భీమ్ న్యూస్ ప్రతినిధి తణుకు (ఫిబ్రవరి 01) పశ్చిమగోదావరి జిల్లా తణుకులో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. రాత్రంతా వేదనతో ఉన్న ఆ ఎస్సై.. ఉదయమే సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు. తణుకు గ్రామీణ ఎస్సై ఆదుర్తి గంగ సత్యనారాయణమూర్తి (38) ప్రస్తుతం వీఆర్‌లో ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పెనుగొండ పర్యటన నేపథ్యంలో ఎస్కార్ట్ విధుల్లో చేరాలని గురువారం ఆదేశాలు రావడంతో జిల్లా కేంద్రం భీమవరం వెళ్లి సర్వీస్ రివాల్వర్ తెచ్చుకున్నారు. శుక్రవారం ఉదయం సుమారు 7.30 గంటలకు తణుకు రూరల్ పోలీసు స్టేషన్ వద్దకు చేరుకున్నారు. ద్విచక్ర వాహనం తాళం కూడా తీయకుండానే హడావుడిగా లోపలికి వెళ్లారు. కొంతసేపు అక్కడ కూర్చున్న అనంతరం బాత్రూమ్కు వెళ్లి, సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకున్నారు. దీంతో అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాన్ని తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆయనకు భార్య విజయ, ఎల్కేజీ చదువుతున్న కుమారుడు చందన్, 13 నెలల కుమార్తె దీక్షిత ఉన్నారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఎస్పీ అద్నాన్ నయీం అస్మి బాధిత కుటుంబ సభ్యుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. విచారణ చేస్తున్నట్లు తెలిపారు. తణుకు మండలం పైడిపర్రులోని పోలీస్ స్టేషన్‌కు సమీపంలో ఆయన నివాసం ఉంటున్నారు. గతేడాది నవంబరులో ‘గేదెల అపహరణ’ కేసులో నగదు చేతులు మారినట్లు ఆరోపణలు రావడంతో ఆయనతోపాటు మరో ఏఎస్సైను ఉన్నతాధికారులు వీఆర్‌కు పంపారు.
పోలీస్ స్టేషన్ వద్ద బంధువుల ఆందోళన :
ఆత్మహత్య విషయం తెలియడంతో ఎస్సై బంధువులు, స్నేహితులు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. సత్యనారాయణమూర్తిని మరో జిల్లాకు వీఆర్‌లో పంపుతూ గురువారం ఆదేశాలు వచ్చాయని, దీంతో ఆందోళనకు గురైన ఆయన రాత్రంతా నిద్ర పోలేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. స్టేషన్ వద్ద సెల్ఫోన్లో ఎవరితోనే ఛాట్ చేసి, తరువాత ఆత్మహత్యకు పాల్పడ్డారని పేర్కొంటున్నారు. అధికారులతో ఏర్పడిన మనస్పర్థలే ఆత్మహత్యకు పురిగొల్పాయని వాపోయారు. ఆత్మహత్యకు ముందు ఎవరితో ఛాట్ చేశారు? ఎవరితో ఫోన్లో మాట్లాడారు? అనే విషయాలు ఎందుకు బయట పెట్టడం లేదని ప్రశ్నించారు. వీఆర్‌లో పెట్టినంత మాత్రాన మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకునేంత బలహీన మనస్తత్వం ఆయనది కాదని కుటుంబ సభ్యులు తెలిపారు.
Leave a Reply