భీమ్ న్యూస్ ప్రతినిధి తిరుపతి (జనవరి 09) వైకుంఠ ఏకాదశి రోజున చాలామంది తిరుమల వెళ్లి స్వామివారిని ఉత్తర ద్వారం నుంచి దర్శించుకోవాలని భక్తులు పరితపిస్తుంటారు. జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు సుమారు 10 రోజుల పాటు తిరుమలలో వైకుంఠ ఏకాదశి వేడుకలను నిర్వహించనున్నారు.ఈ క్రమంలోనే భక్తులు శ్రీవారి దర్శించుకునేందుకు వీలుగా తిరుపతిలో సర్వదర్శనం టోకెన్లు జారీ జనవరి 9న ఉదయం 5 గంటల నుంచి జారీ చేయాలని నిర్ణయించిన టీడీడీ అందుకు అనుగుణంగా 8 కేంద్రాల్లో టోకెన్లు అందించే ఏర్పాట్లు చేసింది.
ఈ క్రమంలో బుధవారం ఉదయం తిరుపతిలోని బైరాగి పట్టెడలోని రామానాయుడు స్కూల్ దగ్గర ఒక్కసారిగా తొక్కిసలాట సాగింది. ఈ ఘటనలో ఆరుగురు భక్తులు మృతి చెందారు. ఈ తొక్కిసలాటలో 48 మంది భక్తులు గాయాలపాలయ్యారు. 12 మంది స్విమ్స్ లో వైద్య సేవలు పొందుతున్నారు. మరో 36 మందికి రుయా హాస్పిటల్ లో ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అయితే ప్రాథమిక విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ప్రాథమిక నివేదికలో సంచలన విషయాలు :
తిరుపతిలో జరిగిన విషాదంపైన ఏపీ సీఎం చంద్రబాబుకు టీటీడీ, జిల్లా అధికారులు ప్రాధమిక నివేదిక సమర్పించారు. ఇందులో ఘటన వెనుక చోటు చేసుకున్న పరిణామాలను వివరించారు. ఆ నివేదిక ప్రకారం..బైరాగి పెట్టెడలోని రామానాయుడు స్కూల్, శ్రీనివాసం, విష్ణు నివాసం, జీవకొనలో ఏర్పాటు చేసిన వైకుంఠ దర్శనం టోకెన్ల జారీ సెంటర్ల వద్ద సమయం పెరుగుతున్న కొద్దీ రద్దీ పెరుగుతూ వచ్చింది. బైరాగి పెట్టెడలోని రామానాయుడు స్కూల్ కు ఆనుకొని పద్మావతి ఉద్యానవనం ఉండటంతో వస్తున్న భక్తులను ఆ పార్కులోకి తరలించారు. పార్కు మొత్తం పూర్తిగా నిండిపోయింది.
రాత్రి 7.45 గంటల సమయంలో పార్కులో ఉన్న ఒక వ్యక్తి అస్వస్థతకు గురయ్యారు. దీంతో అతడికి ట్రీట్మెంట్ అందించడాని డీఎస్పీ స్థాయి అధికారి గేట్లు తెరవబోయారు. భక్తులు మాత్రం క్యూలైన్లలోకి వదిలేందుకే గేట్లు తెరుస్తున్నారని భావించిన ఒక్కసారిగా దాన్ని బలంగా తోసుకుని ముందుకెళ్లే ప్రయత్నం చేశారు. ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో భక్తులు తోసుకు రావడంతో చాలామంది కిందపడిపోయారు. ఊపిరాడక పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పోలీసులు క్షతగాత్రులను అంబులెన్సుల్లో రుయా, స్విమ్స్ హాస్పిటల్స్ కి తరలించారు.
కలెక్టర్ మాటల్లో…
ఈ తొక్కిసలాట ఘటన పట్ల తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మాట్లాడారు. కౌంటర్ దగ్గర గేట్ తెరిచే విషయంలో మిస్ కమ్యూనికేషన్ ఏర్పడిందని కలెక్టర్ చెప్పారు. రాత్రి 9:15-9:30 గంటలకు పరిస్థితి పూర్తి అదుపులోకి వచ్చిందని,అర్ధరాత్రి 12:30 నుంచి ఒంటిగంట వరకు టికెట్ల జారీ కొనసాగిందని అన్నారు.
డీఎస్పీ అత్యుత్సాహం :
డీఎస్పీ అత్యుత్సాహం కారణంగా ఒక్కసారిగా భక్తులు వచ్చి తొక్కిసలాట జరిగిందని ఈ ఘటనపై సీఎంకు తిరుపతి జిల్లా కలెక్టర్ సమర్పించిన రిపోర్ట్ లో తెలిపారని సమాచారం. తొక్కిసలాట జరిగినా కూడా డీఎస్పీ సరిగా స్పందించలేదని..వెంటనే ఎస్పీ సిబ్బందితో ఘటనా స్థలానికి వచ్చి భక్తులకు సాయం చేశారని రిపోర్టులో తెలిపినట్లు తెలుస్తోంది. అంబులెన్స్ వాహనాన్ని టోకెన్ కౌంటర్ బయట పార్క్ చేసి డ్రైవర్ వెళ్లిపోయాడని, 20 నిమిషాల పాటు అతడు అందుబాటులోకి రాలేదని సమాచారం.
బాధ్యత వారిదే :
ఈ ఘటనపై టీటీడీ ఈవో స్పందించారు. డీఎస్పీ గేట్లు తెరవడం వల్లే తొక్కిసలాట జరిగినట్లు ప్రాథమికంగా తెలిసిందని టీటీడీ ఈవో చెప్పారు. విచారణ తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు.అయితే ఇది అధికారుల వైఫల్యంగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు.
నష్టపరిహారం :
తిరుపతి తొక్కిసలాటలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు ఏపీ రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రకటించారు.రుయా హాస్పిటల్ లో మృతుల కుటుంబసభ్యులను మంత్రులు అనగాని సత్యప్రసాద్, అనిత సహా పలువురు నేతలు పరామర్శించారు.
కుట్ర కోణం పై దృష్టి:
ఈ తొక్కిసలాట వెనుక కుట్ర కోణం ఉందని సోషల్ మీడియాలో నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తుండగా ఏపీ హోం మంత్రి అనిత దీనిపై స్పందించారు. తొక్కిసలాట వెనుక కుట్రకోణం ఉందా అనే దానిపై కూడా దర్యాప్తు జరుగుతున్నట్లు చెప్పారు. బాధ్యలు ఎంత పెద్దవారైనా సరేూ కఠన చర్యలు ఉంటాయని హోంమంత్రి చెప్పారు.
Leave a Reply