భీమ్ న్యూస్ ప్రతినిధి మచిలీపట్నం (జనవరి 17) ఏపీ రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం వచ్చే విద్యా సంవత్సరం నుంచి పాఠశాలల్లో చేయాల్సిన మార్పులపై విద్యాశాఖ అధికారులు కసరత్తు ప్రారంభించారు. అయితే, జిల్లాలో ఈ అంశం ఎంతమేర ముందడుగు పడుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. గతంలో పాఠశాలల విలీనం సమయంలో డీఈవో కార్యాలయంలో స్టాటికల్ విభాగంలో పనిచేసిన సిబ్బందిని ఇటీవల ఇతర ప్రాంతాలకు బదిలీ చేశారు. కీలకమైన ఈ విభాగంలో పనిచేసేందుకు వేరెవరూ ముందుకు రావడంలేదు. దీంతో గతంలో జరిగిన పాఠశాలల విలీనం, ప్రస్తుతం చేయాల్సిన మార్పులపై కొత్తగా వచ్చేవారికి త్వరగా అర్థమయ్యే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ఎన్ని రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేస్తారనే అంశంపై సందిగ్ధం నెలకొంది.
274 ప్రాథమికోన్నత పాఠశాల పరిస్థితి ఏమిటి ?
జిల్లాలో 274 ప్రాథమికోన్నత పాఠశాలలున్నాయి. వాటిలో 60 మంది లేదా అంతకుమించి 6, 7, 8 తరగతుల్లో పిల్లలు ఉంటే, వాటిని ఉన్నత పాఠశాలలుగా మార్చేందుకు ప్రతిపాదన చేస్తారు. అంతమంది పిల్లలు లేకుంటే మూడు కిలోమీటర్ల దూరంలోని ఉన్నత పాఠశాలలో ఈ ప్రాథమికోన్నత పాఠశాలలను విలీనం చేయనున్నారు. ప్రధాన కాల్వలు, రైల్వేట్రాక్‌లు, జాతీయ రహదారులు, ఎస్సీ, ఎస్టీ కాలనీల్లోని పాఠశాలలకు మినహాయింపు ఇస్తారు. పిల్లల సంఖ్య తక్కువగా ఉన్న కారణంగా జిల్లాలో ఎన్ని ప్రాథమికోన్నత పాఠశాలలు రద్దవుతాయనేది విద్యాశాఖ అధికారులు నిర్ణయించాల్సి ఉంది.
మార్పులు, ఇబ్బందులు :
జిల్లాలో 1,109 ప్రాథమిక పాఠశాలలున్నాయి. వీటిలో ప్రభుత్వ ఆదేశాలతో మార్పులు చేయనున్నారు. శాటిలైట్ ఫౌండేషన్ స్కూల్ పేరుతో నాలుగేళ్లలోపు వయసున్న పిల్లల కోసం ఐసీడీఎస్ ద్వారా (పీపీ 1, పీపీ 2) పాఠశాలలను నడుపుతారు. వీటిని కొనసాగిస్తూనే ఫౌండేషనల్ స్కూల్ పేరుతో నాలుగేళ్ల పిల్లలతో పాటు 1, 2 తరగతులతో కలిపి కొన్ని పాఠశాలలను నడుపుతారు. ఈ పాఠశాలల్లో 1, 2 తరగతుల్లో విద్యాబోధన కోసం ఎస్‌జీటీలను నియమిస్తారా, అంగన్వాడీ టీచర్లతో పాఠాలు బోధిస్తారా అనే అంశంపై స్పష్ట్టత రావాల్సి ఉందని ఉపాధ్యాయ సంఘాల నాయకులు అంటున్నారు. బేసిక్ ప్రైమరీ పాఠశాలల్లో నాలుగేళ్ల పిల్లలతో పాటు 1 నుంచి 5వ తరగతి వరకు కొన్ని పాఠశాలలను ఏర్పాటు చేస్తారు. గతంలో 3 నుంచి 8వ తరగతి వరకు ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలలను మార్పుచేసి మోడల్ ప్రైమరీ స్కూల్స్‌గా మార్చనున్నారు. స్థానిక పరిస్థితులను బట్టి నాలుగేళ్లలోపు పిల్లలతో పాటు 1 నుంచి 5వ తరగతి వరకు పాఠశాలలను ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం ఉన్నత పాఠశాలలు 3 నుంచి 10వ తరగతి వరకు నడుస్తుండగా, 3 నుంచి 5వ తరగతి వరకు మినహాయిస్తారు. 6 నుంచి 10వ తరగతి వరకు మాత్రమే ఉన్నత పాఠశాలలను కొనసాగిస్తారు. ఈ ప్రక్రియ మొత్తంగా అమలు కావాలంటే విద్యాశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో కసరత్తు చేయాలి. ఈ తరగతుల విలీనం తరువాత మిగులుబాటుగా ఉన్న ఉపాధ్యాయులను ఎలా వినియోగించుకోవాలనే అంశంపైనా విద్యాశాఖ అధికారులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
ప్లస్-2 కళాశాలలు రద్దు కావచ్చా ?
రెండేళ్ల క్రితం జిల్లాలో 18 ఉన్నత పాఠశాలల్లో బాలికల కోసం ఇంటర్మీడియెట్‌లో వివిధ కోర్సులను ప్రవేశపెట్టారు. గత ప్రభుత్వం ఏడాది పాటు ఈ కళాశాలల్లో అధ్యాపకులను నియమించ కుండా, పిల్లలకు పాఠ్యపుస్త కాలు కూడా ఇవ్వకుండా మిన్నకుండిపోయింది. దీంతో 18 కళాశాలల్లోని నాలుగైదు మినహా మిగిలిన వాటిలో బాలికలు ఇంటర్మీడియెట్ కోర్సుల్లో ఆశించినంతగా చేరలేదు. ఏడాది తరువాత ప్లస్-2 కళాశాలల్లో పనిచేసేం దుకు అర్హత ఉన్న ఉపాధ్యాయులను అధ్యాప కులుగా నియమించారు. అయినా ఈ కళాశాలల్లో బాలికలు ఆశించిన స్థాయిలో చేరలేదు. ఈ కళాశాలలను రద్దుచేస్తే అక్కడ పనిచేసే అధ్యాపకులను మళ్లీ ఎక్కడ నియమి స్తారనే అంశంపైనా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మళ్లీ పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి ఎన్ని మార్పులు చోటు చేసుకుంటాయోనని, ఎంతమంది బదిలీ కావాల్సి వస్తుందోనని ఉపాధ్యాయ వర్గాల్లో చర్చనీయాంశం నడుస్తోంది.
Leave a Reply