భీమ్ న్యూస్ ప్రతినిధి అమరావతి (జనవరి 30) ఏపీలో కూటమి ప్రభుత్వం పేదలకు ఉచితంగా ఇంటి స్థలాలను కేటాయించేందుకు చర్యలు వేగవంతం చేసింది. ఇప్పటికే సొంతిల్లు లేని అర్హుల కోసం ప్రభుత్వం విశేష ప్రణాళికతో ముందుకు వెళుతోంది. ఇందులో భాగంగా, గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల చొప్పున స్థలాలను కేటాయించేందుకు ప్రభుత్వం నిబంధనలు విడుదల చేసింది. ఇటీవలె ఏపీ ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించి మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. మహిళల పేరుతో పట్టాలను పంపిణీ చేస్తారు. స్థలాల పట్టాలను మహిళల పేరుతోనే ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దారిద్ర్య రేఖకు (BPL) దిగువన ఉన్న తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబాలు మాత్రమే అర్హులు. కేబినెట్ సమావేశంలో ‘అందరికీ ఇల్లు’ పథకానికి ఆమోదం తెలిపిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జీఓ-23 ఉత్తర్వులు జారీ చేసింది.
పట్టాలను కన్వేయన్స్ డీడ్ రూపంలో అందజేస్తారు. రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఆర్.పీ. సిసోదియా తెలిపారు. 10 సంవత్సరాల తర్వాత యాజమాన్య హక్కులు పూర్తిగా లబ్ధిదారులకే. పట్టా ఇచ్చిన తేదీ నుంచి 2 ఏళ్లలోపు ఇంటి నిర్మాణం పూర్తి చేయాలి. ఈ ఉత్తర్వులు వెంటనే అమలులోకి వచ్చాయి.
ఈ పథకానికి అర్హూలు ఎవరంటే? లబ్ధిదారుకు ఏపీలో ఎక్కడా సొంత ఇల్లు లేదా స్థలం ఉండకూడదు. ఇప్పటికే కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ గృహ పథకాల్లో లబ్ధి పొందిన వారు అర్హులు కాదు. ఐదెకరాల మెట్ట భూమి లేదా 2.5 ఎకరాలకు మించి మాగాణి భూమి ఉన్నవారు అర్హులు కాదు. కుటుంబ సభ్యుల ఆధార్ కార్డును ఆధారంగా తీసుకుంటారు.
ప్రత్యేక ఏర్పాట్లు & అధికారుల బాధ్యతలు :
గత ప్రభుత్వ హయాంలో దూర ప్రాంతాల్లో కేటాయించిన, కానీ నిర్మాణం జరగని స్థలాలను రద్దు చేస్తారు. శ్మశానాలు, ముంపు ప్రాంతాల్లో ఉన్న స్థలాల కేటాయింపులను రద్దు చేసే అధికారం కలెక్టర్లకు ఉంటుంది. లేఅవుట్‌లలో ఖాళీగా ఉన్న ప్లాట్లు స్వాధీనం చేసుకొని అవసరమైన వారికి కేటాయిస్తారు. గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తులు స్వీకరించి పరిశీలిస్తారు. తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు కలెక్టర్ల ఆమోదంతో తుది లబ్ధిదారుల జాబితాను ప్రకటిస్తారు. ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు లబ్ధిదారులకు పొజిషన్ సర్టిఫికెట్‌లు జారీ చేస్తారు. పట్టాలు పొందిన వారికి ప్రభుత్వం గృహ నిర్మాణ శాఖ ద్వారా ఇళ్లను మంజూరు చేస్తుంది.
ప్రత్యేక ఏర్పాట్లు & అధికారుల బాధ్యతలు ఏంటంటే? :
ప్రభుత్వ సంస్థలు & కార్పొరేషన్ల వద్ద అనవసరంగా ఉన్న భూములను ఈ పథకానికి కేటాయించాలి. ఖాళీగా ఉన్న ఇండస్ట్రియల్ పార్కుల భూములను అవసరమైనట్లయితే ఉపయోగించవచ్చు. భూ సమీకరణ (ల్యాండ్ పూలింగ్) ద్వారా సేకరించిన భూములను పరిశీలించాలి. పేదలకు భూములు విరాళంగా ఇస్తే అటువంటి దాతలను గుర్తించాలి. పట్టాల పంపిణీకి తగిన భూమి లేకుంటే సమీప గ్రామాల్లో స్థలాలను గుర్తించాలి. కేవలం అత్యవసర పరిస్థితుల్లోనే ప్రైవేట్ భూములను కొనుగోలు చేయాలి. అసైన్డ్ భూములను సేకరించాల్సి వస్తే, యజమానులకు నష్టపరిహారం చెల్లించాలి.
పథకం పర్యవేక్షణలో :
రాష్ట్రస్థాయిలో రెవెన్యూ శాఖ మంత్రి ఛైర్మన్‌గా ఉన్న కమిటీ ఈ మొత్తం ప్రక్రియను పర్యవేక్షిస్తుంది. మున్సిపల్, హౌసింగ్ శాఖల మంత్రులు, అధికారులు సభ్యులుగా ఉంటారు. జిల్లాల స్థాయిలో ఇన్‌ఛార్జి మంత్రుల నేతృత్వంలో కమిటీలు ఏర్పడతాయి.పట్టణాల్లో ప్రభుత్వ భూమి లభించని చోట ఏపీ టిడ్కో, మున్సిపల్ కార్పొరేషన్ల ద్వారా ఇళ్లను నిర్మించి కేటాయిస్తారు. లబ్ధిదారులకు ఇంటి స్థలం లేదా ఇల్లు మంజూరు చేసిన 10 ఏళ్ల తర్వాత పూర్తి హక్కులు లభిస్తాయి. లబ్ధిదారులు ప్లాటును ఆధార్, రేషన్ కార్డులకు లింక్ చేయాలి – డూప్లికేట్ దరఖాస్తులు నివారించేందుకు.
ఇంటి స్థలాలు పొందేందుకు అవసరమైన పత్రాలు ఇవే :
ఆధార్ కార్డు (భార్య & భర్త సంతకాలు కలిగిన జిరాక్స్)
తెల్ల రేషన్ కార్డు జిరాక్స్
బ్యాంక్ అకౌంట్ జిరాక్స్
జాబ్ కార్డు జిరాక్స్
2 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు
కుల ధృవీకరణ పత్రం
ఆదాయ ధృవీకరణ పత్రం
ఆధార్ అనుసంధానం గల మొబైల్ నెంబర్
ఈ పత్రాలను సమర్పించిన తర్వాత అధికారులు అర్హత పరిశీలించి, లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. అందరికీ ఇల్లు పథకాన్ని పారదర్శకంగా అమలు చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.
Leave a Reply