భీమ్ న్యూస్ ప్రతినిధి అమరావతి (జనవరి 07) ఏపీ పాఠశాలల్లో ఉపాధ్యాయుల పనితీరుకు ప్రభుత్వం నుంచి మరో భారీ ప్రోత్సాహం దక్కనుంది. విద్యార్థులతో మమేకమై వారికి దిశానిర్దేశం చేస్తూ ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేసే గురువులకు పాయింట్లు ఇవ్వనుంది. తద్వారా కష్టపడే వారికి బదిలీల్లో ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.
- టీచర్ల బదిలీల సన్నాహాల్లో…..
- సబ్జెక్టుల వారీగా వేర్వేరు ప్రామాణికాలు
- పీఈటీలకు స్పోర్ట్స్, సైన్స్ టీచర్లకు ఫెయిర్లు
- గణిత ఉపాధ్యాయులకు ఒలింపియాడ్
- భాషా టీచర్లకూ వేర్వేరు ప్రాతిపదికలు
- పనితీరులో పోటీపడేలా సరికొత్త ఆలోచన
- ‘బదిలీ చట్టం’పై పాఠశాల విద్యాశాఖ కసరత్తు
విద్యార్థులను జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనేలా తీర్చిదిద్దే టీచర్లు కొందరు. విద్యార్థులను వినూత్నంగా ఆలోచింపజేసి ఆవిష్కరణలు చేయించే ఉపాధ్యాయులు మరికొందరు. అద్భుతమైన బోధనా పద్ధతులతో విద్యార్థులను ఉత్తమంగా తీర్చిదిద్దే టీచర్లు ఇంకొందరు. వీరంతా ఇప్పటి వరకు ‘ప్రత్యేక గుర్తింపు’నకు నోచుకోవడం లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కష్టపడే టీచర్లకు పెద్దపీట వేయాలని, ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించింది. టీచర్లు అందరినీ ఒకేగాటన కట్టకుండా మెరుగైన పనితీరు కనబరిచిన వారికి ప్రోత్సాహకంగా బదిలీల్లో ప్రాధాన్యత ఇవ్వాలని యోచిస్తోంది. కొత్తగా తీసుకురాబోయే ఉపాధ్యాయ బదిలీల చట్టంలో ‘పనితీరుకు పాయింట్లు’ ఇచ్చే దిశగా పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. అయితే దీన్ని కచ్చితంగా అమలు చేస్తారా అనేదానిపై స్పష్టత రాలేదు. కానీ, బాగా పనిచేసేలా టీచర్లకు ఎంతో కొంత ప్రోత్సాహం లేకపోతే పనితీరులో పోటీ లేకుండా పోతుందని, ఎలా పనిచేసినా ఒక్కటే అనే భావన పెరుగుతుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. గతంలోనూ టీచర్ల పనితీరు మందిపునకు పదో తరగతి మార్కులను ప్రామాణికంగా తీసుకోగా, అది సరైన విధానం కాదని భావించి ప్రతి సబ్జెక్టులో వేర్వేరు అంశాలను పెట్టాలని చూస్తున్నారు.
పనితీరు ఇలా:
వ్యాయామ ఉపాధ్యాయులకు క్రీడాంశాలను ప్రామాణికంగా తీసుకుంటారు. క్రీడా పోటీల్లో రాష్ట్ర, జిల్లా స్థాయిలో వారి విద్యార్థులు పాల్గొన్నారా? అవార్డులు సాధించారా? అనే ప్రాతిపదికన బదిలీల్లో పాయింట్లు ఇస్తారు. జాతీయ స్థాయిలో పాల్గొనే స్థాయికి తీసుకెళ్తే రెండు పాయింట్లు, అవార్డు సాధిస్తే మూడు పాయింట్లు ఇస్తారు. అలాగే స్కౌట్స్ అండ్ గైడ్స్‌ను కూడా ప్రామాణికంగా తీసుకుంటారు.
సైన్స్ టీచర్లకు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి సైన్స్ ఫెయిర్‌లను ప్రామాణికంగా తీసుకుంటారు. ఆ ఫెయిర్లలో వారి విద్యార్థుల ఎన్ని ప్రాజెక్టులు ప్రదర్శించారు? వాటికి ఎలాంటి ప్రశంస లభించింది? అనేది ఆధారంగా పాయింట్లు ఇస్తారు.
సోషల్ టీచర్లకు క్విజ్‌లు, జనరల్ నాలెడ్జ్ పోటీలను ప్రామాణికంగా చూస్తారు.
హిందీ టీచర్లకు.. విద్యార్థులు మాధ్యమిక లాంటి పరీక్షలు రాశారా? వారి ప్రతిభ ఏ స్థాయిలో ఉందనేది పరిగణనలోకి తీసుకుంటారు.
గణిత ఉపాధ్యాయులకు విద్యార్థులు ఒలంపియాడ్ లాంటి పోటీల్లో పాల్గొనే స్థాయికి తీసుకువెళ్లారా? బహుమతులు పొందారా? అనేది లెక్క చూస్తారు.
ఇంగ్లిష్ టీచర్లకు ‘స్పెల్ బీ’ పోటీలు, ఇతరత్రా ఆంగ్ల సంబంధిత పోటీల ఆధారంగా పాయింట్లు ఇస్తారు. తెలుగు టీచర్లకు కూడా కొన్ని అంశాలను పెట్టాలనే యోచనలో ఉన్నారు. ఇలా ప్రతి సబ్జెక్టు టీచర్‌కు కొన్ని అంశాలు ప్రామాణికంగా తీసుకుని, మెరుగ్గా ఉన్నవారికి కొంత ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నారు. దానివల్ల మిగిలిన టీచర్లు కూడా వారి విద్యార్థులు మెరుగ్గా ఉంటే, బదిలీల్లో తమకు ప్రాధాన్యత పెరుగుతుందని భావించి వృత్తిలో పోటీ పడతారనే ఆలోచన చేస్తున్నారు.
బదిలీలకు ఈ విద్యాసంవత్సరమే :
బదిలీలకు చేయబోయే చట్టంలో పాఠశాల విద్యాశాఖ మరో కీలక మార్పు చేసింది. టీచర్లు డిమాండ్ చేస్తున్నట్లుగా బదిలీలకు సాధారణ సంవత్సరం స్థానంలో విద్యా సంవత్సరాన్నే ప్రామాణికంగా తీసుకుంటుంది. దాని ప్రకారం 2 నుంచి 5 విద్యా సంవత్సరాలు పూర్తిచేసుకున్న ప్రధానోపాధ్యాయులు, 2 నుంచి 8 విద్యా సంవత్సరాలు పూర్తిచేసుకున్న టీచర్లు బదిలీలకు అర్హులు. 5 ఏళ్లు దాటిన హెచ్‌ఎంలు, 8ఏళ్లు దాటిన టీచర్లు తప్పనిసరి బదిలీల పరిధిలోకి వస్తారు. అయితే జీరో సర్వీసు టీచర్లకు కూడా బదిలీ అవకాశం కల్పించాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కానీ, పాఠశాల విద్యాశాఖ దానికి అవకాశం ఇవ్వకూడదని నిర్ణయించింది.
Leave a Reply