భీమ్ న్యూస్ ప్రతినిధి తిరుమల (జనవరి 13) తిరుమలలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. లడ్డు కౌంటర్లోని ఒక దానిలో ఒక్కసారిగా మంటలు వచ్చాయి. కౌంటర్ నెంబర్ 47లో లడ్డూలను ఇస్తున్నారు. సోమవారం లడ్డూ ప్రసాద కౌంటర్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. 47వ నెంబర్ లడ్డూ కౌంటర్ వద్ద చోటు చేసుకున్న ఈ ఘటనతో భక్తులు భయంతో వణికిపోయారు. చెల్లా చెదురుగా భక్తులంగా పరుగు లంకించుకున్నారు. లడ్డూ టోకెన్లు జారీ చేసి కంప్యూటర్‌కు సంబంధించిన యూపీఎస్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. హమ్మయ్య అనుకునేలోపే ఇదే రోజు తిరుమలలో మరో పెను ప్రమాదం తప్పింది. పదుల సంఖ్యలో భక్తుల ప్రాణాలు తృటితో తప్పింది.
అసలేం జరిగిందంటే :
భక్తులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఒకటి అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న ఓ పిట్టగోడను ఢీ కొట్టింది. హరిణి దాటిన తర్వాత రెండో ఘాట్ రోడ్డు వద్ద గోడను ఢీకొట్టింది. అయితే క్రాష్ బారియర్ పటిష్టంగా ఉండటంతో బస్సు లోయలోకి పడిపోకుండా రోడ్డుపైనే నిలిచిపోయింది. లేదంటే ఆర్టీసీ బస్సు పక్కనే ఉన్న లోయలోకి జారిపడి ఊహించని ప్రమాదం జరిగుండేది. తలచుకుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది. అదృష్టవశాత్తూ పెను ప్రమాదం తప్పింది. దీంతో శ్రీవారి భక్తులంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదం కారణంగా ఆర్టీసీ బస్సు రోడ్డు మధ్యలోనే అడ్డంగా నిలిచిపోయింది. దీంతో రాకపోకలకు అంతరాయం కలగడంతో కిలోమీటర్ మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. విషయం తెలుసుకున్న సిబ్బంది క్రేన్ సహాయంతో బస్సును పక్కకు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో బస్సులోని పలువురు భక్తులు స్వల్పంగా గాయపడ్డారు.
సోమవారం ఒక్క రోజే గంటల వ్యవధిలో పరమ పవిత్రమైన తిరుమలలో రెండు ప్రమాదాలు జరిగాయి. గతంలోనూ మెట్ల మార్గంలో కౄర జంతువులు దాడి చేయడంతో పలువురు గాయపడ్డారు. చిరుత దడిలో ఓ చిన్నారి మృతి చెందింది కూడా. ఇలా వరుసగా ప్రమాదాలు జరగడం భక్తులకు మింగుడు పడటం లేదు.
తిరుమల ఘాట్‌రోడ్‌లో దట్టమైన పొగమంచు.. వాహనదారులకు టీటీడీ విజ్ఞప్తి :
తిరుమల ఘాట్‌రోడ్‌లో దట్టమైన పొగమంచు ఆవరించింది. ఈ క్రమంలో వాహన దారులు జాగ్రత్తగా ప్రయాణించాలని టీటీడీ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. తిరుమలకు వెళ్లే రెండవ ఘాట్ లో దట్టమైన పొగమంచు కారణంగా ఎదురుగా ఉన్న వాహనాలు సరిగ్గా కనపడక ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కనుక వాహనదారులు దయచేసి ఘాట్ రోడ్డు లో ప్రయాణించే సమయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కాగా శ్రీవారి లడ్డూ విక్రయ కేంద్రంలో సోమవారం 47వ కౌంటర్ లో యూపిఎస్ వైర్ కాలడంతో వ్యాపించిన పొగను.. వెంటనే అప్రమత్తమై సిబ్బంది అదుపు చేశారు.
Leave a Reply