భీమ్ న్యూస్ ప్రతినిధి హైదరాబాద్ (జనవరి 06) చత్తీస్ఘడ్ లోని బీజపూర్ జిల్లాకు చెందిన జర్నలిస్ట్ ముకేష్ చంద్రశేఖర్ హత్య రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపింది. ముకేష్ ను నిందితుడు అత్యంత దారుణంగా హతమార్చారని అతని శవపరీక్ష నివేదిక వెల్లడించింది. ఈ నేపథ్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఇవాళ ఈ కేసులో ప్రధాన నిందితుడిగా గుర్తించిన సురేశ్ చంద్రశేఖర్ ను హైదరాబాద్ లో అదుపులోకి తీసుకుంది. మరోవైపు అటాప్సీ నివేదికలో వెలుగుచూసిన అంశాలు చూస్తే ఈ హత్య ఎంత పాశవికంగా జరిగిందో అర్థమవుతోంది.
జనవరి 3న జరిగిన ముకేష్ చంద్రశేఖర్ హత్య తర్వాత ఏర్పాటు చేసిన సిట్ బృందం ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడైన సురేశ్ చంద్రశేఖర్ కు సోదరులైన రితేష్ చంద్రశేఖర్, దినేష్ చంద్రశేఖర్, వారి డ్రైవర్ మహేంద్ర రాంటెకేను అరెస్టు చేసింది. నిన్న రాత్రి హైదరాబాద్ లో ప్రధాన నిందితుడు సురేశ్ చంద్రశేఖర్ ను కూడా అరెస్టు చేశారు. నిన్న రాత్రి అరెస్టు చేసి హైదరాబాద్ నుంచి ఛత్తీస్ ఘడ్ కు అతన్ని తరలించారు.
స్వతంత్ర జర్నలిస్టు అయిన ముకేష్ చంద్రశేఖర్ జనవరి 1న అదృశ్యమయ్యాడు. జనవరి 3న అతని శవం బీజపూర్ నగరంలోని ఛత్తన్ పారా బస్తీలో ఉన్న సురేశ్ చంద్రశేఖర్ కు చెందిన స్ధలంలోని సెప్టిక్ ట్యాంకులో దొరికింది. ఛత్తీస్ ఘడ్ లో ఓ రోడ్డు నిర్మాణ పనికి సంబంధించిన వార్తల ప్రచురణే ఈ హత్యకు కారణమై ఉండొచ్చని తెలుస్తోంది. అయితే పోలీసులు మాత్రం నిందితులను కస్టడీలో విచారించిన తర్వాతే అసలు విషయాలు బయట పెట్టబోతున్నారు. కీలక నిందితుడు సురేశ్ చంద్రశేఖర్ అరెస్టు నేపథ్యంలో అతన్ని ఇవాళ కోర్టులో హాజరుపర్చనున్నారు. మరోవైపు ముకేష్ చంద్రశేఖర్ పోస్ట్మార్టం పరీక్షలో ఈ హత్య ఎంత దారుణంగా జరిగిందో వైద్యులు గుర్తించారు. మృతుడి తలపై 15 పగుళ్లు ఉన్నట్లు తేల్చారు. అలాగే అతని మెడ విరిగిపోయిందని, అతని గుండె బయటకు వచ్చినట్లు కూడా గుర్తించారు. ప్రధాన నిందితుడైన సురేశ్ చంద్రశేఖర్ ఓ రోడ్డు కాంట్రాక్టర్. అతనితో ఉన్న విభేదాలతోనే ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది.
Leave a Reply