భీమ్ న్యూస్ ప్రతినిధి న్యూఢిల్లీ -జాతీయం (ఫిబ్రవరి 01) కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ శనివారం ఉదయం 11 గంటలకు పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టడం వరుసగా ఇది 8వ సారి. మొరార్జీ దేశాయ్, పి చిదంబరం తరువాత అత్యధికసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రిగా ఆమె తన పేరు సుస్థిరం చేసుకున్నారు. అయితే, ఈ కేంద్ర బడ్జెట్‌పై దేశ ప్రజలు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు.
అధికారంలో ఎవరు ఉన్నారు అనే విషయంతో సంబంధం లేకుండా బడ్జెట్ వస్తోందంటే చాలు… ప్రతీసారి కార్పొరేట్ వర్గాల నుండి కామన్ మ్యాన్ వరకు అందరి ఆశ ఒక్కటే ఉంటుంది. ఈసారి బడ్జెట్‌లో తమకు ఎలాంటి మేలు కలుగుతుందా అని కార్పొరేట్ వర్గాలు, ఈసారైనా బడ్జెట్ తమకేమైనా పనికొస్తుందా అని జనం ఎదురుచూస్తునే ఉంటారు.
ఇన్‌కమ్ ట్యాక్స్ స్లాబ్ పెంచితేనే తమ జేబుకు పన్ను రూపంలో చిల్లు పడకుండా ఉంటుందని సామాన్యులు ఆశపడుతున్నారు. అంతేకాకుండా తమ రోజువారీ జీవితంలో పనికొచ్చే అనేక రకాల ఉత్పత్తులు, సేవలపై పన్ను భారం తగ్గించాలని వారు కోరుకుంటున్నారు. వివిధ రంగాల్లో ప్రోత్సాహకాల కింద ప్రభుత్వం ఇచ్చే సబ్సీడీలు పెంచాలని ఆశిస్తున్నారు.
కేంద్ర బడ్జెట్ 2025 అంచనాలు:
ఆదాయపు పన్ను శ్లాబులను సవరించడం
మౌలిక సదుపాయాల వ్యయాన్ని పెంచడం
గ్రామీణాభివృద్ధి, విద్యకు కేటాయింపులను పెంచడం
కేంద్ర ఆర్థిక మంత్రిగా సీతారామన్‌కు ఇది రికార్డు స్థాయిలో వరుసగా ఎనిమిదో బడ్జెట్ కావడం విశేషం. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరించాలన్న ప్రధాని మోదీ ఆకాంక్షలకు అనుగుణంగా వివిధ రంగాలకు ప్రాధాన్యతల మేరకు నిధులు కేటాయింపులు చేయనున్నారు.
బడ్జెట్ వేళ.. లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు :
9:30గంటల సమయంలో సెన్సెక్స్ 23 పాయింట్లు పెరిగింది.
37 పాయింట్ల లాభంతో నిఫ్టీ కూడా పెరిగింది.
ఆకట్టుకుంటున్న ‘బడ్జెట్ సైకత శిల్పం’ :
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశ పెట్టబోతున్న నేపథ్యంలో ఒడిశాలోని పూరీ తీరంలో సైకత శిల్పాన్ని రూపొందించిన కళాకారుడు సుదర్శన్ పట్నాయక్.
8 % వృద్ధితోనే ‘దేశం అభివృద్ధి’ :
2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే రాబోయే రెండు దశాబ్దాల పాటు 8% వృద్ధి సాధించాలని ‘ఆర్థిక సర్వే’లో తేలింది. దీని కోసం భూ – కార్మిక సంస్కరణలపై దృష్టి సారించాలని సూచించింది. పెట్టుబడులు కూడా జీడీపీలో 35% ఉండాలని పేర్కొంది. ఉత్పత్తి రంగాన్ని బహుముఖంగా విస్తరించాలని, కృత్రిమ మేధ (ఏఐ), రోబోటిక్స్, బయోటెక్నాలజీ రంగాలు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని వివరించింది.
