భీమ్ న్యూస్ ప్రతినిధి విశాఖపట్నం (డిసెంబర్ 28) విశాఖపట్నంలోని కేంద్ర కారాగారం ముందు శనివారం కొందరు కానిస్టేబుల్ కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు. జైలులో డ్యూటీ చేస్తున్న తమ భర్తలకు సెంట్రల్ జైలు ఉన్నతాధికారులు నుంచి వేధింపులు ఎదురవుతున్నాయంటూ, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నినాదుల చేశారు. జైలులో విధులు నిర్వహిస్తున్న సిబ్బందితో వెట్టి చాకిరీ చేయిస్తున్నారంటూ, జైలు లోపల కనీస గౌరవ మర్యాదలు లేకుండా ప్రవర్తిస్తున్నారంటూ ఆరోపిస్తూ కానిస్టేబుళ్ల భార్యలు జైలు ముందే ఆందోళనకు దిగిన ఘటన ఆంధ్రప్రదేశ్ లో చర్చనీయాంశమైంది. సాధారణంగా అయితే జైలులో విధులు నిర్వహించే కానిస్టేబుల్స్ కు అధికారికంగా 8 గంటలు మాత్రమే డ్యూటీ. కానీ.. ఏకంగా 12 గంటలకు పైగా అనధికారికంగా డ్యూటీ చేయిస్తున్నారని, వారిని మానసికంగా అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ కానిస్టేబుల్ భార్యలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు అధికార దర్పాన్ని ప్రదర్శిస్తున్నారని, కింద స్థాయి ఉద్యోగులపై అనేక తీరులుగా వేధింపులకు పాల్పడుతున్నారని జైలు ముందు బైఠాయించి, నినాదాలు చేశారు. దీంతో జైలు పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
రోజూ ఉదయం కేంద్ర కారాగారంలో డ్యూటీ కి వెళితే తిరిగి రాత్రికి ఎప్పటికో ఇంటికి చేరుకుంటున్నారని అంటున్నారు. కనీసం భోజనానికి కూడా ఇంటికి రాలేని పరిస్థితులు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతే కాదు.. ఇంట్లో ఎవరైనా చిన్న పిల్లలు, పెద్దవారైన తల్లిదండ్రులకు అత్యవసర వైద్య సహాయం అవసరమైన సందర్భాల్లోనూ జైలు నుంచి బయటికి రాలేని పరిస్థితులు నెలకొన్నాయని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. సాధారణ సమయాల్లో కాకపోయినా అత్యవసర సమయాల్లోనైనా తమ భర్తలను ఇంటికి పంపించాలని ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా తమ గోడును పట్టించుకోవడం లేదని అంటున్నారు. సెంట్రల్ జైల్లో డ్యూటీకి వెళ్తున్న పోలీసు సిబ్బందిపై ఉన్నతాధికారులు క్రూరంగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపించారు. జైల్లో ఖైదీల ముందే కానిస్టేబుళ్ల బట్టలు విప్పించి తనిఖీలు చేస్తున్నారని ఆందోళన చేస్తున్న కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలా చేస్తే కానిస్టేబుళ్లపై ఖైదీలకు ఎలా గౌరవం ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. ఖైదీల ముందే నగ్నంగా నిలుచోబెట్టడం ఏంటని ఆగ్రహిస్తున్నారు.
12 గంటలకు పైగా అనధికారిక డ్యూటీలతో వేధిస్తూ.. కనీసం తినేందుకు సైతం సమయం ఇవ్వటం లేదని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జైలు ఉన్నతాధికారులు మాత్రం బయట రెస్టారెంట్ల నుంచి ఆన్లైన్లో ఆర్డర్ చేసుకొని ఫుడ్ తెప్పించుకుంటున్నారని, తమ భర్తలకు మాత్రం ఇంటి భోజనాన్ని తినకుండా చేస్తున్నారంటూ ఆగ్రహిస్తున్నారు. జైలు సిబ్బంది కుటుంబ సభ్యుల ఆందోళన, ధర్నాలతో సెంటర్ జైల్ లో నెలకొన్న పరిస్థితులపై జోరుగా చర్చ జరుగుతోంది. ఈ విషయంపై ఉన్నతాధికారుల దృష్టిపెట్టి సమస్యను పరిష్కరించాలని, కానిస్టేబుళ్ల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు.
Leave a Reply