భీమ్ న్యూస్ ప్రతినిధి న్యూఢిల్లీ జాతీయం (జనవరి 31) దేశంలో నెలసరి వాస్తవ సగటు వేతనాలు పెరగాల్సింది పోయి.. భారీగా తగ్గాయి. మరోవైపు కార్పొరేట్ల ఆదాయాలు, లాభాలు ఫుల్‌గా పెరిగాయి. దేశంలో కార్మికులు 2017-18 స్థాయిల కంటే తక్కువ వేతనాలు పొందుతున్నారని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎకనామిక్ సర్వేలో వెల్లడయ్యింది. 2017-18లో పురుష స్వయం కార్మికుల సగటు నెల వేతనాలు రూ.9,454గా ఉండగా.. 2023-24 నాటికి 9.1 శాతం తగ్గి రూ. 8,591కి పరిమితమయ్యాయి. ఇదే సమయంలో మహిళల స్వయం ఉపాధి కార్మికులకు నెలవారీ వేతనం 32 శాతం క్షీణించి రూ.2,950గా నమోదయ్యింది.
మరోవైపు పురుష వేతన కార్మికులకు నెలవారీ వేతనం 2017-18లో రూ.12,665 గా ఉండగా.. 2023-24 నాటికి 6.4 శాతం తక్కువతో రూ.11,858గా నమోదయ్యింది. ఇదే సమయంలో మహిళా వేతన కార్మికులకు రూ.10,116 నుండి 12.5 శాతం క్షీణించి రూ.8,855కు పరిమితమయ్యింది. పురుష క్యాజువల్ కార్మికుల వేతనాలు 2017-18 స్థాయిలతో పోలిస్తే 2023-24లో 19.2 శాతం పెరిగి రూ.242కు చేరింది. 2017-18లో ఇది రూ.203గా ఉంది.
మహిళలకు రూ.128 నుంచి 24 శాతం పెరిగి రూ.159కి చేరింది. “గత సంవత్సరాల్లో స్వయం ఉపాధి, జీతభత్యాల కార్మికుల వేతనాలు భారీగా తగ్గాయి. తొలుత నోట్ల రద్దు, కోవిడ్ లాక్డౌన్ వంటి వరుస ఆర్థిక విధాన షాక్‌లు. ఆ తర్వాత ద్రవ్యోల్బణం అధికంగా పెరిగింది. ఫలితంగా ప్రజల ఆదాయాలు క్షీణించాయి.” అని జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీ మాజీ ప్రొఫెసర్ అరుణ్ కుమార్ పేర్కొన్నారు. “2023-24లో కార్పొరేట్ల నికర లాభాలు 22.3 శాతం పెరిగాయి. గడిచిన నాలుగేళ్లలో సగటున 22 శాతం చొప్పున ఆదాయాలు పెరిగాయి. కంపెనీల ఆదాయాలు పెరిగిన ఉద్యోగుల వేతనాల్లో స్తబ్దత నెలకొంది.” అని ఆర్ధిక సర్వే పేర్కొంది.
Leave a Reply