ఏటా 78.5 లక్షల కొత్త ఉద్యోగాలు :
వ్యవసాయేతర రంగాల్లో 2030-32 వరకు ఏటా 78.5 లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టించాలి. విద్యాసంస్థలను బలోపేతం చేయడం ద్వారా నాణ్యమైన విద్య లభించే ఏర్పాట్లు చేయాలి. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని, అత్యంత నాణ్యమైన మౌలిక సదుపాయాలను కల్పించాలి. చిన్న, మధ్యతరహా పరిశ్రమల విస్తరణకు అనువైన పరిస్థితులు కల్పించాలి. వీటికి నియమ నిబంధనల ఒత్తిడి తక్కువగా ఉండాలి. వ్యాపార సంస్థల సమస్యలకు మూలకారణాలను అన్వేషించి, పరిష్కరించటం ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2.0’ లో భాగం కావాలని వివరించింది.
ఆర్థిక మార్కెట్లపై జాగ్రత్త చర్యలుగా :
ఆర్థిక – విధానపరమైన నిర్ణయాలను.. ఆర్థిక మార్కెట్లు మరీ ఎక్కువ ప్రభావితం చేయకుండా జాగ్రత్త వహించాలని ‘ఆర్థిక సర్వే’ హెచ్చరించింది. ఇటువంటి పరిస్థితిని ఆర్థిక శాస్త్రంలో ‘ఫైనాన్షియలైజేషన్’ అని వ్యవహరిస్తారు. స్థిరాస్తి, స్టాక్‌మార్కెట్లు ధరలు విపరీతంగా పెరగడం దీని ముఖ్య లక్షణాల్లో ఒకటి. అంతేగాక ఆర్థిక వ్యవస్థ కుంగిపోతుంది. అభివృద్ధి చెందుతున్న దేశాలు ఇంకా ఎక్కువ ఇబ్బంది పడతాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో అధిక ‘ఫైనాన్షియలైజేషన్’ వల్ల ప్రజలు, ప్రభుత్వాలపై రుణభారం అనూహ్యంగా పెరగడాన్ని దృష్టిలో ఉంచుకుని, ఈ విషయంలో మనదేశం అప్రమత్తంగా ఉండాలి. 2047 నాటికి ‘వికసిత్ భారత్’ లక్ష్యాన్ని సాధించాలంటే ఆర్థిక రంగం విస్తరణ, ఆర్థికాభివృద్ధి మధ్య సమతౌల్యాన్ని పాటించాలని పేర్కొంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఆర్థిక మార్కెట్లపై మరీ అధికంగా ఆధారపడటం వల్ల గత సంవత్సరం నష్టాలే ఎక్కువగా చవిచూడాల్సి వచ్చింది.
భారత్‌లోనే బ్యాంకులు బలంగా :
ఆర్థిక సేవల రంగం ఎన్నో సానుకూలతలను ప్రతిబింబిస్తోంది. బ్యాంకులు బలంగా ఉన్నాయని, డిపాజిట్లు- రుణాల్లో వృద్ధి మెరుగైన స్థితిలో ఉందని.. బ్యాంకుల లాభాలు కూడా పెరుగుతున్నాయని పేర్కొంది. బ్యాంకుల్లో వినియోగ రుణాలు పెరుగుతున్నట్లు వివరించింది. స్టాక్‌మార్కెట్ సూచీలు గరిష్ఠ స్థాయిలో ఉన్నందున, ఈక్విటీ పెట్టుబడులు గణనీయంగా పెరుగుతున్నాయని.. ఐపీఓ (పబ్లిక్ ఇష్యూ) లకు అధిక ఆదరణ లభిస్తున్నట్లు వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా అననుకూల పరిస్థితులున్నా, మనదేశంలో ఆర్థిక రంగం ఎంతో మెరుగైన స్థితిని ప్రదర్శిస్తోంది.
Leave a Reply