భీమ్ న్యూస్ ప్రతినిధి ఇందుకూరుపేట (జనవరి 09) నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం జంగంవాని దొరువు గ్రామ ప్రజలు అక్కడ వున్న నీరు త్రాగి, సీజనల్ వ్యాధుల బారినపడి ఆరోగ్య ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో గ్రామంలో తిరుపతి ఎం.పి. నిధులతో మినరల్ వాటర్ ప్లాంట్ నిర్మాణం చేసుకున్నారు. ఆ వాటర్ ప్లాంట్ లో ఓ దివ్యాంగుడికి ఉపాధి కూడా కల్పించారు. అంతా బాగానే వుంది అనుకునే లోగా ఆ గ్రామంలో పార్టీ కక్షలు ఊపిరి పోసుకుని వర్గ పోరు మొదలైంది.. ముప్పై సంవత్సరాలు సర్పంచ్ గా అధికారం అనుభవించిన మాజీ సర్పంచ్ ఈ సారి తన అధికారం కాల్పోవడంతో తట్టుకోలేక ఆ అధికారం కోసం వాటర్ ప్లాంట్ ను అడ్డం పెట్టుకుని వర్గ పోరును లేవనెత్తాడు అనే ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఒకే సామాజిక వర్గానికి చెందిన ఆ గ్రామంలో ప్రస్తుత సర్పంచ్ పాలకవర్గం ఆ వాటర్ ప్లాంట్ ను అజమాయిషీ చేస్తుండటం మాజీ సర్పంచ్ వర్గానికి నచ్చలేదు. వాటర్ ప్లాంట్ ను మేం చూసుకుంటాం అని, మేమే చూసుకుంటామని ఒకరికొకరు భేషజాలు పెంచుకుని పంతాలకు పోయి మీ పార్టీ పెట్టిన వాటర్ ప్లాంట్ లో నీళ్ళు మేం త్రాగం అని మాజీ సర్పంచ్ వర్గం ప్రక్కనే వున్న పోట్లపూడి గ్రామానికి వెళ్లి మినరల్ వాటర్ తెచ్చుకుని త్రాగుతుండటం విశేషం. 2026లో రాబోయే పంచాయతీ ఎన్నికల్లో మళ్లీ సర్పంచ్ పదవి గెలుచుకుని అధికారికంగా వాటర్ ప్లాంట్ ను సొంతం చేసుకుంటామని మాజీ సర్పంచ్ వర్గం ప్రకటన చేసినట్లు గ్రామ ప్రజలు తెలుపుతున్నారు. ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే మరి.!
Leave a Reply