భీమ్ న్యూస్ ప్రతినిధి నెల్లూరు నగరం (డిసెంబర్ 29) నెల్లూరు జిల్లా నెల్లూరు నగరంలోని ఆదిశంకర ధ్యాన మందిరంలో శ్రీ చక్రాల వారి ట్రస్ట్ భవనంలో ఆదివారం బ్రాహ్మణ విరాట్ పరివార్ ఆధ్వర్యంలో ధర్మాచార్య దర్శన యాత్ర ఉద్ఘాటన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నెల్లూరు జిల్లా ప్రధాన సమన్వయకర్త బ్రహ్మశ్రీ మల్లవరపు లక్ష్మీనరసింహారావు మాట్లాడుతూ 80 లక్షల మంది బ్రాహ్మణలను ఏకతాటిపైకి తీసుకొచ్చి, వారి సంపూర్ణ సమన్వయంతో సనాతన హిందూ ఏకత సాధించడం ద్వారా భారతదేశాన్ని విశ్వ గురు స్థానంలో నిలిపే ప్రధాన లక్ష్యంతో ధర్మాచార్య దర్శన యాత్ర ప్రారంభిస్తున్నామని తెలిపారు. విశ్వహితాయ బ్రాహ్మణ్యం అనేది బ్రాహ్మణ ధర్మమని, దీని ఆధారంగా భారతదేశంలో, హిందూ సమాజంలోని అన్ని వర్గాలు, వర్ణాలలో చైతన్యం తీసుకొచ్చి హైందవ ఏకత్వం కోసం భారతదేశాన్ని విశ్వ గురు స్థానంలో నిలుపడం, సనాతన ధర్మ పరిరక్షణకు నడుము కట్టి ముందుకు వచ్చేలాగా బ్రాహ్మణులు కలిసి రావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమానికి ప్రధాన అతిథిగా విచ్చేసిన ప్రముఖ వైద్యులు డాక్టర్ సి.వి. సుబ్రమణ్యం మాట్లాడుతూ బ్రాహ్మణ యువత ప్రభుత్వం అందించేటువంటి వివిధ ఆర్థిక పథకాల ద్వారా ఆర్థిక స్వావలంబన సాధించాలని, తద్వారా దేశ ఆర్థిక ప్రగతికి దోహదపడాలని కోరారు. జనవరి 5వ తేదీన విజయవాడలో జరిగే హైందవ శంఖారావం నకు లక్షలాదిగా బ్రాహ్మణ కుటుంబాలు హాజరుకావాలని కోరారు. డాక్టర్ శివ కార్తీక్ మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో బ్రాహ్మణులు చేసిన త్యాగాలు గుర్తు చేశారు. చాలా సందర్భాలలో బ్రాహ్మణులు ఈ ధర్మం కోసం పాటుపడ్డారని తెలియజేశారు. పాలకులు చరిత్రను వక్రీకరించారని అందరూ సరైన చరిత్రను తెలుసుకోవాలని కోరారు.
ముఖ్య అతిథి ఇందుకూరుపేట శ్రీ లలితా భరద్వాజ దత్త పీఠాధిపతులు డాక్టర్ శ్రీశ్రీశ్రీ రామాయణం మహేష్ స్వామి మాట్లాడుతూ ధర్మాచార్య దర్శన యాత్ర యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ధర్మాన్ని కాపాడడమంటే దాన్ని ఆచరించడమే అని తెలిపారు. మరో ముఖ్య అతిథి శ్రీశ్రీశ్రీ స్వామి సమయానందనాథ మాట్లాడుతూ బ్రాహ్మణులకు అనుష్ఠానం ఎంతో ముఖ్యమైనదని, ఈ అనుష్ఠానంతో సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు మంచి జరిగేలా ఆశీర్వదించాలని తమ సందేశాన్ని తెలిపారు. చివరగా ధర్మాచార్య దర్శన యాత్ర పోస్టర్లను విడుదల చేశారు. కార్యక్రమానికి నెల్లూరు జిల్లాలోని బ్రాహ్మణ కుటుంబాలు, మహిళలు, ప్రముఖులు విశేషంగా విచ్చేశారు. శ్రీ చక్రాల వారి ట్రస్ట్ భక్త మిత్ర మండలి ఆధ్వర్యంలో భోజన ప్రసాదాలను వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ విరాట్ పరివార్ సమన్వయకర్తలు డాక్టర్ సూరిబాబు చక్రధర్, సురభి ఉమాదేవి, పెనమనమెండ్లూరు జయలక్ష్మి, భాజపా కేశవ, బ్రాహ్మణ సేవా సంఘాల సమితి ముఖ్య కార్యదర్శి ఇసుకపల్లి కామేశ్వర ప్రసాద్, ఆదిశంకర ధ్యాన మందిరం అధ్యక్షులు పారాగురు వెంకట శ్రీధరశర్మ, చక్రాల వారి ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆనంద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Leave a Reply