతన జీతాలు అందనున్నాయంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇకపై రాష్ట్రంలోని 108, 104 సేవలకు సింగిల్ సర్వీస్ ప్రొవైడర్ ఉండనున్నారు. అందుబాటులోకి కొత్తగా 58 మహాప్రస్థానం వాహనాలు రానున్నాయి. ఈ వాహనాలతో విస్తృత స్థాయిలో ప్రతీ గ్రామానికి వైద్య సేవల్ని విస్తరించాలని సీఎం ఆదేశించారు. త్వరలో వైద్యారోగ్య శాఖలో చేపట్టనున్న సంస్కరణలు, విధానాలపై వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్, ఇతర ఉన్నతాధికారులతో చర్చించారు.
వైద్య సేవల్ని అందించడంతో పాటు ఔషధాల్ని సైతం తక్కువ ధరల్లో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నించాలన్న చంద్రబాబు.. ప్రతీ మండలంలో జన ఔషధి స్టోర్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ స్టోర్ల ద్వారా.. మార్కెట్లల్లో దొరికే ధరల కంటే చాలా తక్కువ ధరల్లోనే ఖరీదైన మందుల్ని అందుబాటులోకి తీసుకురావచ్చు. అలాగే.. ప్రివెంటివ్ హెల్త్ కేర్‌కు ప్రాధాన్యం ఇచ్చేలా వైద్య శాఖ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సీఎం సూచించారు. వైద్య శాఖలో పెండింగ్‌లో ఉన్న సమస్యలు, తీసుకురానున్న సంస్కరణలపై చర్చించారు. ఆరోగ్య శ్రీ లో గతంలో అమలు చేసిన ప్రైవేట్ బీమా సంస్థల ద్వారానే ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ పరిష్కరించనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఇప్పటి వరకు ఆరోగ్య శ్రీ పథకాన్ని పూర్తిగా ప్రభుత్వమే నిర్వహిస్తుండగా, ఇప్పటి నుంచి ప్రైవేట్ ఇన్సూరెన్స్ సంస్థల భాగస్వామ్యం, వారి నిర్వహణలోనే బాధితులకు సొమ్ములు ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రమాదం జరిగిన దగ్గరకే వచ్చి బాధితుల్ని సత్వరమే ఆసుపత్రులకు తరలించే 104, 108 వైద్య సేవలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు.
Leave a Reply